కొత్త కమిటీల నియామకాలతో పాత కమిటీలు రద్దు : రేవంత్ రెడ్డి

కొత్త కమిటీల నియామకాలతో పాత కమిటీలు రద్దు : రేవంత్ రెడ్డి

భారత్ జోడో యాత్రపై సమావేశంలో చర్చించామని టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు. హైకమాండ్ ఆదేశాలతోనే మీటింగ్ నిర్వహించామన్నారు. ఈనెల 24 నుంచి 29 మధ్య అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అన్ని జిల్లాల్లో ఇన్ ఛార్జ్ లను నియమిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. సుదీర్ఘ అనుభవం ఉన్న నేతలతో మాట్లాడి జనవరి 26లోపు గ్రామ, మండల, జిల్లాల వారీగా ఇన్ ఛార్జ్ లను నియమిస్తామని చెప్పారు. పాత కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీలను నియమిస్తామని చెప్పారు. 

ఎన్నికల నియమావళిలో మార్పులు చేర్పులపై చర్చలు జరిపామని రేవంత్ రెడ్డి అన్నారు. 43 లక్షల మందికి సభ్యత్వ కార్డులను పంపిణీ చేస్తామన్నారు. దీని ద్వారా 2లక్షల భీమా, ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో వారికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. 

జనవరి 26 నుంచి జెండా పండుగ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మోడీ, కేసీఆర్ వైఫల్యాలను ఛార్జీ షీట్ రూపంలో ప్రజలకు వివరిస్తామన్నారు. జనవరి 3, 4 తేదీల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ వెళ్లేలా కార్యక్రమాలు చేపట్టబోతున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

జనవరి 26 నుంచి పాదయాత్ర చేస్తా

‘‘ నేను కూడా జనవరి 26 నుంచి పాదయాత్ర చేస్తా. ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, పరిపాలనా తప్పిదాలు, దళిత బంధువు సహా అన్ని అంశాలపై పోరాటం చేస్తా.  యాత్ర .. ఫర్ ఛేంజ్ పేరుతో నా పాదయాత్ర ఉంటది’’ అని రేవంత్ ప్రకటించారు. 

సొంత పార్టీ నేతలపై ఎవరైనా వ్యతిరేక పోస్టులు పెడతారా ?

సొంత పార్టీ నేతలపై ఎవరైనా వ్యతిరేక పోస్టులు పెడతారా అని రేవంత్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో ఎవరో పెడుతున్న పోస్టులను తనకు అంటకట్టవద్దని చెప్పారు. దొంగతనంగా కాంగ్రెస్ వార్ రూమ్ లోకి ప్రవేశించి.. కీలకమైన సమాచారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.మా డేటా అంతా దొంగతనంగా ఎత్తుకెళ్లారని రేవంత్ మండిపడ్డారు.  సునీల్ కనుగోలు టీం సభ్యులను ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు.  కావాలనే తనపై కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిని పార్టీ చాలా సీరియస్ గా తీసుకుందన్నారు. పూలే కాదు అప్పుడప్పుడు రాళ్లు కూడా పడుతాయి.. దానిని కూడా ఎదుర్కోవాలని రేవంత్ రెడ్డి చెప్పారు.

డీజీపీ పోస్టు పొందాలని సీవీ ఆనంద్ చూస్తున్నరు

సీపీ ఆనంద్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతల మధ్య సీపీ ఆనంద్ అంతర్గత కుమ్ములాటలు పెడుతున్నారని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద తన మనుషులు తప్పుడు పోస్టులు పెట్టారని అసత్య ప్రచారం చేస్తున్నారని.. మరి వారిపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. పోలీసుల రూపంలో ఉన్న రౌడీ మూక తమ పార్టీ వార్ రూమ్‌లోకి చొరబడి.. విలువైన మేధో సంపత్తిని ఎత్తుకెళ్లారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తన పాదయాత్రతో పాటు కర్నాటకకు సంబంధించిన రోడ్‌ మ్యాప్ సమాచారాన్ని దొంగిలించారని విమర్శలు గుప్పించారు. డీజీపీ పోస్టు పొందాలని సీవీ ఆనంద్ ఇదంతా చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.