ఏఐ కంపెనీలపై పీపుల్ క్రెడిట్స్ పన్ను వేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఏఐ కంపెనీలపై పీపుల్ క్రెడిట్స్ పన్ను వేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
  • ఉద్యోగాల కోతకు ఆ సంస్థలే పరిహారం చెల్లించాలి
  •     వైట్ కాలర్ జాబ్స్ కు ముప్పు.. స్కిల్స్​ పెంచుకోవడమే మార్గం
  •     ఈ అంశంలో హార్వర్డ్​తో భాగస్వామ్యం పంచుకుంటాం
  •     ఏఐ రెండంచుల కత్తి.. జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రతికూలతలే
  •     హైదరాబాద్‌లో ‘ఏఐ సిటీ’, ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణం
  •     గ్రీన్ ఎనర్జీతో డేటా సెంటర్లు.. ‘చైనా+1’ లక్ష్యంగా మాన్యుఫ్యాక్చరింగ్
  •      హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నిర్వహించిన ‘ఏఐ పాలసీ సింపోజియం’లో  వర్చువల్​గా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ (ఏఐ)తో ఉపాధి కోల్పోయే వారిని ఆదుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో కొత్త విధానాలు రావాలని, కాలుష్యానికి ‘కార్బన్ క్రెడిట్స్’ వసూలు చేసినట్లే.. ఉద్యోగాల కోతకు బాధ్యతగా ఏఐ సంస్థలపై ‘పీపుల్ క్రెడిట్స్’ పేరిట పన్ను విధించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ శుక్రవారం నిర్వహించిన ‘ఏఐ పాలసీ సింపోజియం’లో  సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. 

‘‘ఏఐ యాజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ కంప్యూట్ పవర్.. ఇంపాక్ట్ ఆన్ లివబిలిటీ అండ్ వర్క్ ఫోర్స్’’ అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో ఆయన మాట్లాడుతూ, ఏఐ సాంకేతికతతో తలెత్తే సవాళ్లు, అవకాశాలను చెప్పారు. హార్వర్డ్ సింపోజియంలో ప్రసంగించిన తొలి భారతీయ ప్రతినిధిగా, అది కూడా తన సొంత రాష్ట్రం తెలంగాణ తరఫున మాట్లాడటం గర్వకారణమని అన్నారు. తాను అదే హార్వర్డ్ స్కూల్ పూర్వ విద్యార్థిని కావడం సంతోషంగా ఉందని సీఎం పేర్కొన్నారు.

హార్వర్డ్​తో భాగస్వామ్యం.. రీస్కిల్లింగ్‌కు పెద్దపీట

టెక్నాలజీ పురోగతి వల్ల ఉద్యోగాలు కోల్పోయే వారికి తిరిగి శిక్షణ ఇచ్చేందుకు (రీస్కిల్లింగ్) భారీ ఎకో సిస్టమ్‌ను రూపొందిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ విషయంలో హార్వర్డ్ వంటి అగ్రశ్రేణి గ్లోబల్ యూనివర్సిటీలతో భాగస్వామ్యం కోరుతున్నట్లు చెప్పారు. ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఉన్న ఏఐ కంపెనీలు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని, ఉద్యోగాలు కోల్పోయిన వారికి పరిహారం అందించడం ధర్మమని గుర్తుచేశారు. 

తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే 100కు పైగా ఫార్చ్యూన్ 500 కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయని పేర్కొన్న సీఎం.. ఏఐ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. ఏఐని నైతికంగా, బాధ్యతాయుతంగా వినియోగించుకునేలా ప్రపంచానికి ఒక కొత్త నమూనాను ఈ సింపోజియం అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏఐ.. అత్యుత్తమ ఆవిష్కరణ

ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ గురించే ఆలోచిస్తోందని, చాట్‌జీపీటీ నుంచి డీప్‌సీక్ వరకు ఎన్నో ఎల్‌ఎల్‌ఎంలు మన జీవితంలో భాగమయ్యాయని సీఎం అన్నారు. ఏఐ అనేది మానవాళి కనిపెట్టిన అత్యుత్తమ ఆవిష్కరణ అయినప్పటికీ, అది రెండంచుల కత్తి లాంటిదని సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రతికూలతలే రాజ్యమేలుతాయని హెచ్చరించారు. గతంలో పారిశ్రామిక విప్లవం వల్ల మనిషి శారీరక శ్రమకు ప్రత్యామ్నాయం దొరికితే, ఇప్పుడు ఏఐ వల్ల మనిషి ఆలోచనా శక్తికే ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఏఐ వల్ల ఉత్పాదకత పెరిగినప్పటికీ, తక్కువ శ్రామిక శక్తి అవసరమవుతుందని, దీనివల్ల ముఖ్యంగా డాక్టర్లు, లాయర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వంటి వైట్ కాలర్ ఉద్యోగాల పరిధి మారుతుందని విశ్లేషించారు. ఎంట్రీ లెవల్ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందని, ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏఐ భర్తీ చేయలేనటువంటి ‘బ్లూ కాలర్’ ఉద్యోగాలను సృష్టించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. గ్లోబల్ టూరిజం, సస్టైనబిలిటీ, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ), మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఉపాధిని పెంచుతున్నామన్నారు.  

రాష్ట్రంలో ‘ఏఐ సిటీ’.. 

హైదరాబాద్‌ను నాలెడ్జ్ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ‘‘మేము ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తున్నాం. ఇందులో భాగంగా ఒక ప్రత్యేక డిస్ట్రిక్ట్‌ను ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ’గా తీర్చిదిద్దుతున్నాం. ఇది గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీ) వన్-స్టాప్ డెస్టినేషన్‌గా మారుతుంది’’ అని వివరించారు. ఏఐ డేటా సెంటర్ల నిర్వహణకు భారీగా విద్యుత్ అవసరమని, అందుకే తన ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ ద్వారా వీటిని నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

ఏఐ వల్ల ప్రభావితం కానటువంటి టూరిజం, ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో బ్లూ కాలర్ ఉద్యోగాలను సృష్టించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని, చైనాకు ప్రత్యామ్నాయంగా ‘చైనా+1’ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.