కేసీఆర్​ ఉంటే ఐదు వేలే.. ఓడితే 15 వేలు వస్తయ్​

కేసీఆర్​ ఉంటే ఐదు వేలే.. ఓడితే 15 వేలు వస్తయ్​
  • రైతు బంధు నిలిపివేతపై రేవంత్ రెడ్డి
  • హరీశ్​రావు మాటలతోనే రైతు బంధు ఆగింది
  • ఖాతాలో డబ్బులు వేయాలని మేమే ఈసీని కోరాం
  • కొలువులు రావాలంటే కేసీఆర్, కేటీఆర్ పదవులు ఊడగొట్టాలి
  • లంబాడా బిడ్డలకు విద్యను దూరం చేసే కుట్ర జరుగుతున్నది
  • మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సభలో పీసీసీ చీఫ్‌‌

మహబూబాబాద్, వెలుగు: ‘‘సీఎం కేసీఆర్ అతి తెలివి, మినిస్టర్ హరీశ్ రావు నోటి దూల కారణంగానే రైతుబంధు ఆగింది. రైతు బంధు పైసలు రైతుల ఖాతాలో వేయాలని మేమే ఈసీకి విజ్ఞప్తి చేశాం. ఈసీ అనుమతిచ్చినా రైతులకు అందకుండా చేసిన్రు. కేసీఆర్ ఉంటే రూ.5 వేలు మాత్రమే వస్తాయి. కేసీఆర్ ఓడితే రైతు బంధు కింద రూ.15 వేలు వస్తాయి’’ అని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి చెప్పారు. 

సోమవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ (డోర్నకల్ సెగ్మెంట్)లో జరిగిన కాంగ్రెస్​విజయభేరి సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఉద్యోగాలు లేక రాష్ట్రంలోని 30 లక్షల మంది యువతీయువకుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని అన్నారు. యువతకు కొలువులు రావాలంటే  కేసీఆర్, కేటీఆర్ పదవులు ఊడగొట్టాలని చెప్పారు. కేసీఆర్ తిన్నింటి వాసాలు లెక్కబెట్టే రకమని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. సోనియా తెలంగాణ ఇయ్యకపోతే కేసీఆర్ ఫ్యామిలీ పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించాలన్నారు. ఇన్నేండ్లు గిరిజనులపై సవతి తల్లి ప్రేమ చూపించాడని, లంబాడా బిడ్డలను విద్యకు దూరం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 

ధరణితో వేల ఎకరాలు కబ్జా

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్షల కోట్లు దోచేసిందని, ధరణిని అడ్డం పెట్టుకుని వేల ఎకరాలు కబ్జా చేసిందని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విచారణ జరిపించి, అందరినీ చర్లపల్లి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. బంగారు తెలంగాణ చేస్తామంటూ కేసీఆర్ బొందల గడ్డగా మార్చాడని మండిపడ్డారు. ఊరూరా బెల్ట్ షాపులు తెరిచి రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ తాగుబోతుల అడ్డగా మార్చారని, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యల్లోనూ టాప్​లో నిలిపారని దుయ్యబట్టారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్​, ఆయన కూతురు ఎంపీ కవితకు కాంగ్రెస్ పార్టీ చాన్స్​ ఇస్తే.. కార్యకర్తల గుండెలపై తన్ని పార్టీ ఫిరాయించారని అన్నారు. 

ఇసుక, బియ్యం దందా, అక్రమ వ్యాపారాలకు రెడ్యానాయక్ కుటుంబం అడ్డాగా మారిందన్నారు. ఎన్నికల్లో రెడ్యా నాయక్​ను ఇంటికి పంపించేందుకు జనం రెడీ అయ్యారన్నారు. కృష్ణా జలాలను ఈ ప్రాంతానికి తీసుకురాకుండా బీఆర్ఎస్ అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జాటోత్​రామచంద్రు నాయక్ ను గెలిపిస్తే, డోర్నకల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.