
అభివృద్ధి పనుల కోసం చేసిన అప్పులపై వడ్డీలు కట్టేందుకు పుస్తెల తాడును అమ్ముకోవాల్సి వచ్చిందంటూ సర్పంచ్ శాంతమ్మ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘ ఆడబిడ్డకు పుస్తెల తాడు ప్రాణసమానం. ఊరికి ఉపకారం చేసినందుకు ఆ తాళినే అమ్మి వడ్డీలు కట్టాల్సిన దుస్థితి కల్పించిన దౌర్భాగ్యుడు కేసీఆర్’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో పల్లెల దుర్గతికి నిదర్శనం ఎరుగండ్ల పల్లి సర్పంచ్ మాడం శాంతమ్మ దీనగాథ అని వ్యాఖ్యానించారు.
ఆడబిడ్డకు పుస్తెల తాడు ప్రాణసమానం. ఊరికి ఉపకారం చేసినందుకు ఆ తాళినే అమ్మి వడ్డీలు కట్టాల్సిన దుస్థితి కల్పించిన దౌర్భాగ్యుడు కేసీఆర్.
— Revanth Reddy (@revanth_anumula) May 31, 2022
టీఆర్ఎస్ పాలనలో పల్లెల దుర్గతికి నిదర్శనం ఎరుగండ్ల పల్లి సర్పంచ్ మాడం శాంతమ్మ దీనగాథ!#KCRFailedTelangana pic.twitter.com/XgSM1Bh20k
వివరాల్లోకి వెళితే..రెండేళ్ల క్రితం గ్రామంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు ఇప్పటిదాకా విడుదలకాలేదని నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఎరుగండ్లపల్లి సర్పంచ్ మాడెం శాంతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయం వేదికగా జరిగిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమ సమీక్షలో తన గోడు వెళ్లబోసుకున్నారు. అభివృద్ధి పనుల కోసం గతంలో చేసిన రూ.20 లక్షల అప్పుపై వడ్డీని కట్టేందుకు పుస్తెల తాడును కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దీంతో ఇంకొంత మంది సర్పంచ్ లు కూడా శాంతమ్మ తో గొంతు కలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనుల బిల్లులే ఇంకా రాలేదని, మళ్లీ పల్లె ప్రగతి కార్యక్రమంలో ఏవిధంగా పాల్గొనాలని అధికారులను ప్రశ్నించారు. పల్లె ప్రగతిని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.