మునుగోడు బైపోల్ హీట్.. 13న రేవంత్ పాదయాత్ర

మునుగోడు బైపోల్ హీట్.. 13న రేవంత్ పాదయాత్ర

రాష్ట్రంలో మునుగోడు బైపోల్ హీట్ మొదలైంది.  ఉప ఎన్నిక   గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 13 న మునుగోడులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఆజాదీ కా అమృత్ గౌరవ్ యాత్రలో భాగంగా రేవంత్ పాదయాత్ర చేయనున్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండు ఓక్కటేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఒప్పందం లేకుండానే రాజగోపాల్ రెడ్డి రాజీనామాను 5 నిమిషాల్లోనే ఎలా ఆమోదించారని ప్రశ్నించారు.  గాంధీభవన్ లో   మీడియాతో చిట్ చాట్ చేసిన రేవంత్.. ఎన్నికలకు అంత అర్జెంట్ ఏముందని ప్రశ్నించారు. హుజురాబాద్ ఎన్నిక టిఆర్ఎస్ కు .. మునుగోడు ఎన్నిక బీజేపీకి అవసరమని.. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు.

మరో వైపు మునుగోడు బైపోల్ పై  కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది.  గాంధీభవన్ లో  ఎన్నికల ప్రణాళిక కమిటీ సమావేశం అయ్యింది. మధ్యాహ్నం ఒంటి గంటకు పీసీసీ అనుబంధ సంఘాల చైర్మన్ల సమావేశం జరగనుంది. మునుగోడు ఉపఎన్నికపై చర్చించనున్నారు. ఇప్పటికే టికెట్ ఆశావహులతో గాంధీభవన్ లో AICC నేత బోసురాజు సమావేశం నిర్వహించారు. పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్ నేతతో మాట్లాడారు.

మరోవైపు ఇవాళ హైదర్ గౌడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో చెరుకు సుధాకర్ తో  రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ సమావేశం అయ్యారు.  అయితే తాను టికెట్ ఆశించడం లేదని చెరుకు సుధాకర్ అన్నారు. కాంగ్రెస్ లో టికెట్ ఎవరికి ఇచ్చినా గెలుపు కోసం పనిచేస్తానన్నారు. మాణిక్కం ఠాగూర్ తో మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు చెప్పారు.