నీళ్లు కేసీఆర్ ఫాం హౌస్ కు.. నిధులు బీఆర్ఎస్ ఖాతాకు

నీళ్లు కేసీఆర్ ఫాం హౌస్ కు..  నిధులు బీఆర్ఎస్ ఖాతాకు
  • బొగ్గు గనులు లేని దామరచర్లలో 
  • యాదాద్రి పవర్ ప్లాంట్​ ఎందుకుపెట్టిన్రు?
  • జీ-9 బొగ్గు పేరుతో విదేశీ దిగుమతులకు స్కెచ్
  • ఏటా రూ.2 వేల కోట్ల బొగ్గు రవాణా భారం
  • కేసీఆర్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు: నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. చివరకు నీళ్లను తన ఫామ్‌‌హౌస్‌‌కు, నిధులను బీఆర్‌‌ఎస్ పార్టీ ఖాతాలకు, నియామకాలను తన కుటుంబానికే పరిమితం చేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ వనరులను అన్ని రంగాల్లో కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబం చివరకు ప్రజలకు గుండు సున్నా మిగిల్చిందని  ఆరోపించారు. శుక్రవారం ప్రజా భవన్‌‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. 

‘‘కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజాధనం దోచుకోవడమే కాకుండా.. కొండపోచమ్మ సాగర్ పేరిట నీళ్లను కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌‌హౌస్‌‌కే మళ్లించుకున్నరు’’ అని విమర్శించారు. ‘‘విదేశాల నుంచి విస్కీ తెచ్చుకోవడానికి సంతోష్ రావు స్పెషల్ లైసెన్స్ తీసుకున్నాడు. ఎవరికీ ఇవ్వని విధంగా, భారతదేశంలోనే మరెక్కడా లేని విధంగా ఒకే ఒక్క ‘టానిక్’ అనే షాప్‌‌కు విదేశాల నుంచి డైరెక్ట్‌‌గా హైదరాబాద్‌‌కు లిక్కర్ దిగుమతి చేసుకునేలా ప్రత్యేక అనుమతులు ఇప్పించుకున్నాడు. మరోవైపు డ్రగ్స్ వ్యవహారాలు, గంజాయి, కొకైన్ అన్నీ కేటీఆర్ తీసుకున్నాడు. 

ఇసుక మాఫియాను సంతోష్ రావు తండ్రి రవీందర్ రావు నడిపించిండు. చివరకు పాలను కూడా వదల్లేదు.. ఆంధ్రా వాళ్ల కాలేజీలు, హాస్పిటళ్లకు పాల సప్లయ్ కాంట్రాక్టులు మొత్తం హరీశ్ రావు తీసుకున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ తీసుకుంటే.. బొగ్గు దోపిడీని ప్రతిమా శ్రీనివాస్‌‌కు ఇచ్చిండు. ఇసుక, బొగ్గు, నీళ్లు, భూములు, మద్యం, పాలు.. చివరకు డ్రగ్స్ కూడా వదలకుండా వాళ్లు, వాళ్ల బంధువులు కలిసి దోచుకున్నారు’’ అని విమర్శించారు. దోచుకున్న సొమ్ముతో బీఆర్‌‌ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాల్లో ఏకంగా రూ.1,500 కోట్ల డబ్బు ఫిక్స్‌‌డ్ డిపాజిట్లుగా పెట్టి ఏటా కోట్లాది రూపాయల వడ్డీలు అనుభవిస్తున్నారని వివరించారు. 

కమీషన్ల కోసమే గనులకు దూరంగా ‘యాదాద్రి’ 

కమీషన్ల కోసమే బొగ్గు గనులకు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న దామరచర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌‌ను కేసీఆర్ నిర్మించారని రేవంత్ విమర్శించారు. విద్యుత్ ప్రాజెక్టులను బొగ్గు గనులుండే ప్రాంతాల్లో కడితే యూనిట్‌‌కు రూ.4 నుంచి రూ.5 కే కరెంట్ ఉత్పత్తి అయ్యేదని వివరించారు. కానీ బొగ్గు గనులకు చాలా దూరంగా దామరచర్లలో 4,000 మెగావాట్ల ప్లాంట్‌‌ను ఏర్పాటు చేసి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.28 వేల కోట్ల నుంచి రూ.37,800 కోట్లకు పెంచారన్నారు. ఇలా రూ.8 వేల  కోట్ల ప్రజాధనాన్ని దోచేశారని ఆరోపించారు. 

ఈ దోపిడీ ఇంకో 50 ఏళ్ల పాటు కొనసాగేలా బాయిలర్లను కావాలనే గ్రేడ్–9  బొగ్గుకు తగ్గట్లుగా డిజైన్ చేశారని సీఎం చెప్పారు. సింగరేణి వద్ద ఉన్న నిల్వలు ఇప్పటికే ఇతర ప్లాంట్లకు కేటాయించగా, యాదాద్రి కోసం ఏటా 14 మిలియన్ టన్నుల విదేశీ బొగ్గును ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టుల నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా దామరచర్లకు రవాణా చేయాల్సి వస్తోందన్నారు. ఇందుకోసం రైల్వే రవాణా చార్జీల కింద ఏటా రూ.2 వేల కోట్ల చొప్పున, 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలపై ఏకంగా లక్ష కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని వివరించారు. కేసీఆర్ బినామీ, ప్రతిమా గ్రూప్ అధినేత ప్రతిమా శ్రీనివాసరావు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కోసమే ఈ కుట్ర చేశారన్నారు.  దీంతో యూనిట్ కరెంట్ తయారీకి రూ.6.66 నుంచి రూ.7 ఖర్చవుతోందని మండిపడ్డారు. 

రాచరికంవైపు దేశం

దేశాన్ని ప్రధాని మోదీ రాచరికంవైపు తీసుకెళ్తున్నారని సీఎం రేవంత్‌‌రెడ్డి మండిపడ్డారు. దేశంలో  రెండు రకాల పౌరులను తయారు చేస్తున్నారని ఆరోపించారు. ఓటు హక్కు ఉన్న ఆగర్భ శ్రీమంతులు ఒక రకమైన పౌరులు కాగా, ఓటు హక్కు లేని నిరుపేదలు రెండో రకమైన పౌరులు అని తెలిపారు.  

క్షుద్రపూజలు చేయించేటోళ్లు నీతులు చెప్తున్నరు

ఇవాళ ప్రపంచమంతా ఎల్‌‌నినోతో అల్లాడుతుంటే..  మామా అల్లుళ్లు ఇద్దరే పెద్ద మేధావులైనట్లు ప్రపంచ విపత్తును అర్థం చేసుకోకుండా ప్రజలకు ఇది ‘కాంగ్రెస్ తెచ్చిన కరువు’ అని చెప్పడానికి వీళ్లకు సిగ్గుండాలని సీఎం మండిపడ్డారు. ‘‘ఇవాళ హరీశ్‌‌ రావు మాటలు నమ్ముకొని రైతులు పంటలు వేసుకుంటే, సాగునీరు వస్తదని ఆశపడితే.. నష్టపోతారు.. హరీశ్‌‌ రావును నమ్ముకుంటే మట్టితోనే అంబలి కాసుకోవాల్సి వస్తది. కనీసం జొన్నలో, సజ్జలో దొరికి అంబలి చేసుకునే పరిస్థితి కూడా ఉండదు.. అంత పచ్చి అబద్ధాలకోరు హరీశ్‌‌ రావు. 

తెలంగాణలో ఎట్లయినా కరువు రావాలని, పంటలు ఎండిపోయి ప్రజలు చచ్చిపోవాలని, తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని.. హరీశ్‌‌ రావు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు పోయి చేతబడులు చేయించిండని కొందరు నేతలు చెప్పారు. తెలంగాణకు కీడు జరగాలని, ప్రజలు నాశనం కావాలని సరిహద్దు రాష్ట్రాల్లో క్షుద్రపూజలు చేయించేటోళ్లు, మంత్రగాళ్లు, నేరగాళ్లు ఇవాళ వచ్చి మనకు నీతులు చెప్తే.. నమ్మాల్సిన అవసరం లేదు’’ అని సీఎం అన్నారు. 

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అలర్ట్‌‌గా ఉండాలి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రజాప్రతినిధులు, నేతలందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.  ప్రతి గ్రాడ్యుయేట్‌‌ను ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు. అభ్యర్థుల ఎంపికపై పార్టీ నిర్ణయమే ఫైనల్ అని,  యువకులైన సామ రామ్మోహన్‌‌రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అభ్యర్థిత్వాలను పార్టీ అధిష్టానం ఎంపిక చేసిందని చెప్పారు.  వారిని అందరం కలిసి కష్టపడి పనిచేసి  గెలిపించుకోవాలని సూచించారు. ‘‘ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ దొంగదెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నాయి. 

వెనుక అలయ్ బలయ్ చేసుకుంటున్నాయి. సర్పంచ్‌‌ ఎన్నికల్లో 66 శాతం పార్టీ పేరు మీద గెలిచాం. మున్సిపల్ ఎన్నికల్లో 85 శాతంతో పార్టీ గుర్తుపై గెలిచాం. ప్రతి ఎన్నికలో కార్యకర్తలు, నాయకులు ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ గెలుపు సాధ్యమైంది” అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు అభ్యర్థులకు మాత్రమే సంబంధించినవి కావని, పార్టీకి  సంబంధించిన ఎలక్షన్‌‌లని చెప్పారు. ఎన్నికలు లేని జిల్లాలకు చెందిన నాయకులకు కూడా బాధ్యతలు అప్పగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.