కాంగ్రెస్ ​హయాంలోనే కామారెడ్డి అభివృద్ధి : రేవంత్​రెడ్డి

కాంగ్రెస్ ​హయాంలోనే  కామారెడ్డి అభివృద్ధి : రేవంత్​రెడ్డి
  • మాస్టర్​ ప్లాన్ బాధితులు కొట్లాడుతుంటే బీఆర్ఎస్ లీడర్లు ఎటుపొయిర్రు​
  • వాళ్లకు ప్రజల సమస్యలు పట్టవు
  • కాంగ్రెస్​ జమానాలోనే కామారెడ్డికి తాగునీళ్లు
  • ఎన్నికల ప్రచారంలో పీసీసీ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి

కామారెడ్డి, వెలుగు :  కామారెడ్డి రైతులు మాస్టర్​ప్లాన్​కు వ్యతిరేకంగా పోరాడినప్పుడు, కలెక్టరేట్​ ముందు ధర్నా చేసినప్పుడు రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ ​చేస్తే బీఆర్ఎస్​ పార్టీ వాళ్లు ఒక్కరైనా వచ్చరా అని పీసీసీ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. రైతులు చనిపోయినా, ఉద్యోగాలు రాక పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కరైనా పలకరించలేదన్నారు. ప్రజల కష్టాలతో బీఆర్ఎస్​ లీడర్లకు సంబంధం లేదని, వాళ్లకు కావాల్సిందల్లా ఓట్లేనన్నారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా టీపీసీసీ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నెల 10న నామినేషన్​ వేశారు. ఆ తర్వాత మంగళవారం నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం షూరు చేశారు.

ఇందులో భాగంగా రామారెడ్డి మండలం రెడ్డిపేట, పాల్వంచ మండలం ఇసాయిపేట, ఫరీద్​పేట, మాచారెడ్డి మండలం చుక్కాపూర్, మాచారెడ్డి చౌరస్తాల్లో ప్రచారం చేశారు. స్థానికంగా నిర్వహించిన కార్నర్ ​మీటింగ్స్​లో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఇక్కడ పోటీ చేయడానికి గల కారణాలను ప్రజలకు వివరించారు. రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. కామారెడ్డి ప్రజల మీద ప్రేమతో కేసీఆర్​ ఇక్కడ పోటీ చేయడం లేదని, పేదల భూములు లాక్కునేందుకే ఇక్కడికి వస్తున్నారన్నారు. ఇక్కడి రైతుల భూములను కేసీఆర్​ నుంచి కాపాడేందుకే తాను పోటీ చేస్తున్నట్లు రేవంత్​ చెప్పారు. అంతా ఏకమై కేసీఆర్​పై కొట్లాడుదామన్నారు. కాంగ్రెస్​ప్రభుత్వ హయాంలో  మంత్రిగా ఉన్న షబ్బీర్​అలీ కామారెడ్డికి తాగునీళ్లు తీసుకొచ్చారన్నారు.

కాంగ్రెస్​అధికారంలోకి  రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. షబ్బీర్​అలీ మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న మద్దికుంట గుడిని అభివృద్ధి చేస్తామన్నారు. మహిళా కాంగ్రెస్ ​మాజీ ప్రెసిడెంట్​  శారద, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్​అలీ, డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్​ శ్రీనివాస్​రావు, జడ్పీ ఫ్లోర్​లీడర్ ​మోహన్​రెడ్డి, లీడర్లు గీరెడ్డి మహేందర్​రెడ్డి, గణేశ్​, చంద్రకాంత్​రెడ్డి,  భీమ్​రెడ్డి పాల్గొన్నారు.

నేడు కార్యకర్తలతో మీటింగ్​

కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్​ పార్టీ ముఖ్య లీడర్లు, కార్యకర్తలతో బుధవారం రేవంత్​రెడ్డి సమావేశం కానున్నారు. మంగళవారం రాత్రి జనగామలో బస చేశారు. ముఖ్య నేతలకు ప్రచారంపై పలు సూచనలు చేశారు. బుధవారం జరిగే  మీటింగ్​లో నాయకులకు ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశముంది.