పోలీస్​ అభ్యర్థులకు కాంగ్రెస్​ అండగా ఉంటుంది : రేవంత్​ రెడ్డి

పోలీస్​ అభ్యర్థులకు కాంగ్రెస్​ అండగా ఉంటుంది : రేవంత్​ రెడ్డి

పోలీస్ నియామకాల్లో తమకు జరిగిన అన్యాయంపై ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తమకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సర్పంచుల సమస్యలపై ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో పాల్గొన్న రేవంత్ ను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.  పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు కాంగ్రెస్ ఆండగా ఉంటుందని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో బీహార్ అధికారులకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎందరో ప్రాణాలు అర్పించి సాధించుకున్న రాష్ట్రంలో బీహార్ అధికారుల పెత్తనం ఏంటని ప్రశ్నించారు. ఇక్కడి యువతకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, రజత్ కుమార్, సందీప్ సుల్తానియా, కొత్తగా వచ్చిన డీజీపీ అంజనీ కుమార్ కూడా బిహార్ వాళ్లేనని చెప్పారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ కూడా వేరే రాష్ట్రానికి చెందిన అధికారేనని తెలిపారు. 

తెలంగాణ ప్రాంతం వాళ్లు ఉంటే ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల గోస వినేవారని ..కానీ ఉన్నత పదవుల్లో మెజార్టీ అధికారులు బిహార్ కు చెందిన వారే కావంతో ఇక్కడ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు.కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు పదవులు..తెలంగాణ కోసం పోరాటం చేసిన నిరుద్యోగులకు ఇన్ని గోసలా అని సీఎం  కేసీఆర్ ను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.