కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఏటీఎం : రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఏటీఎం : రేవంత్ రెడ్డి

కోటి ఎకరాలకు సాగు నీరు ఇస్తామన్న సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని..కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు ఒరిగింది ఏమి లేదని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. మార్చి 16న నిజామాబాద్ జిల్లా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన బోధన్ నియోజకవర్గంలో సారంగపూర్ లోని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 20వ ప్యాకేజ్ ప్రాంతాన్ని సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. జలయగ్నంలో భాగంగా దివంగత వైఎస్సార్ చేపట్టిన ప్రాణహిత చేవెళ్లను కాళేశ్వరంగా మార్చి కేసీఆర్ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ప్రాజెక్ట్ రీ డిజైనింగ్ తో సాగునీటి వసతి పెరగలేదు, కానీ కేసీఆర్ ఆదాయం పెరిగిందన్నారు. మంచిప్ప రీ డిజైన్ తో రైతులను రోడ్డు పాలు చేశారని దుయ్యబట్టారు. నిజామాబాద్ జిల్లాలో ప్యాకేజ్ 20, 21 పనులను కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీ ఎత్తిపోతల పథకాలు చేపడితే.. కేసీఆర్ తిప్పిపోతలు పథకం చేపట్టారని రేవంత్ రెడ్డి ఎద్దేవ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జరగనటువంటి వివక్ష... తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం నీటి పారుదల శాఖను దగ్గర పెట్టుకుని రైతులకు అన్యాయం చేశారన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు వివక్షకు గురవుతున్నాయన్నారు. కాళేశ్వరాం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు..కాళేశ్వరం నీటిని కేవలం తన ఫార్మ్ హౌస్ వరకి మాత్రమే పూర్తి చేశారన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల మీద స్వేత పత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఏటీఎంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక టాస్క్ ఫోర్క్ ఏర్పాటు చేసి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.