- గోదావరి నీళ్ల దొంగ కేసీఆర్.. మానేరు ఇసుక దొంగ కేటీఆర్
- గజ్వేల్ గడిని కూల్చినం.. సిరిసిల్ల గడిపై ఫిరంగులై పేలుదాం
- కేటీఆర్.. హైటెక్ సిటీచుట్టూ ఫైవ్‌స్టార్ హోటళ్లు ఎట్లొచ్చినయ్?
- హోటల్లో చిప్పలు కడిగిన నీకు వేల కోట్ల ఆస్తులెక్కడివి
- ఎట్ హోం సర్వీస్ అపార్ట్మెంట్లు మీవి కాదా?
- నీ పేరు మీద హోటళ్లు లేకుంటే నేను పేరు మార్చుకుంట
- ఇక్కడ ఫాంహౌస్‌లు, అమెరికా, సింగపూర్‌లో కోట్ల పెట్టుబడులు
- దమ్ముంటే ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చెయ్ కేటీఆర్
- సిరిసిల్ల ఓట్లనే పచ్చనోట్లుగా మార్చుకొని రాజకీయం చేస్తున్రు
- పద్మశాలీ బిడ్డను గవర్నర్ కోటాలో పెద్దల సభకు పంపుతం
- రాబోయే ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన వారికి మంత్రి పదవి ఇస్తం
- ఈ సారి మహిళలకు చిలుక పచ్చ రంగు చీరలు ఇవ్వబోతున్నం
- సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కరీంనగర్, వెలుగు: రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన కల్వకుంట్ల కుటుంబం లక్ష కోట్లు దోచుకున్నదని, గోదావరి నీళ్ల దొంగ కేసీఆర్ అయితే.. మానేరు ఇసుకను దోచింది కేటీఆర్, సంతోష్ రావు, రవీందర్ రావు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 2023లో గజ్వేల్ గడిని కూల్చేశామని, రాబోయే ఎన్నికల్లో సిరిసిల్ల గడిపై మర ఫిరంగులై పేలుదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం హోదాలో తొలిసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. బుధవారం సాయంత్రం తొలుత సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన భారీ ర్యాలీ, రోడ్ షోలో పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తనకు హైదరాబాద్‌లో ఉండేందుకు ఇల్లు లేదన్న కేటీఆర్ కు 450 రూములతో మూడు దక్కన్ సెరాయ్ హోటళ్లు ఎక్కడివని, హైటెక్ సిటీ చుట్టూ ఫైవ్‌స్టార్ హోటళ్లు, ఎట్ హోం సర్వీస్ అపార్ట్ మెంట్లు ఎట్లొచ్చాయని ప్రశ్నించారు. ‘హైటెక్ సిటీ చుట్టూ మీ పేర్ల మీద ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్ మెంట్లు ఉన్నాయని చూపించకపోతే నేను పేరు మార్చుకుంటా’ అని సవాల్ విసిరారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావు ఆస్తుల మీద శ్వేత పత్రం విడుదల చేయాలని సీఎం డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫ్యామిలీకి బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్‌లో బిల్డింగులు, జన్వాడ, ఎర్రవల్లిలో ఫామ్ హౌస్‌లు, అమెరికా, సింగపూర్‌లో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు.‘ఒకప్పటి పాస్ పోర్ట్ బ్రోకర్ కొడుకుకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? వీటిపై సమాధానం చెప్పే దమ్ము కేటీఆర్ కు ఉందా?’ అని సవాల్ విసిరారు.
గోదావరిని అడ్డుపెట్టుకుని కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు కొల్లగొడితే.. మానేరు ఇసుక దొంగలు రవీందర్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ కలిసి వేల కోట్లు దోచుకున్నది వాస్తవం కాదా..? అని సీఎం ప్రశ్నించారు. నేరేళ్ల దళిత బిడ్డలే ఇందుకు సాక్ష్యమని, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, కరెంట్ షాక్ లు ఇచ్చి హింసించింది వాస్తవం కాదా? అని నిలదీశారు. సిరిసిల్ల అంటే సిరులకు నిలయమని, కానీ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చేశారని సీఎం ధ్వజమెత్తారు. మనిషి నాగరికత వస్త్రంతో ప్రారంభమైందని, అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేయడం ఇక్కడి నేత కార్మికుల ప్రత్యేకత అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పాపారావు, కేకే మహేందర్‌రెడ్డి వంటి వారు సిరిసిల్ల అభివృద్ధి కోసం పనిచేస్తే... చీమలు పెట్టిన పుట్టలో విషపు పాములు చేరినట్టుగా కేసీఆర్, కేటీఆర్ సిరిసిల్లలో రాజకీయంగా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున దోచుకున్నారని ఆరోపించారు.
సిరిసిల్ల ఓట్లను పచ్చ నోట్లుగా మార్చుకున్రు
‘‘2009 ఎన్నికల్లో కేవలం 172 ఓట్లతో సిరిసిల్లలో కేటీఆర్ గెలిచాడు. ఆ తర్వాత అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల మేర భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నాడు. అవన్నీ ఎట్ల వచ్చినయ్? దుబాయ్ పాసుపోర్టు బ్రోకర్ కొడుకుగా... అమెరికాలో అంట్లు తోమిన, హోటళ్లలో చిప్పలు కడిగిన వాడికి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి? ప్రపంచంలోనే ధనిక కుటుంబంగా ఆనాడు నిజాం నవాబుకు పేరుంటే.. ఇవాళ కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని, సిరిసిల్ల ప్రజల ఓట్లను సొమ్ముగా మార్చుకుని రూ.వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ లు నిర్మించుకున్నారు’’ అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
మిడ్ మానేరు ప్రాజెక్టు కారణంగా ఇళ్లు కోల్పోయిన సమయంలో 2015లో కేసీఆర్ సడ్డకుడి కొడుకు కుటుంబ సభ్యుల పేర్లతో ఇళ్లను పొందారని, ఆనాడు తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారిగా చూపించిన వారు తర్వాత కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఒకరు గోదావరి జలాలను కొల్లగొట్టారని, ఇంకొకరు మానేరు ఇసుకను దోచుకున్నారని, మరొకరు హైదరాబాద్‌లో ఆంధ్రా వ్యాపారులతో చేతులు కలిపి వేల కోట్ల రూపాయలు, భారీగా భూములు సంపాదించారని ఆరోపించారు.
వలస కార్మికులకు ప్రత్యేక విధానం..
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో గల్ఫ్‌దేశాలకు వలసలు ఎందుకు తగ్గలేదని సీఎం నిలదీశారు. విదేశాలకు వెళ్లిన వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులను అందరం చూస్తున్నామని, ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్న వారు సిరిసిల్ల ప్రజలకు ఏం చేశారో ఆలోచించుకోవాలన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలస కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఆది శ్రీనివాస్, ఈరవత్రి అనిల్ ఎన్నోసార్లు ప్రతిపాదనలు తీసుకొచ్చారని తెలిపారు. అందుకే తమ ప్రభుత్వం వలస కార్మికుల కోసం ప్రత్యేక విధానం తీసుకొచ్చి, ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. సిరిసిల్ల ప్రజలు కూడా విదేశాలకు వలస వెళ్తున్నారని, వారు ఎంత సంపాదిస్తున్నారో మనకు తెలుస్తుందని కానీ, కేటీఆర్ సంపద ఎలా పెరిగిందో ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
దేవుళ్లకే శఠగోపం పెట్టిన కేసీఆర్
‘‘వేములవాడ రాజన్నకు, భద్రాద్రి రాముడికి కూడా శఠగోపం పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్‌ఒక్కరే. 2014 అధికారంలో వచ్చాక.. ఈ రెండు దేవాలయాలకు నిధులు ఇస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వని దుర్మార్గులు. మేం వేములవాడ అభివృద్ధికి రూ.1,500 కోట్లు ఇచ్చాం. ఇక్కడే యంగ్‌ఇండియా స్కూల్, ఎంఆర్‌ఓ కార్యాలయాలు, మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేశాం. రైతు రుణమాఫీ, రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాం. మా ప్రభుత్వం కేవలం రెండున్నరేళ్లలో చేనేత కార్మికుల కోసం రూ.1,730 కోట్లు ఖర్చు చేసింది’’ అని సీఎం వెల్లడించారు.
సిరిసిల్ల గడిపై మర ఫిరంగుల్లా పేలుదాం..
‘‘పిల్లకాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ' అన్నట్లు అమెరికా హోటళ్లలో పాత్రలు కడిగిన కేటీఆర్.. 2023లో కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చిన రాజకీయ దెబ్బ అంటే ఏమిటో తండ్రిని అడిగి తెలుసుకోవాలి. గజ్వేల్ గడిపై గురిపెట్టి అక్కడ బీఆర్‌ఎస్‌ను ఓటమి అంచుదాకా తీసుకెళ్లాం.. కాంగ్రెస్ కార్యకర్తల్లారా.. ఇప్పుడు సిరిసిల్ల గడిపై గురిపెట్టి మర ఫిరంగుల్లా పేలుదాం. సిరిసిల్లలో పాదయాత్ర చేస్తుంటే ప్రజల కళ్లలో మార్పు స్పష్టంగా కనిపించింది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక పద్మశాలీ బిడ్డను పెద్దల సభకు పంపించాలని, సిరిసిల్ల నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చేలా చూడాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కోరుతున్నా’’ అని సీఎం పేర్కొన్నారు.
కేసీఆర్ గెలిస్తే వాళ్ల కుటుంబ సభ్యులకే పదవులు..
‘‘గతంలో కేసీఆర్ సీఎంగా ఉంటే ఎర్రబెల్లి దయాకర్‌రావు, తన సడ్డకుడి కొడుకు సంతోష్‌రావుకు ఎంపీ పదవులు వచ్చాయి. కానీ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్ మంత్రులుగా ఉన్నారు. ప్లానింగ్ కమిషన్ వైస్‌చైర్మన్‌గా వినోద్‌కుమార్‌ను కేసీఆర్ నియమిస్తే.. నేను బీసీ బిడ్డ గద్వాల విజయలక్ష్మిని ఆ స్థానంలో నియమించా. నిజామాబాద్‌లో కేసీఆర్ కుమార్తెను ఓడించిన తర్వాత ఆమెకు వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు.
నేను మాత్రం తెలంగాణ కోసం పోరాడిన విజయశాంతిని ఎమ్మెల్సీగా చేశా. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు, చాకలి ఐలమ్మ మనవరాలికి, నేరెళ్ల శారదకు కీలక పదవులు ఇచ్చాం. మహిళలకు, బీసీలకు, దళితులకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది..’’ అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా చేసిందని, గతంలో వైఎస్- డీఎస్ జోడీ ఉంటే.. ఇప్పుడు రేవంత్ -మహేశ్ జోడీ బలంగా పని చేస్తుందని, 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు.
బతుకమ్మ చీరల్లో కమీషన్లు
బీఆర్‌ఎస్ నాయకులను బడికి రాని బడి దొంగలని, ఆఖరికి బతుకమ్మ చీరల పంపిణీలో కూడా కమీషన్లు తీసుకున్నారని సీఎం ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక తమ అధికారి శైలజా రామయ్యర్ వచ్చి అడిగిన తర్వాత చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల బకాయిలను చెల్లించామని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఆత్మగౌరవానికి సంబంధించిన రేషన్‌కార్డులు ఇవ్వలేదని, సన్నబియ్యం ఇవ్వలేదని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేదని విమర్శించారు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, మంత్రి పొన్నం ప్రభాకర్‌ప్రతి నెలా ఆర్టీసీకి నిధులు చెల్లిస్తున్నారని, రెండున్నరేళ్లలో రూ.12 వేల కోట్లు చెల్లించామని తెలిపారు. పండుగ సందర్భంగా మహిళలు తమ ప్రభుత్వం అందించిన చీరలు కట్టుకుని వచ్చారని, గత ప్రభుత్వం ఇచ్చిన చీరలను ప్రజలు వ్యవసాయ పొలాల్లో పిట్టలు, కాకులను తరిమేందుకు ఉపయోగించేవారని గుర్తు చేశారు.ఈ సంవత్సరం మహిళలకు చిలుకపచ్చ రంగు చీరలు ఇవ్వబోతున్నామని సీఎం వివరించారు.
పసుపు నీళ్లతో శుద్ధి చేయిస్తవా? కేసీఆర్.. నీకెంత కండకావరం
‘కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఒక దళితుడిని స్పీకర్‌గా నియమించింది. ఆయనను ‘అధ్యక్షా’ అని సంబోధించాల్సి వస్తుందనే కారణంతోనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. దళిత స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఎందుకు ఖండించలే..దళితులు ఫాంహౌస్ వద్దకు వస్తే పసుపు నీళ్లతో కడుగుతరా? కేసీఆర్.. నీకు ఎంత కండకావరం, అంత అహంకారం ఎందుకు? మన ప్రాంత దళితులు ఆకలినైనా భరిస్తారు. కానీ అవమానాన్ని భరించరు. దళితులను అవమానించిన నిన్ను తెలంగాణ నుంచి బహిష్కరించే దాకా వదలం’
మానేరు ఇసుకలో బీఆర్‌ఎస్‌ను బొందపెడ్తం
‘‘సిరిసిల్లలో కాంగ్రెస్ గెలిస్తే ఆ అభ్యర్థికి మంత్రి పదవి ఇచ్చి ప్రజలకు అండగా నిలుస్తాం. సిరిసిల్ల ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే బాధ్యతను నేను స్వయంగా తీసుకుంటా. బీఆర్‌ఎస్, కేసీఆర్, కేటీఆర్ మీకు గతం. ఇకపై అంతా కాంగ్రెస్.. అంతా మూడు రంగుల జెండానే. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మానేరు ఇసుకలో బీఆర్‌ఎస్‌ను బొందపెట్టుడు ఖాయం. నేరెళ్ల బాధితుల సాక్షిగా బీఆర్‌ఎస్‌రాజకీయాలకు ముగింపు పలికేందుకు సిరిసిల్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నా’’ అని సీఎం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విప్ లు ఆది శ్రీనివాస్, ప్రత్యేక సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మదన్‌మోహన్ రావు, లక్ష్మీకాంతరావు, డాక్టర్ సంజయ్, శ్రీగణేష్, నాగరాజు, కుంభం అనిల్ రెడ్డి, నవీన్ యాదవ్, సంపత్ కుమార్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, మంత్రులు, ప్రభుత్వ విప్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ జ్ఞాపికను అందించారు.
