
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలు దారుణంగా ఉందని, దాన్ని కూడా మెరుగుపరచాలని సీఎం కేసీఆర్ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేవని, మధ్యాహ్న భోజన కార్మికులకు సరిగ్గా బిల్లులూ చెల్లించడం లేదని ఆరోపించారు. పెరిగిన ధరలకు తగ్గట్టుగా వంట ఖర్చులను చెల్లించట్లేదన్నారు. గ్యాస్ సిలిండర్లను ఇవ్వకపోతుండటంతో కట్టెల పొయ్యిపైనే వంటలు చేస్తున్నారని విమర్శించారు.
ఇలా సవాలక్ష సమస్యలతో మధ్యాహ్న భోజన పథకంపై విమర్శలు వస్తున్నాయని, ఆ సమస్యలను పరిష్కరించకుండా ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ అంటూ హడావుడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కనీసం ఈ బ్రేక్ ఫాస్ట్ పథకాన్నైనా సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన సీఎం కేసీఆర్కు లేఖ రాశారు.
మధ్యాహ్న భోజన పథకం సమస్యలను పరిష్కరించకుండా.. చదువుకుంటున్న పిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే స్థితికి బీఆర్ఎస్ దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేట్లు పెంచకుండా మధ్యాహ్న భోజనానికి తోడు బ్రేక్ఫాస్ట్ అంటే కార్మికులకు భారం అవుతుందని, వారికి వెంటనే రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. కొత్త మెనూకు తగ్గట్టుగా బడ్జెట్ పెంచాలన్నారు.