ఫామ్​హౌస్​ నుంచి తెలంగాణ తల్లిని విడిపించుకుందాం

ఫామ్​హౌస్​ నుంచి తెలంగాణ తల్లిని విడిపించుకుందాం
  • కేసీఆర్​ను తరిమేద్దాం: పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి 
  • జనం బతుకులు బాగుపడతాయని 
  • సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన్రు
  • రాష్ట్రం వచ్చాక ఉద్యోగాలు లేవు.. 
  • ఆత్మహత్యలు ఆగడం లేదు.. అమరుల 
  • కుటుంబాలను ఆదుకోవడం లేదు
  • కార్యకర్తలు రెండేండ్లు కష్టపడితే అధికారం కాంగ్రెస్​దేనని ధీమా
  • పీసీసీ చీఫ్​గా బాధ్యతలు చేపట్టిన రేవంత్​ 
  • భారీగా తరలివచ్చిన కార్యకర్తలు 
  • గాంధీభవన్ కు బుల్లెట్​పై రేవంత్ భారీ ర్యాలీతో వెళ్లిన పీసీసీ చీఫ్
  • పెద్దమ్మ గుడిలో పూజలు  నాంపల్లి దర్గాలో ప్రార్థనలు


హైదరాబాద్​, వెలుగు: రావణుడు సీతమ్మను లంకలో బంధించినట్లు తెలంగాణ తల్లిని ఫామ్​హౌస్​లో బంధించిన దుర్మార్గుడు  కేసీఆర్​ అని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ తల్లిని రక్షించుకోవాలంటే కేసీఆర్​ను, ఆయన కుటుంబాన్ని రాష్ట్ర పొలిమేరల దాకా తరమాలని, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ‘‘వానర సైన్యం సాయంతో వారధి కట్టి సీతను రాముడు విముక్తి చేశాడు. కాంగ్రెస్​ కార్యకర్తలు వానర సైన్యంలా మారి తెలంగాణ తల్లి విముక్తి కోసం పోరాడాలి. ఏ లక్ష్యంతోనైతే తెలంగాణ తెచ్చుకున్నమో అందరం కలిసి దాన్ని తిరిగి సాధించుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నరకు గాంధీభవన్​లో ఉత్తమ్​కుమార్​రెడ్డి నుంచి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్​ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు జూబ్లీహిల్స్​ పెద్దమ్మగుడిలో అమ్మవారిని దర్శించుకొని గాంధీభవన్​కు ర్యాలీగా వచ్చారు. వేల మంది కాంగ్రెస్​ కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం సభలో రేవంత్​ మాట్లాడారు. మోడీ, కేసీఆర్​ కరోనా కంటే డేంజర్​ అని, వీళ్లను కుర్చీలో నుంచి దించేయడానికి ప్రతి కాంగ్రెస్​ కార్యకర్త ఇంట్లో అమ్మ, నాన్నలకు చెప్పి పార్టీ కోసం పని చేసేందుకు రావాలని ఆయన అన్నారు. టీఆర్​ఎస్​ను వంద అడుగుల లోతు పాతి పెట్టాలంటే కాంగ్రెస్​ కార్యకర్తలు ఇంటికి రెండేండ్లు సెలవు పెట్టి కష్టపడితే దేశంలో, రాష్ట్రంలో  కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుందని చెప్పారు. 
కార్యకర్తలే ఏకే 47 తూటాలు
రాష్ట్రంలో టీఆర్​ఎస్​ దుర్మార్గ పాలనకు అంతం పలకాల్సిన అవసరం ఉందని, దీని కోసం కాంగ్రెస్​ కార్యకర్తలు ప్రతి పల్లె, తండా, ఇల్లిల్లూ తిరగాలని, ప్రతి తలుపు తట్టి జనానికి వాస్తవాలు చెప్పాలని రేవంత్​ పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్​ అధికారంలోకి రావాలంటే పీకే (ప్రశాంత్​ కిశోర్​) లాంటి సలహాదారును పెట్టుకోవాలని నా మిత్రులు సలహా ఇచ్చారు. కానీ మనకా అవసరం లేదు. ప్రతి కాంగ్రెస్​ కార్యకర్త ఒక పీకే. ఇందరు పీకేలు ఉన్నంక మనకు మరొకరు అవసరమా? కాంగ్రెస్​ కార్యకర్తలే ఏకే 47 తూటాలు” అని ఆయన పేర్కొన్నారు. ఏపీలో కాంగ్రెస్​ చనిపోయినా ఫర్వాలేదని సోనియాగాంధీ  తెలంగాణ ఇచ్చారని, ఆమెకు కృతజ్ఞతలు చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

‘‘నిజాం, రజాకారులకు వ్యతిరేకంగా ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం చేశారు. అప్పుడు వచ్చిన తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపారు. తర్వాత శ్రీకాంతాచారి ఆత్మహత్యతో మళ్లీ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు పునాదులు పడ్డాయి. తెలంగాణ వచ్చింది. కానీ ఇప్పుడు అమరుల కుటుంబాలు సమాధుల్లోకి వెళ్తే, కేసీఆర్​ గద్దెనెక్కి నెత్తి మీద ఆడుతున్నాడు’’ అని రేవంత్​ మండిపడ్డారు. ‘‘తెలంగాణ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని, జీవితాలు బాగుపడతాయని సోనియమ్మ భావించారు. ఆత్మహత్యలు ఆగుతాయనుకున్నారు. కానీ ఇప్పటికీ రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన టైంలో లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇప్పుడు అవి లక్షా 90 వేలు అయ్యాయని చెప్పారు. కేసీఆర్​ లక్ష ఉద్యోగాలు నింపివుంటే ఇన్ని ఖాళీలు ఎక్కడి నుంచి వచ్చాయని రేవంత్​ ప్రశ్నించారు. తెలంగాణ వచ్చినా  ఎన్​కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదని, అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. ఉద్యమ కారులపై కేసులు కూడా ఎత్తి వేయలేదని, నిరుద్యోగులు, దళితులు, బడుగు, బలహీన వర్గాలను టీఆర్​ఎస్ నయవంచనకు గురిచేసిందని మండిపడ్డారు. 
వ్యక్తిగత స్లోగన్లు ఇస్తే డిస్మిస్​ 
రేవంత్​ రెడ్డి స్పీచ్​ మొదలుపెట్టిన కొద్ది సేపటికే కొందరు అభిమానులు ‘‘రేవంత్​ సీఎం”అంటూ నినాదాలిచ్చారు. దీనికి ఆయన చాలా తీవ్రంగా రియాక్ట్​ అయ్యారు. కాంగ్రెస్​లో ఇకపై జై సోనియమ్మ, జై రాహుల్​ గాంధీ, జై కాంగ్రెస్​ నినాదాలు తప్ప వ్యక్తిగత నినాదాలు చేయొద్దని హెచ్చరించారు. అలా చేస్తే ఎంత పెద్ద వారైనా సరే క్షమించేది లేదని, పార్టీ నుంచి డిస్మిస్​ చేస్తామన్నారు. ఇకపై పార్టీలో అన్ని సమిష్టి నిర్ణయాలు ఉంటాయని రేవంత్​ చెప్పారు. ‘‘కొందరికి అభిమానం ఉండవచ్చు. కానీ వ్యక్తి కేంద్రంగా నినాదాలు చేయకూడదు” అని అన్నారు. 
రేవంత్​రెడ్డిపై జూబ్లీహిల్స్ పీఎస్ లో కేసు
జూబ్లీహిల్స్, వెలుగు: టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డిపై జూబ్లీహిల్స్ పీఎస్​లో కేసు నమోదైంది. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రేవంత్​రెడ్డి పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీగా గాంధీ భవన్​కు వెళ్లారు. రేవంత్​ర్యాలీతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని జూబ్లీహిల్స్​పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. 
టీఆర్ఎస్​ను ఓడించడం కాంగ్రెస్​తోనే సాధ్యం 
రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది. తెలంగాణ పేరు చెప్పి 1998, 99  ఎన్నికల్లో లబ్ధి పొందింది. కానీ రాష్ట్రాన్ని ఇవ్వలేదు. ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తున్న తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చారు. టీఆర్ఎస్​ను ఓడించడం కాంగ్రెస్​తోనే సాధ్యం. వచ్చే 27 నెలలు పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఎంతో కీలకం. టీమ్​గా పనిచేసి పార్టీని అధికారంలోకి తేవాలి.-                                                                                                   ‑ మాణిక్కం ఠాగూర్, కాంగ్రెస్  రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్
 యుద్ధానికి టైమైంది..
దొర కేసీఆర్ గడీని కూలగొట్టడానికి, తెలంగాణ బానిస సంకెళ్లు తెంచటానికి రాష్ట్రం నలుమూలల నుంచి  వచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు.. యుద్ధానికి సిద్ధమయ్యే టైమ్ అయింది. బలమైన నాయకుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాస్వామిక, సామాజిక తెలంగాణ  నిర్మాణానికి ఇప్పట్నుంచే కాంగ్రెస్ మరో యుద్ధం చేయనుంది.  
                                                                                                                                                                        ‑ దాసోజు శ్రవణ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి
కాంగ్రెస్​ను అధికారంలోకి తెస్తం..
2023లో అందరం కలసి పనిచేసి కాంగ్రెస్​ను తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తామని సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మాట ఇస్తున్నాం. మా పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. అధికార పార్టీ నేతలు, అధికారులు వేధిస్తున్నారు. అధికారం లోకి వచ్చిన తర్వాత వాళ్లకు బుద్ధి చెబుతాం.

                                                                                                                                                                              ‑ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్
కాంగ్రెస్​ను అధికారంలోకి తేవాలె..
రాష్ట్ర ప్రజలందరికీ వనరులు సమానంగా పంచాలని ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో బతకాలనుకున్నం. దురదృష్టం కొద్దీ మనం తెచ్చుకున్న రాష్ట్రంలో ఇవేమీ జరగడం లేదు. కృష్ణా నదీ జలాలు నష్టపోతున్నాం. నాగార్జున సాగర్ కింద 6 లక్షల 40 వేల ఎకరాలు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలు పెట్టిన ప్రాజెక్టుల కింద మొత్తంగా 28 లక్షల 50 వేల ఎకరాలకు నష్టం జరిగే ప్రమాదముంది. దీన్ని నుంచి మనం బయటపడటం కోసం, మన వనరులను బడుగు, బలహీన వర్గాలకు అందించడం కోసం.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి.                  - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
రేవంత్ పేరు నిలబెట్టాలి..
రేవంత్ కు పీసీసీ ఇచ్చిన తర్వాత కొత్త అధ్యాయం స్టార్ట్ అయింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి రేవంత్ పేరు నిలబెట్టాలి. కొత్త టీమ్ లో సీనియర్లకు, జూనియర్లకు ప్రాధాన్యం లభించింది. అందరం కలిసి యూనిటీగా పనిచేసి, కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలి. వచ్చే ఎన్నికల్లో  కేసీఆర్ ను ఇంటికి పంపటం ఖాయం. ఎంతో నమ్మకం ఉంచి సోనియా, రాహుల్ లు రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారు. కేసీఆర్​ను ఓడించే శక్తి లేదని టీఆర్ఎస్ నేతలు  అనుకుంటే పొరపాటే.1989లో ఎన్టీఆర్ ను చెన్నారెడ్డి,2004 లో చంద్రబాబును వైఎస్సార్ ఓడించారని గుర్తుంచుకోవాలి.                                  ‑ గీతారెడ్డి, మాజీ మంత్రి


పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భారీ ర్యాలీతో గాంధీభవన్ కు వెళ్లారు. పెద్ద సంఖ్యలో హాజరైన కార్యకర్తలతో కలిసి బైక్, కారు ర్యాలీతో అక్కడికి చేరుకున్నారు. బుధవారం ఉదయం 9:30 గంటలకు జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి నుంచి బయల్దేరిన రేవంత్.. మొదట పెద్దమ్మ గుడిలో పూజలు చేశారు. అక్కడి నుంచి నాగార్జున సర్కిల్, మాసబ్ ట్యాంక్ మీదుగా మధ్యాహ్నం ఒంటిగంట కల్లా నాంపల్లి దర్గాకు చేరుకున్నారు. అయితే అప్పటికే పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీభవన్ లో ఎదురుచూస్తుండడం, ముహూర్తం దగ్గర పడుతుండడం, ర్యాలీ కిలోమీటర్ల కొద్దీ ఉండడంతో.. యూత్ ​కాంగ్రెస్ ​నేత అనిల్​కుమార్​ యాదవ్​ బుల్లెట్​పై రేవంత్ గాంధీభవన్​కు వెళ్లారు. అనుకున్న టైమ్​కి పీసీసీ చీఫ్​గా బాధ్యతలు చేపట్టి.. ఆ తర్వాత దర్గాకు వచ్చి చాదర్ సమర్పించి, ప్రార్థనలు చేశారు. తిరిగి మళ్లీ ర్యాలీతో 3 గంటల టైమ్ లో గాంధీ భవన్ కు వెళ్లారు. సంప్రదాయం ప్రకారం మాజీ ప్రెసిడెంట్ ఉత్తమ్.. కొత్త ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి వేదికపై కాంగ్రెస్ జెండాను అందజేశారు. మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్​లు రేవంత్, ఉత్తమ్​ను సన్మానించారు. కార్యకర్తలు, అభిమానులు క్రేన్​తో పెద్ద పూలమాలను వేసి రేవంత్, అంజన్ కుమార్ యాదవ్ లను సత్కరించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 
భారీగా ట్రాఫిక్ జామ్..  
రేవంత్ ర్యాలీతో సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం ఎంప్లాయీస్ ఆఫీస్ కు వెళ్లే టైమ్ కావడంతో జూబ్లీహిల్స్, నాగార్జున సర్కిల్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, నాంపల్లి, గాంధీభవన్, లక్డీకాపూల్ ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్లు రావడంతో లక్డీకాపూల్, బషీర్ బాగ్, గన్ పార్క్ పరిసర ప్రాంతాల్లో వందలాది కార్లను పార్క్ చేశారు.