ఇయ్యాల (సెప్టెంబర్23) మేడారంలో సీఎం పర్యటన.. వన దేవతలను దర్శనం చేసుకోనున్న రేవంత్

ఇయ్యాల (సెప్టెంబర్23) మేడారంలో సీఎం పర్యటన.. వన దేవతలను దర్శనం చేసుకోనున్న రేవంత్
  • మాస్టర్​ప్లాన్​పై తుది నిర్ణయం తీసుకునే చాన్స్

ములుగు/తాడ్వాయి, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. మేడారం సమ్మక్క సారలమ్మల అభివృద్ధి కోసం రూ.236.2 కోట్లు ఖర్చు చేసి మాస్టర్​ ప్లాన్​ అమలు చేసే నేపథ్యంలో సీఎం రాక ప్రాధాన్యం సంతరించుకుంది. 

ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మంగళవారం మధ్యాహ్నం హెలికాప్టర్​లో సీఎం మేడారం చేరుకుంటారు. మేడారం తల్లుల గద్దెల మార్పు, భక్తులకు కావాల్సిన సౌకర్యాల కల్పన, జంపన్నవాగు సుందరీకరణ తదితర అంశాలపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ తదితరులతో కలిసి పూజారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం తీసుకోవాల్సిన చర్చలపై సమాలోచనలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తుది నిర్ణయం తీసుకునే క్రమంలో సీఎం మేడారం వస్తున్నట్లు స్పష్టం అవుతోంది. సీఎం పర్యటన నేపథ్యంలో సోమవారం మేడారంలో మంత్రి సీతక్క పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. 

ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తరు
మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్  శంకుస్థాపన చేస్తారని మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం పలువురితో కలిసి మంత్రి మేడారాన్ని సందర్శించారు. వనదేవతలను దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ సీఎం ముందుగా వనదేవతలను దర్శనం చేసుకుంటారని తెలిపారు.