ధరణి ఫైల్స్​ రిలీజ్​ చేస్తం : ఈ నెల 15 నుంచి అక్రమాలను బయటపెడ్తం

ధరణి ఫైల్స్​ రిలీజ్​ చేస్తం : ఈ నెల 15 నుంచి అక్రమాలను బయటపెడ్తం

బీఆర్​ఎస్​, బీజేపీది ఫెవికాల్​ బంధం: రేవంత్​

  •     బ్రిటిష్​ ఐలాండ్స్​ కంపెనీ చేతికి ధరణి నిర్వహణ బాధ్యతలు ఇచ్చిన్రు
  •     ఆ పోర్టల్​ నిర్వహిస్తున్న సంస్థలోని వాళ్లంతా ఆర్థిక నేరగాళ్లే
  •     ప్రజల ఆస్తులు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళ్లినయ్​
  •     భూములను కేసీఆర్​ కుటుంబ అనుచరులు కొల్లగొడ్తున్నరని ఆరోపణ
  •     గాంధీభవన్​లో కాంగ్రెస్​ ‘భూమి డిక్లరేషన్’​ విడుదల 

హైదరాబాద్​, వెలుగు : ధరణి అవకతవకలపై ‘ధరణి ఫైల్స్​’ను రిలీజ్​ చేస్తామని పీసీసీ చీఫ్​ రేవంత్ ​రెడ్డి చెప్పారు. ధరణి వెనుక పెద్ద మాఫియానే ఉందని, వాటన్నింటినీ ఆధారాలతో ఈ నెల 15 నుంచి సీరియల్​లా బయటపెడతామని స్పష్టం చేశారు. ప్రజలకు, మీడియాకు ధరణికి సంబంధించి కేవలం టెర్రాసిస్​ కంపెనీ మాత్రమే కనిపిస్తున్నదని, కానీ, ప్రజల ఆస్తులు, భూములు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. బ్రిటిష్​ ఐలాండ్స్​లోని కంపెనీ పెట్టుబడులు ధరణిలో ఉన్నాయని తెలిపారు. గురువారం గాంధీ భవన్​లో ‘భూమి డిక్లరేషన్​’ ప్రకటన సందర్భంగా మీడియాతో రేవంత్​ మాట్లాడారు. ధరణి మొత్తం కేటీఆర్​ మిత్రుడు గాదె శ్రీధర్​రాజు చేతుల్లోనే ఉందన్నారు.

 ‘‘ధరణిని అడ్డం పెట్టుకుని దారి దోపిడీ దొంగలకన్నా భయంకరమైన దోపిడీకీ పాల్పడుతున్నరు. లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మాయమైతున్నయ్​. ధరణి పోర్టల్​ మొత్తం విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోయింది. మన వివరాలన్నీ విదేశీయుల గుప్పిట్లోనే ఉన్నయ్​. ఏదైనా సంస్థ దేశంలో వ్యాపారం చేయాలంటే దానికి సంబంధించి రిజర్వ్​ బ్యాంక్​కు, ప్రభుత్వానికి అనేక డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. ధరణి పోర్టల్​ నడుపుతున్న సంస్థ అవేవీ ఇవ్వలేదు. ఇది చాలా ప్రమాదకరం’’ అని ఆయన అన్నారు.  

దావూద్​ ఇబ్రహీం కన్నా పెద్ద నాయకుడేమో..

ధరణి పోర్టల్​ నిర్వహిస్తున్న సంస్థలో పెట్టుబడి పెట్టిన వాళ్లంతా ఆర్థిక నేరగాళ్లేనని రేవంత్​ ఆరోపించారు. అందులో విదేశీయలున్నారని చెప్పారు. ‘‘పోర్టల్​ ఎవరి చేతిలో ఉందో.. అతడు ఎలాంటి వాడో ఎవరికీ తెల్వదు. దావూద్​ ఇబ్రహీం కన్నా పెద్ద మాఫియా నాయకుడైనా అయ్యి ఉండొచ్చు.. లేదా ప్రపంచమంతా డ్రగ్స్​ దందా చేసే డ్రగ్​ లార్డ్​ అయినా అయ్యి ఉండొచ్చు. ధరణి పోర్టల్​ అనేక చేతులు మారి చివరికి బ్రిటిష్​ ఐలాండ్స్​లోని కంపెనీ​ చేతికి వెళ్లింది’’ అని మండిపడ్డారు. ధరణిలోని లోపాలను ఆసరాగా చేసుకుని నిషేధిత జాబితాలోని భూములను బీఆర్​ఎస్​ ముఖ్య నేతలు అనుచరుల పేరు మీద అర్ధరాత్రుళ్లు రిజిస్ట్రేషన్​ చేయించుకుంటున్నారని అన్నారు. ఆ వెంటనే ప్రొహిబిషన్​ను లాక్​ చేస్తున్నారని ఆరోపించారు. 

గాదె శ్రీధర్​ చేతిలోనే ధరణి ‘కీ’ ఉందని, ఆ తాళంచెవితో ఎప్పుడైనా ఎక్కడైనా తెరవొచ్చని, దీంతో ఎవరికైనా.. ఎప్పుడైనా రిజిస్ట్రేషన్​ చేసేయొచ్చన్నారు. ప్రొహిబిటెడ్​ లిస్టులోని భూములు అర్ధరాత్రుళ్లు అన్​లాక్​ అయిపోతున్నాయని, కేసీఆర్​ కుటుంబ సభ్యుల అనుచరులకు బదిలీ అయిపోగానే లాక్​ అవుతున్నాయని ఆరోపించారు.  హైటెక్​ సిటీలో క్వాంటెల్లా అనే సంస్థను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని రేవంత్​ దుయ్యబట్టారు. ధరణిపై తాము వేసిన కోదండరెడ్డి నేతృత్వంలోని కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి భూ అక్రమాలు జరుగుతున్నట్టు తేల్చిందని అన్నారు. 

తండ్రీకొడుకు బయపడ్తున్నరు

శంకర్​హిల్స్​ ప్రాంతంలోని భూములను రాత్రికి రాత్రి ప్రొహిబిషన్​ లిస్టు నుంచి తొలగించి పట్టాలు పుట్టించారని రేవంత్​ ఆరోపించారు. గజ్వేల్​లో ఇందిరాగాంధీ ప్రభుత్వం కేటాయించిన 1,500 ఎకరాల అసైన్డ్​ భూములను ప్రభుత్వం గుంజుకున్నదని మండిపడ్డారు. ‘‘గజ్వేల్​లోని అసైన్డ్​ భూముల్లో వందల ఎకరాలు అమూల్​ డైయిరీకి  కట్టబెట్టారు. అదేవిధంగా మంత్రి గంగుల కమలాకర్​కు కేటాయించారు. రంగారెడ్డి జిల్లా సింగారంలో ఓ ఫార్మా కంపెనీకి 1,022 ఎకరాలు కేటాయిస్తే.. హైకోర్టు స్టే ఇచ్చింది. వీటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని డిమాండ్​ చేశారు. ధరణిని రద్దు చేస్తామంటే తండ్రీకొడుకు కేసీఆర్​, కేటీఆర్​ భయపడుతున్నారని, వాళ్ల బండారం బయటపడుతుందనే భయం పట్టుకుందని విమర్శించారు. 

కిషన్​రెడ్డి స్టాండ్​ ఏంటో చెప్పాలె

ధరణి రద్దుపై బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు కిషన్​ రెడ్డి స్టాండ్​ ఏంటో చెప్పాలని రేవంత్​ డిమాండ్​ చేశారు. మునుపటి అధ్యక్షుడు బండి సంజయ్​ ధరణిని రద్దు చేస్తామంటూ చెప్పారన్నారు.  కేంద్రం తలచుకుంటే ధరణి పోర్టల్​ను క్షణంలో రద్దు చేయొచ్చని, దాని వెనకున్న ఆర్థిక నేరాలను బయటపెట్టొచ్చని తెలిపారు. ధరణిలో పెట్టుబడిదారులెవరో కిషన్​రెడ్డి తేల్చాలంటూ ఆయన సవాల్​ విసిరారు. ‘‘కిషన్​రెడ్డి అంటే కిషన్​ చంద్రశేఖర్​ రెడ్డి’’ అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్​ ఢిల్లీ పర్యటనతో బీజేపీ, బీఆర్​ఎస్​ బంధం బయటపడిందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్​ఎస్​ది ఫెవికాల్​ బంధమని దుయ్యబట్టారు. తన రక్షణకు సంబంధించి ఎన్నోసార్లు ప్రభుత్వానికి రిక్వెస్టులు పెట్టినా.. హైకోర్టుకు వెళ్లినా భద్రత పెంచలేదని రేవంత్​ అన్నారు. ఎంపీనైనా తనకు భద్రతను కుదించారని, కానీ, ఎమ్మెల్యే అయిన ఈటల రాజేందర్​కు మాత్రం ప్రాణహాని ఉందనగానే వై కేటగిరీ భద్రతను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. సమావేశంలో పార్టీ నేతలు కోదండ రెడ్డి, సంపత్​ కుమార్​, బలరాం నాయక్​, అన్వేష్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

120 రోజులు ఇంటికి సెలవు పెట్టండి

కాంగ్రెస్​ కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్ధమైపోవాలని రేవంత్​ రెడ్డి పిలుపునిచ్చారు. ఇంటికి ఓ 120 రోజులు సెలవు పెట్టుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. గాంధీ భవన్​లోని ఇందిరాభవన్​లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల లీడర్​షిప్​ డెవలప్​మెంట్​ మిషన్​ బూత్​ లెవెల్​ మేనేజ్​మెంట్​ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15లోగా మండలాలు, డివిజన్​ అధ్యక్షుల నియామకాలను పూర్తి చేస్తామని చెప్పారు. మండల, డివిజన్​, జిల్లా, పట్టణ అధ్యక్షులకు బోయినపల్లి రాజీవ్​ నాలెడ్జ్​ సెంటర్​లో ఈ నెల 18న ట్రైనింగ్​ ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో 34,654 పోలింగ్​ బూత్​లున్నాయని, ఓటరు జాబితా విషయంలో సర్కారు అక్రమాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్​ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నదని ఆరోపించారు.

ఇదీ కాంగ్రెస్​ ‘భూమి డిక్లరేషన్’​

 ధరణిని రద్దు చేసి.. అందరికీ అందుబాటులో ఉండే తప్పుల్లేని కొత్త కంప్యూటర్​ రికార్డ్​కు రూపకల్పన. ఇప్పుడున్న రికార్డు సమస్యలను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించి పరిష్కారించడం. 

నిషేధిత జాబితాలోని పట్టా భూములు అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో తొలగింపు.

 సమగ్ర సర్వే చేసి కొత్త రికార్డుల రూపకల్పన. సాగు భూములు, ఇంటి స్థలాలకు కొత్త పట్టాలు, హక్కులు కల్పించడం. 

 అధికారంలోకి వచ్చాక తొలి శాసనసభా సమావేశాల్లో టైటిల్​ గ్యారంటీ చట్టం చేసి భూమి హక్కులకు ప్రభుత్వమే హామీ ఇచ్చేలా కొత్త వ్యవస్థ తేవడం.   

 వందకు పైగా ఉన్న భూ చట్టాల స్థానంలో ఒకే భూమి చట్టం తేవడం. 

 కౌలుదారులకు రుణ అర్హత కార్డులు ఇచ్చేందుకు గత కాంగ్రెస్​ ప్రభుత్వం తెచ్చిన అధీకృత సాగుదారుల చట్టం అమలు చేయడం. 

 కాంగ్రెస్ తెచ్చిన భూ సంస్కరణల ద్వారా ఇప్పటి వరకు పేదలకు పంచిన 25 లక్షల ఎకరాల భూములపై హక్కులు కల్పించడం.

 2006లో కాంగ్రెస్​ తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి అర్హులకు పోడు పట్టాలు పంపిణీ చేయడం. 

గతంలో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం యథాతథంగా అమలు చేయడం. రైతుల అనుమతి లేకుండా భూములు సేకరించేది లేదు. అసైన్డ్ భూములకు, పోడు భూములకు కూడా పట్టా భూములతో సమానంగా నష్ట పరిహారం ఇవ్వడం. ఇప్పటి వరకు అలా నష్ట పరిహారం రాని వారికి న్యాయం చేసేందుకు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిషన్​ను ఏర్పాటు చేయడం. 

భూ పరిపాలన వ్యవస్థ బలోపేతం చేయడం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సిబ్బందిని నియమించి రైతులకు హక్కుల చిక్కులు లేకుండా పరిష్కారం చూపడం.

 భూ సమస్యల పరిష్కారానికి జిల్లాకొక భూమి ట్రిబ్యునల్​ ఏర్పాటు చేయడం.