డీకేతో రేవంత్​ భేటీ...పొంగులేటి, జూపల్లి, దామోదర్​రెడ్డిని తీసుకెళ్లిన పీసీసీ చీఫ్​

డీకేతో రేవంత్​ భేటీ...పొంగులేటి, జూపల్లి, దామోదర్​రెడ్డిని తీసుకెళ్లిన పీసీసీ చీఫ్​

హైదరాబాద్, వెలుగు : తమ పార్టీలో చేరికలను కాంగ్రెస్  పార్టీ సీరియస్​గా తీసుకుంది. ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాస్  రెడ్డి, జూపల్లి కృష్ణారావును పార్టీలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నది. బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​ రెడ్డి కూడా కాంగ్రెస్​ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీసీసీ చీఫ్​ రేవంత్​  రెడ్డి శనివారం బెంగళూరు వెళ్లినట్లు తెలుస్తున్నది. పొంగులేటి, జూపల్లి, కూచుకుళ్ల, ఆయన కుమారుడు రాజేశ్​ను రేవంత్  తీసుకుని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్​తో భేటీ అయినట్లు సమాచారం. అనంతరం పార్టీ హైకమాండ్​తో డీకే శివకుమార్, రేవంత్​ చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతున్నది. మరో రెండు రోజుల్లో పొంగులేటి, జూపల్లి, దామోదర్​రెడ్డి మీడియా సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరే విషయంపై అధికారికంగా ప్రకటన చేస్తారని సమాచారం. 

కోమటిరెడ్డితో జూపల్లి సమావేశం

మాజీ మంత్రి, బీఆర్ఎస్​ మాజీ నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్  పార్టీ సీనియర్​ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డితో ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాద్ లో కోమటిరెడ్డి ఇంట్లో ఈ భేటీ జరిగింది. అనంతరం జూపల్లి, కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డితో జస్ట్​ మర్యాదపూర్వకమైన టీ భేటీ మాత్రమేనని జూపల్లి చెప్పారు. ఏ పార్టీలో చేరుతానన్న దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. జూపల్లి, తాను పాత మిత్రులమని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్​లోకి వస్తే మంచిదని ఆయనకు చెప్పానన్నారు. షర్మిల కూడా కాంగ్రెస్​లో చేరితే మంచిదే అని పేర్కొన్నారు. నల్గొండలో ఈ నెల18 లేదా 19న ప్రియాంకా గాంధీ సభ ఉంటుందని ఆయన తెలిపారు. ఆ సభ తర్వాత కాంగ్రెస్​ పార్టీ అంటే ఏంటో తెలుస్తుందన్నారు.