విభజన సమస్యలూ పరిష్కరించాలని అమిత్ షాకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

విభజన సమస్యలూ పరిష్కరించాలని అమిత్ షాకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
  • తెలంగాణకు అదనంగా కేటాయించండి
  • కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, హర్దీప్ సింగ్ పూరీతోనూ భేటీ
  • మెట్రో సెకండ్ ఫేజ్ సవరణలకు ఆమోదం తెలపండి..
  • ‘పాలమూరు’కు జాతీయ హోదా ఇవ్వండి
  • ‘పీఎం ఆవాస్ యోజన’ కింద ఇందిరమ్మ ఇండ్లకు అనుమతివ్వాలని విజ్ఞప్తి
  • ఇయ్యాల యూపీఎస్సీ చైర్మన్​తో రేవంత్, ఉత్తమ్ సమావేశం

న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆయన గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, హర్దీప్ సింగ్ పూరీలతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వినతి పత్రాలు అందజేశారు. పాలనా సౌలభ్యం కోసం తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ విభ‌జ‌న స‌మ‌యంలో తెలంగాణ‌కు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారుల‌ను కేటాయించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాల విభ‌జ‌న‌ జరిగింది. రాష్ట్రానికి అద‌నంగా 29 ఐపీఎస్ పోస్టులను మంజూరు చేయండి” అని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అమిత్ షా.. ఈ ఏడాదిలో వ‌చ్చే కొత్త బ్యాచ్ నుంచి తెలంగాణ‌కు అదనంగా ఐపీఎస్​లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే విభజన సమస్యలను కూడా అమిత్ షా దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల విభ‌జ‌న‌ను పూర్తి చేయాల‌ని, ప‌దో షెడ్యూల్​ లోని సంస్థలపై ఉన్న వివాదాన్ని ప‌రిష్కరించాల‌ని కోరారు. ఢిల్లీలోని ఉమ్మడి రాష్ట్ర భ‌వ‌న్ విభ‌జ‌న‌ను పూర్తి చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. విభజన చ‌ట్టంలో పేర్కొన‌ని సంస్థలు తమవేనంటూ ఏపీ సర్కార్ అంటోందని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

హైద‌‌రాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్​ను సవరించామని, ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కేంద్ర ప‌‌ట్టణాభివృద్ధి శాఖ మంత్రి హ‌‌ర్దీప్‌‌సింగ్ పూరీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘‘మూసీ రివ‌‌ర్ ఫ్రంట్‌‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల‌‌ని నిర్ణయించాం. అమ్యూజ్‌‌మెంట్ పార్కులు, చిల్డ్రన్స్ వాట‌‌ర్ స్పోర్ట్స్‌‌, బిజినెస్ ఏరియాల‌‌తో బ‌‌హుళ విధాలుగా మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేస్తం. దీనికి కేంద్ర ప్రభుత్వం స‌‌హ‌‌కారం అవ‌‌స‌‌ర‌‌ం. అవ‌‌స‌‌ర‌‌మైన మ‌‌ద్దతు ఇవ్వాలి” అని కోరారు. ‘‘రాష్ట్రంలో పేద‌‌ల‌‌కు ఇందిర‌‌మ్మ ఇండ్లు నిర్మించి ఇస్తాం. పీఎం ఆవాస్ యోజ‌‌న పథకం కింద ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చేందుకు అనుమ‌‌తి ఇవ్వండి. ఇండ్లు మంజూరు చేయ‌‌డంతో పాటు పెండింగ్ నిధులను విడుదల చేయండి” అని విజ్ఞప్తి చేశారు.

‘పాలమూరు’కు అనుమతులివ్వండి..

పాల‌‌మూరు–-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర జ‌‌లశ‌‌క్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్​ను రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర నీటి పారుద‌‌ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌‌ రెడ్డితో కలిసి షెకావత్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రాముఖ్యతను కేంద్రమంత్రికి ఉత్తమ్ వివ‌‌రించారు. ‘‘క‌‌రువు, ఫ్లోరైడ్ పీడిత జిల్లాలైన నాగ‌‌ర్‌‌క‌‌ర్నూల్‌‌, మ‌‌హ‌‌బూబ్‌‌న‌‌గ‌‌ర్‌‌, వికారాబాద్‌‌, నారాయ‌‌ణ‌‌పేట, రంగారెడ్డి, న‌‌ల్గొండ జిల్లాల్లో 12.30 ల‌‌క్షల ఎక‌‌రాల‌‌కు పాల‌‌మూరు ప్రాజెక్టు నుంచి సాగు నీళ్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి ఆరు జిల్లాల ప‌‌రిధిలోని 1,226 గ్రామాల‌‌తో పాటు హైద‌‌రాబాద్ మ‌‌హా న‌‌గ‌‌రానికి తాగు నీరు స‌‌ర‌‌ఫ‌‌రా చేయాల్సి ఉంది. ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ప‌‌లు అనుమ‌‌తులు తీసుకున్నా.. ఇంకా హైడ్రాల‌‌జీ, ఇరిగేష‌‌న్ ప్లానింగ్‌‌, అంచ‌‌నా వ్యయం, బీసీ రేషియో, అంత‌‌ర్రాష్ట్ర అంశాలు కేంద్ర జ‌‌ల సంఘం ప‌‌రిశీల‌‌న‌‌లో ఉన్నాయి. వాటికి వెంట‌‌నే ఆమోదం తెల‌‌పాలి” అని కోరారు. కాగా, గురువారం ఉదయం 11:30 గంటలకు ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడిపారు. తొలుత కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆధ్వర్యంలో పార్టీ హెడ్ ఆఫీసులో జరిగిన మీటింగ్ లో పాల్గొన్నారు. అనంతరం కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. రేవంత్ వెంట సీఎస్ శాంతికుమారి, సీఎం ప్రిన్సిప‌‌ల్ సెక్రట‌‌రీ వి.శేషాద్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ రామ‌‌కృష్ణారావు, రాష్ట్ర ప‌‌ట్టణాభివృద్ధి, పుర‌‌పాల‌‌క వ్యవ‌‌హారాల శాఖ ప్రిన్సిప‌‌ల్ సెక్రటరీ దాన‌‌కిషోర్‌‌, రాష్ట్ర నీటిపారుద‌‌ల శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్‌‌సీ సి.ముర‌‌ళీధ‌‌ర్ ఉన్నారు.

పాలమూరు ప్రాజెక్టుకు నిధులిస్తమన్నరు :  ఉత్తమ్

పాల‌‌మూరు-–రంగారెడ్డి ప్రాజెక్టుకు అదనపు నిధులు కేటాయిస్తామని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. షెకావత్ తో భేటీ తర్వాత రేవంత్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పాల‌‌మూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరాం. అయితే 2014 త‌‌ర్వాత ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా క‌‌ల్పించ‌‌లేద‌‌ని ఆయన చెప్పారు. ఆ విధానం ప్రస్తుతం అమ‌‌ల్లో లేదని తెలిపారు. పాల‌‌మూరు ప్రాజెక్టుకు వేరే ప‌‌థ‌‌కం కింద 60 శాతం నిధులు కేటాయిస్తామ‌‌ని హామీ ఇచ్చారు” అని ఉత్తమ్ తెలిపారు. ‘‘బీఆర్ఎస్ సర్కార్ పాలనలో టీఎస్‌‌పీఎస్సీ పూర్తిగా నిర్వీర్యమైంది. పేప‌‌ర్ లీకుల‌‌తో భ్రష్టు ప‌‌ట్టిపోయింది. దాన్ని సంస్కరించాల‌‌ని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. టీఎస్‌‌పీఎస్సీని యూపీఎస్సీ త‌‌ర‌‌హాలో మారుస్తం. శుక్రవారం యూపీఎస్సీ చైర్మన్‌‌తో సీఎంతో కలిసి సమావేశమవుతాం” అని చెప్పారు.