కల్యాణ లక్ష్మిలబ్ధిదారులకు లక్ష నగదుతో పాటు తులం బంగారం

కల్యాణ లక్ష్మిలబ్ధిదారులకు లక్ష నగదుతో పాటు తులం బంగారం
  •  ప్రతిపాదనలు రెడీ చేయాలన్న సీఎం
  • పార్లమెంటు సెగ్మెంటుకో బీసీ స్టడీ సర్కిల్
  •  ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలకు ఇంటిగ్రేటెడ్ భవనాలు నిర్మిద్దాం
  • రాష్ట్రంలో కులగణనకు  ఏర్పాట్లు చేయండి
  • అంచనా వ్యయాన్ని సిద్ధం చేయాలన్న రేవంత్
  • బీసీ, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలపై సమీక్ష

హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కల్యాణ లక్ష్మి పథకం కింద కొత్త జంటకు రూ. లక్షతో  పాటు తులం బంగారం ఇద్దామని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో బీసీ, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తులం బంగారం ఇవ్వడానికి ఎంత బడ్జెట్ అవసరం ఉంటుందో అంచనాలు రూపొందించాలన్నారు.

ప్రతి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేద్దామని, ఈ అంశంపై పూర్తి స్థాయిలో స్టడీ చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు అవసరమైన బడ్జెట్ అంచనాలను సిద్ధం చేయాలని, ఆ మొత్తాన్ని గ్రీన్ చానల్ ద్వారా విడుదల చేయాలని ఆదేశించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలల వివరాలు అందించాలని, అవసరమైన చోట సొంత భవనాల నిర్మాణానికి అంచనా రూపొందించాలని సూచించారు. సమీక్షలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు షబ్బీఆర్ అలీ తదితరులు పాల్గొన్నారు.