ప్రభుత్వ అడ్వైజర్లుగా షబ్బీర్​ అలీ, హర్కర వేణుగోపాల్​

ప్రభుత్వ అడ్వైజర్లుగా షబ్బీర్​ అలీ, హర్కర వేణుగోపాల్​

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర సర్కారు ముగ్గురు ప్రభుత్వ సలహాదారులను, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిని నియమిం చింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. వేం నరేందర్​ రెడ్డి, షబ్బీర్​అలీ, హర్కర వేణుగోపాల్​ను ప్రభుత్వ సలహాదారులుగా, పీసీసీ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్ మల్లు రవిని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. అందరికీ కేబినెట్ హోదాతో పదవులను ఇచ్చింది. అయితే, వాళ్లు ఎంతకాలం ఈ పదవిలో కొనసాగుతారన్న విషయాన్ని మాత్రం ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. సీఎం రేవంత్​కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న వేం నరేందర్​రెడ్డికి సీఎం సలహాదారుగా అవకాశం దక్కింది. షబ్బీర్​అలీని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖలు, హర్కర వేణుగోపాల్​ను ప్రొటోకాల్, పబ్లిక్​ రిలేషన్స్ సలహాదారులుగా ప్రభుత్వం నియమించింది. 

రేవంత్​ వెన్నంటే వేం నరేందర్

సీఎం రేవంత్​రెడ్డికి వేం నరేందర్​రెడ్డి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్​ఆశించినా దక్కలేదు. ఎమ్మెల్సీ రేసులోనూ నిలిచారు. అయితే పార్టీలో సీనియర్లు ఎక్కువ మంది ఉండటంతో అదీ దక్కలేదు. ఈ క్రమంలోనే ఆయనకు మంచి పదవి ఇస్తామంటూ పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు. సీఎం రేవంత్​కు సలహాదారుగా నియమిస్తూ కేబినెట్​హోదానూ ఇచ్చారు. రేవంత్​రెడ్డితో వేం నరేందర్​రెడ్డిది దాదాపు17 ఏండ్ల అనుబంధం. ఇండిపెండెంట్​ఎమ్మెల్సీగా రేవంత్​ఎన్నికై ఆ తర్వాత టీడీపీలో చేరినప్పటి నుంచి అప్పటికి టీడీపీలో ఉన్న వేం నరేందర్​రెడ్డితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో వేంనరేందర్‌‌‌‌ ప్రాతినిధ్యం వహించిన మహబూబాబాద్‌‌‌‌ రిజర్వ్‌‌‌‌డ్‌‌‌‌ అయిపోయింది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్​లో చేరారు. పీసీసీ చీఫ్​గా ఉన్న రేవంత్​వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారు. అందులో భాగంగానే వేం నరేందర్ రెడ్డికి సీఎం సలహాదారుగా ఇచ్చి మరింత దగ్గరుండేలా చూసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 

షబ్బీర్ అలీకీ చాన్స్​

షబ్బీర్​ అలీ సీనియారిటీ, పార్టీకి అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సలహాదారుగా అవకాశం దక్కింది. ఎమ్మెల్సీ, ఎంపీ సీటు కోసం రేసులో ఉన్న ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉందన్న చర్చలు జరిగినా.. చివరకు కేబినెట్ హోదాతో షబ్బీర్​ అలీని ప్రభుత్వం సలహాదారుగా అవకాశం కల్పించింది. ఇక, ఎమ్మెల్సీగా అవకాశం కోసం ఎదురు చూసిన హర్కర వేణుగోపాల్​కూ సలహాదారు పదవి దక్కింది. ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేసిన మల్లు రవికి ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కేబినెట్ హోదాతో పదవి  ఇచ్చింది. నలుగురికి కీలక పదవులివ్వడం ద్వారా సీనియర్లకు కాంగ్రెస్​ ప్రభుత్వం పెద్దపీట వేసింది. అదే సమయంలో ఎమ్మెల్సీ, ఎంపీలకు పోటీలో ఉన్న మరికొందరు సీనియర్​లీడర్లకూ లైన్​క్లియర్​చేసినట్టయింది. ఎమ్మెల్సీ పదవులకు ఇప్పటికే పోటీ తీవ్రంగా ఉన్నది. ఎంపీ స్థానాలకూ కొన్ని చోట్ల పోటీ ఉంది.  

నామినేటెడ్​ పోస్టులు కొలిక్కి!

లోక్​సభ ఎన్నికలు వచ్చేలోపు పార్టీ కోసం పనిచేసిన నేతలకు పదవులు ఇవ్వాలని కాంగ్రెస్​ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. చాలా మంది నేతలు అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు కూడా. ఈ క్రమంలోనే పోస్టుల భర్తీని వేగవంతం చేసినట్టుగా ఇటు పార్టీ, అటు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే నలుగురు పార్టీ సీనియర్లను ప్రభుత్వ సలహాదారులుగా నియమించినట్టు చెప్తున్నారు. నామినేటెడ్​ పోస్టులూ ఓ కొలిక్కి వచ్చినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. టీఎస్​ఐఐసీ, ఆర్టీసీ చైర్మన్​పోస్టుల భర్తీని అతి త్వరలోనే చేపట్టే అవకాశమున్నట్టు సమాచారం. కార్పొరేషన్​ చైర్​పర్సన్​లను ఈ నెలాఖరులోపు నియమించే అవకాశాలున్నట్టు చెప్తున్నారు. సీఎం రేవంత్​రెడ్డి లండన్​టూర్​ముగించుకుని వచ్చాక వాటిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. తొలి విడతలో భాగంగా15 నుంచి 20 మందికి చైర్మన్లుగా అవకాశం కల్పించొచ్చని సమాచారం.