సొంత రాష్ట్రంలో ప్రజలు చచ్చిపోతుంటే.. మహారాష్ట్రలో రాజకీయాలా: రేవంత్ రెడ్డి

సొంత రాష్ట్రంలో ప్రజలు చచ్చిపోతుంటే.. మహారాష్ట్రలో రాజకీయాలా: రేవంత్ రెడ్డి
  • ఢిల్లీ తెలంగాణ భవన్​లో ఎంపీ కోమటిరెడ్డితో కలిసి ధర్నా
  • బీఆర్ఎస్ బంధయ్యేందుకే.. రైతు, దళిత, మైనార్టీ బంధులు : వెంకట్​రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: కేసీఆర్ కు తెలంగాణతో పేగుబంధం తెగిపోయిం దని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించాల్సిన సీఎం, రాజకీయాల కోసం మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్లారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజాధనంతో ప్రత్యేక విమానంలో తిరుగుతూ రాజకీయాలు చేయడానికి సిగ్గుండాలని ఫైర్​అయ్యారు. కేసీఆర్ మహారాష్ట్ర టూర్ ను వ్యతిరేకిస్తూ మంగళవారం రేవంత్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు కేసీఆర్, బీఆర్ఎస్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశారని ఫైర్ అయ్యారు. తాజాగా కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల నష్టం జరిగిందని చెబుతున్న కేసీఆర్.. రోడ్ల బాగుకు మాత్రమే రూ.500 కోట్లు రిలీజ్ చేశారన్నారు. 

‘‘చనిపోయిన వారి కుటుంబాలకు, నీట మునిగిన పంటకు రూపాయి కూడా ఇవ్వరా? రైతుల ప్రాణాలంటే లెక్క లేదా? చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. పంట నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ.25 వేలు, ఇసుక మేటలు వేసిన ప్రతి ఎకరానికి రూ.20 వేల పరిహారం ఇవ్వాలె’’ అని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎంపీలు అసలు ఎందుకు పార్లమెంట్ కు వస్తున్నారో వారికే తెలియడం లేదన్నారు. 

‘బతుకులేని’ తెలంగాణ అయ్యింది: కోమటి రెడ్డి

కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ కాదు.. బతుకులేని తెలంగాణగా మారిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి విమర్శించారు. కేసీఆర్ తెచ్చిన రైతు బంధు, మైనార్టీ బంధు, బీసీ బంధులు.. బీఆర్ఎస్ బంధువయ్యేందుకే అన్నారు. ఇలాంటి బంధులను నమ్మి రైతులు, ప్రజలు మోసపోవద్దని కోరారు. దేశ రాజకీయాలపై నిజంగా అంత ప్రేమే ఉంటే.. ఎందుకు కర్నాటక ఎన్నికల్లో పోటీ చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ కు మానవత్వం లేదన్నారు. రైతులను ఆదుకోకపోతే త్వరలో ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మూడు నెలల్లో తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, అందాక రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. ఓట్ల కోసమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారని చెప్పారు.