హుజూరాబాద్ ఎన్నికల తర్వాత రేవంత్ పదవి ఊడుతుంది

హుజూరాబాద్ ఎన్నికల తర్వాత రేవంత్ పదవి ఊడుతుంది
  • మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: హుజూరాబాద్ ఎన్నికల తర్వాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పదవి ఊడుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారని ఆయన తెలిపారు. మంగళవారం తెలంగాణ భవన్ లో మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఇంద్రవెళ్లి లో నోటి తీటను తీర్చుకున్నాడని, కేసీఆర్ ను తిట్టి శునకానందం పొంది సభను ముగించాడని ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ సభను చూస్తుంటే గిరిజనుల గుండెలు మండాయని ఆయన పేర్కొన్నారు. ఆనాడు గిరిజనులను చంపి- ఇవ్వాళ స్మరకం కడతారా? అని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు బిక్షతో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాడని, సోనియాగాంధీ రాజ్యం అంటే వందల మంది యువత ఆత్మబలిదానం చేసుకున్న రాజ్యం కావాలా ? 2009 వరకు తెలంగాణ ఇవ్వకుండా లాగి లాగి ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకున్న  సోనియమ్మ ను నమ్మలా ? సోనియా గాంధీ దయ్యం- బలిదేవత అన్న రేవంత్ రెడ్డి ఇవ్వాళ తెలంగాణ తల్లి సోనియాగాంధీ అంటున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఆంధ్రా వలస పాలకుల పంజరంలో ఆంధ్ర నేతల కోసం పలికే చిలుక అని, ఇంతకు ముందు చెర్లపల్లికి తాత్కాలికంగా వెళ్లిన రేవంత్ రెడ్డి ఇక పూర్తిగా జైలుపాలు కాబోతున్నాడని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జోస్యం చెప్పారు.