- వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి
వరంగల్/ వరంగల్సిటీ, వెలుగు: ''రేవంత్ రెడ్డి సార్.. బీఆర్ఎస్ భూకబ్జాదారులను వదలకండి.. మీకు విజ్ఞప్తి చేస్తున్నా సార్. నేను బీఆర్ఎస్ ఆఫీస్ అక్రమ కట్టడంతోపాటు మరో వంద ఆధారాలిచ్చిన. కానీ 'మనం తొందరపడితే ప్రతికార చర్య' అంటారని మీరంటే ఊరుకున్నా. ఇప్పుడు దొంగలే మనల్ని దొంగ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్రు. వీరిని ఏ మాత్రం క్షమించొద్దు సార్” అంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సీఎంను రెక్వెస్ట్ చేశారు.
శనివారం ఆయన హనుమకొండ బాలసముద్రంలోని క్యాంప్ ఆఫీస్లో ప్రెస్మీట్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్లోని పాలిటెక్నిక్ కాలేజీ నిర్మాణం పనులు అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ చేతులమీదుగా ప్రారంభమవగా, ఇప్పుడు కొత్త బిల్డింగ్ నిర్మాణానికి రేవంత్రెడ్డి ప్రభుత్వం రూ.28 కోట్లు మంజూరు చేసిందన్నారు. నియోజకవర్గంలో గత ప్రభుత్వం 10 ఏండ్లలో చేయని పనులు తాము 10 నెలల్లో చేసి చూపామన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ కబ్జాలు చూస్తే వారిని మొద్దుకేసినా పాపం లేదని మండిపడ్డారు. 59 జీఓ, పేదల పేరుతో బీఆర్ఎస్ దొంగలు భూకబ్జాలు చేసిన్రని ఆరోపించారు. మూసీ నది ప్రాజెక్ట్ మొదలుపెట్టకముందే బీఆర్ఎస్ నేత కేటీఆర్ అతిపెద్ద కుంభకోణమని ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అక్రమ నిర్మాణాలు కూలగొడతారని తెలిసే ప్రభుత్వంపై దుష్పచారం చేయడానికి సొంతంగా యూట్యూబ్ చానెళ్లు పెట్టించిన్రని సీరియస్ అయ్యారు.
అనంతరం వరంగల్ ములుగు రోడ్డులోని ఓ గార్డెన్ లో బల్దియా ఆధ్వర్యంలో ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా) సహకారంతో ఏర్పాటు చేసిన "బల్క్ ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ అండ్ ప్రాసెస్" కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.
తడి చెత్తను సమర్థవంతంగా నిర్వహించడంపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలో నగర ప్రజలు అవగాహన కల్పించుకొని స్వచ్ఛ వరంగల్ గా తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం బల్దియా కమిషనర్, మేయర్ మాట్లాడుతూ నగర ప్రజల భాగస్వామ్యంతోనే తడి, పొడి చెత్తను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, మానస రాంప్రసాద్, సీఎంహెచ్వో రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.