
సీఎం కేసీఆర్ ను నిద్రపోనీయకుండా ఇకపై హుజురాబాద్ లో పర్యటిస్తానన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. హుజురాబాద్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన దళిత బంధు సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలపై కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.
దళిత బంధు స్కీం పాతదేనట.. మరి సిద్ధిపేటలోని దళితులంతా కోటీశ్వరులు, కుబేరులయ్యారా? అని ప్రశ్నించారు. అక్కడ కట్టించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు వానకు కూలిపోతున్నాయి. రాత్రి పడుకుంటే తెల్లారి బతుకుతరో లేదో తెలియకుండా ఉందన్నారు. నీలాంటి నరుకుడు పోశెట్టి ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరన్నారు. ప్రపంచంలోని నీలాంటి దగాకోరులకు దళితబంధు దిక్సూచి అవుతుందన్నారు. ఇండియా టుడే సర్వేలో టాప్ టెన్ లో కేసీఆర్ లేకపోగా.. ఆయన ఏ స్థానంలో ఉన్నడో తెలియదన్నారు.
తెలంగాణ ట్రాన్స్ కో లక్షా 10 వేల కోట్ల అప్పులో మునిగిపోయిందన్నారు ఎంపీ అర్వింద్.కేసీఆర్ వచ్చాకా ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తి కూడా పెంచలేదని తెలిపారు. మిషన్ భగీరథ దేశానికి ఆదర్శమట.. కానీ 2004-05 లోనే గుజరాత్ లో ఇంతకంటే తక్కువ ఖర్చుతో అక్కడ తాగునీటి పథకం తెచ్చారన్నారు. ఇక్కడ మాత్రం మిషన్ భగీరథ పనుల్లో 30 శాతం కమిషన్లు కొట్టేశారని విమర్శించారు.
దళితున్ని సీఎం చేస్తానంటివి.. మాట తప్పితివి. నీ క్యాబినెట్ లో ఉన్నది ఒక్కరే ఎస్సీ, ఒక్కరే ఎస్టీ ఉన్నారు అని అన్నారు. కేంద్రంలో బీసీ ప్రధాని, ఎస్సీ రాష్ట్రపత్రి, మోడీ కేబినెట్ లో 27 మంది బీసీలు, 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలున్నారని తెలిపారు అర్వింద్. కేసీఆర్ కెబినేట్ లో ఉన్న మైనార్టీ మంత్రి.. హిందువులను అణచివేసేందుకే ఉన్నాడన్నారు. కేసీఆర్ మంత్రి వర్గంలో 11 మంది అగ్రవర్ణాల మంత్రులే ఉన్నారని తెలిపారు. ఇదా నీ సామాజిక న్యాయం... ప్రధాని మోడీ పాదాలు కడిగి నీ నెత్తిపై చల్లుకో అని అన్నారు.
కరోనా కారణంగా దళితబంధు ఆలశ్యమైందంటున్న కేసీఆర్.. మరి కరోనా సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికలెలా పెట్టాడుని ప్రశ్నించారు ఎంపీ అర్వింద్. పారసిటమాల్ వేసుకుంటే తగ్గిపోయే కరోనా వల్ల.. దళితబంధు ఆపావా?అని అన్నారు. ఇక్కడ ఏ పథకం వచ్చినా.. అదంతా ఈటల వల్లేనని తెలిపారు. హుజురాబాద్ ప్రజలను మభ్యపెట్టేలా ఇక్కడ పనులు మొదలు పెట్టారని..కేవలం ఓడిపోతామన్న భయంతోనే దళితులకు పదిలక్షల స్కీం తెచ్చాడన్నారు. హుజురాబాద్ లో అమలు చేసే దళితబంధు రాష్ట్రానికి ఆదర్శమని చెప్పి.. జీవో వెబ్ సైట్ లో ఎందుకు పెట్టలేదన్నారు. గతంలో కూడా నిజామాబాద్ లో అనేక కుల సంఘాలకు ప్రొసీడింగ్స్ ఇచ్చినా ఇప్పటి వరకు అతీగతీ లేదన్నారు. ఈ బేవకూఫ్ కు ఒక్కటన్నా ఇగురముందా? అన్న అర్వింద్..చెరుకు పరిశ్రమ మూసేస్తివి... పసుపు పంటకు మద్దతు ధరకు కనీసం లెటర్ రాసావా? అని అన్నారు. కేంద్రం వరికి మద్ధతు ధర ఇస్తుంది కాబట్టే.. రైతులంతా వరివైపు వస్తున్నారని చెప్పారు.
పప్పులు, నూనెలు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. వీటిపైన దృష్టి పెట్టావా? ..వరి తరలించే ట్రాన్స్ పోర్ట్ చేసే కాంట్రాక్టులు కూడా మీ ఎమ్మెల్యేలే తీసుకున్నారని తెలిపారు. రైతుల రుణమాఫీ సంగతి ఏమైందన్న అర్వింద్. పంట నష్టపోతే ఆదుకునే ఫసల్ బీమాకు ఎందుకు ప్రీమియం కట్టించలేదని అన్నారు.
నాలుగున్నర లక్షల కోట్లు రూపాయల అప్పు చేసి అందులో 30 శాతం కమిషన్లు నీ కుటుంబసభ్యులు కాజేసారని ఆరోపించారు. హుజురాబాద్ ఎన్నికలు మరికొంత కాలం ఆలశ్యం కావచ్చు.. ఈలోపు హుజురాబాద్ ప్రజలకిచ్చిన హమీలన్నీ నేరవేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రజలకు సూచించారు. ఎన్నికలైపోతే.. ఈ నాయకులు మళ్లీ దొరకరని తెలిపారు. 2023 తర్వాత విజయ్ మాల్యాలాగా కేటీఆర్, కవిత, సంతోష్ రావు దేశాన్ని వదిలేసి పారిపోతారన్నారు. 13 ఏళ్లు కష్టపడ్డాడన్నసానుభూతితో కేసీఆర్ ను ఏమనకపోవచ్చు. కానీ వీళ్ల కుటుంబసభ్యులంతా పారిపోక తప్పదన్నారు. హుజురాబాద్ లో ఓడిపోతామన్న భయం లేకపోతే.. ఇంటెలిజెన్స్ పోలీసుల నిఘా ఎందుకు ? అని ప్రశ్నించారు. ఇప్పటికే 200 కోట్లు పెట్టి నాయకులను కొనుగోలు చేసాడన్నారు.
ఆయన కొనుగోలు చేసిన వాళ్లలో కాంగ్రెసోళ్లున్నారన్న అర్వింద్.. 2023 నాటికి రేవంత్ రెడ్డి రెండో కొడుకు అవతాడన్నారు. ఆయన దత్తత తీసుకున్నాకే పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడన్నారు. కేసీఆర్ కు ఈటల అంటే భయం కాబట్టే ఇన్ని పథకాలు హుజురాబాద్ కు వస్తున్నాయన్నారు. గొర్రెలు, బర్రెలు కాసుకునే మా బీసీ యువకులు బతకాలా?..ముందు నీ కొడుక్కి, బిడ్డకు పది గొర్రెలు కొనిచ్చి కాసుకోమని చెప్పు అని అన్నారు. గెలిచే దగ్గర కేటీఆర్ కు ఎన్నికల బాధ్యతలిచ్చి.. ఓడిపోయే దగ్గర హరీశ్ రావుకు బాధ్యతలు ఇస్తాడన్నారు.
బోధనలో 52 మంది రోహింగ్యాలు దొంగపాస్ పార్టులతో పట్టుబడితే వారికి పోలీసులు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. వారికి మద్దతు ఇవ్వడమంటే.. టెర్రరిస్టులకు అండగా ఉన్నట్లేనన్నారు.రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక యూఏపీఏ యాక్టు కింద ఐపీఎస్ ఆఫీసర్లను బుక్ చేస్తామన్నారు.
కేసీఆర్ పతనం చూసే వరకు నిద్రపోయేది లేదు.. ఆయన భాషతోనే ఆయనకు సమాధానం చెబుతామన్నారు అర్వింద్. దళితబంధు లక్షా 70 వేలు ఖర్చు చేయాలంటే కేసీఆర్, ఆయన కొడుకు, మనమడు ముఖ్యమంత్రి అయినా సాధ్యం కాదన్నారు. ఇండ్లు కట్టిస్తామని చెప్పి వాటికే దిక్కులేదు. ఇన్ని డబ్బులు ఎలా తెస్తాడని ప్రశ్నించారు. సీఎస్ సోమేశ్ కుమార్ పెద్ద దొంగ.. అన్ని కేంద్రానికి అబధ్దాలు చెబుతున్నాడుని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కావడం కేసీఆర్ కు ఇష్టం లేదన్నారు.