శ్రీశైలం ఎడమగట్టులో అప్పటి ప్రభుత్వం వల్లే ప్రమాదం : రేవంత్

శ్రీశైలం ఎడమగట్టులో అప్పటి ప్రభుత్వం వల్లే ప్రమాదం : రేవంత్

2020 ఆగస్టు, 22న బీఆర్ఎస్ ప్రభుత్వ లోపం కారణంగా శ్రీశైలం విద్యుత్ సొరంగం ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ ప్రమాదంలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఏఈ ఉజ్మా ఫాతిమా చనిపోతే.. ఆమె కుటుంబాన్ని తామే ఆదుకున్నామని చెప్పారు. అనాటి సీఎం కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. మానవత్వం లేని బీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రమాదంపై కనీసం విచారణకు కూడా ఆదేశించలేదని మండిపడ్డారు.  ప్రమాదం గురించి రెండు రోజుల ముందే హెచ్చరించినా అప్పటి సర్కార్ పట్టించుకోలేదన్నారు. 

పాత దోస్తును (బీఆర్ఎస్ పార్టీ) కాపాడటానికే ఇష్టం వచ్చినట్లు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోపనలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాతబస్తీ అభివృద్ధి కాలేదనడానికి అర్థం ఉందా..? అని ప్రశ్నించారు. 

ఎంఐఎం పార్టీ ఏ పార్టీతో అయినా పొత్తులు పెట్టుకున్నా.. తాము వ్యతిరేకించడం లేదన్నారు. మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మైనార్టీల అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీని ఎవరూ శంకించడానికి వీల్లేదన్నారు. ముస్లిం అభ్యర్థులను ఓడించడానికి ఎంఐఎం పని చేయలేదా..? అని ప్రశ్నించారు. 

సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ లో కరెంటు బిల్లులు ఎక్కువ మొత్తంలో పెండింగులో ఉన్నాయని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. సిద్దిపేటలో హరీష్ రావు, గజ్వేల్ లో కేసీఆర్, హైదరాబాద్ సౌత్ లో అక్బరుద్దీన్ ఓవైసీ.. బాధ్యత తీసుకుని ప్రజలందరూ బిల్లులు చెల్లించేలా కృషి చేస్తే విద్యుత్ శాఖ అప్పుల నుంచి బయట పడుతుందన్నారు.