
- ఎలక్షన్ ఇయర్ కావడంతో సర్కారు మల్లగుల్లాలు
- కలెక్టర్లకు మళ్లీ స్పెషల్ టాస్క్ ఇవ్వాలని యోచన
- అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే.. రీజన్ పెట్టేలా ప్రతిపాదన
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల ఏడాది కావడంతో ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ధరణి పోర్టల్‌ను ఎలా సెట్ చేయాలనే దానిపై రాష్ట్ర సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. దాదాపు 8 లక్షల అప్లికేషన్లు ధరణిలో ఆమోదం కోసం మూలుగుతున్నాయి. అన్ని మాడ్యుల్స్ లో ఉన్న అప్లికేషన్లు కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆఫీసర్లు చెప్తున్నారు. ప్రొహిబిటెడ్(నిషేధిత) లిస్ట్‌లో ఉన్న భూములకు సంబంధించి ప్రభుత్వం ఒకసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. అయినా 20% కూడా పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో కలెక్టర్లకే మళ్లీ స్పెషల్ టాస్క్ ఇవ్వాలనుకుంటోంది. అప్లికేషన్లకు టైం లైన్ పెట్టడంతోపాటు.. ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఎందుకు చేయాల్సి వచ్చిందో కారణాలు తెలపాలని అనుకుంటున్నట్లు తెలిసింది. రెవెన్యూ శాఖ రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయడంతో ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
రిజెక్ట్ చేస్తే.. రీజన్ చెబుదాం
ధరణిలో రోజూ సగటున 8 వేల నుంచి 10 వేల అప్లికేషన్లు వస్తున్నాయి. వీటిలో రిజెక్ట్ చేస్తున్న ఫైల్స్ భారీగానే ఉంటున్నాయి. ఫైల్‌ను ఎందుకు రిజెక్ట్ చేశారనే దానికి ఇప్పుడు కారణం చెప్పడం లేదు. అయితే అప్లికేషన్‌ను రిజెక్ట్ చేయడానికి కారణం ఏమిటో చెప్పేలా ధరణిలో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే టెక్నికల్ సిబ్బందితో చర్చలు జరిపినట్లు తెలిసింది. రిజెక్ట్ చేయడానికి రీజన్ పెడితే ఆఫీసర్లలోనూ జవాబుదారీతనం పెరుగుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఎమ్మార్వో స్థాయి నుంచి వస్తున్న ఎంక్వైరీ రిపోర్టులను కూడా పోర్టల్‌లో అందుబాటులో పెట్టాలనే ప్రతిపాదన కూడా ఉంది. అలాగే 33 మాడ్యుల్స్లో వస్తున్న అప్లికేషన్లకు.. వాటి పరిష్కారానికి సంబంధించి టైం లిమిట్ పెట్టాలని అనుకుంటున్నది. త్వరగా అయ్యే వాటికి తక్కువ రోజులు, ప్రొహిబిటెడ్, మిస్సింగ్ సర్వే నెంబర్లు, ఎక్స్టెంట్ కరెక్షన్, ల్యాండ్ క్లాసిఫికేషన్ చేంజ్ వంటి వాటికి ఎక్కువ రోజులు పెట్టాలని, దీనివల్ల త్వరగా అప్రూవల్స్ వస్తాయని, అవినీతి కొంతైనా తగ్గుతుందని ఉన్నతాధికారులు అంటున్నారు. అయితే వీటికి ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉన్నది.
ఫీడ్ బ్యాక్ రిపోర్టులు తెప్పించుకుంటున్నరు
ప్రతిపక్షాలు కూడా రైతుల పక్షాన నిలిచి ధరణి విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్, బీఎస్పీ ప్రకటించాయి. బీజేపీ కూడా ధరణి విషయంలో సర్కార్‌పై ఫైర్ అవుతోంది. దీంతో జిల్లాలవారీగా ధరణి సమస్యలు ఏమేం ఉన్నాయి? ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి? వాటికి పరిష్కారాలేంటి? ధరణిలో ఇంకా ఏం మార్పులు చేయగలం? అవినీతి, అక్రమాలను నిరోధించేదెలా? ప్రత్యేకంగా ఏమైనా మానిటరింగ్ అవసరమా? అనే దానిపై ఫీడ్ బ్యాక్ రిపోర్టులను ప్రభుత్వం తెప్పించుకుంటోంది. వాటికి అనుగుణంగా కలెక్టర్లకు మళ్లీ స్పెషల్ టాస్క్‌ను ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎలక్షన్ ఏడాది ఎఫెక్ట్ పడొద్దనే..
మొన్నటి దాకా ధరణిలో అంతా బాగుందని చెప్పుకొచ్చిన సర్కార్.. కింది స్థాయిలో రైతుల ఇబ్బందులు, కొన్నిచోట్ల అధికారులు, లీడర్ల నిలదీతలతో వెనక్కి తగ్గింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ మంత్రులు ధరణిలో కొన్ని ఇబ్బందులున్న మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. దేశంలో కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ ముందుకు పోతున్న తరుణంలో.. రాష్ట్ర రైతుల సమస్యలే పరిష్కరించలేకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టినట్టుగా తెలిసింది. ఎలాగైనా సరే ధరణిలోని కొన్ని సమస్యలకైనా చెక్ పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. పెండింగ్అప్లికేషన్ల పరిష్కారానికి నెల నుంచి 45 రోజుల పాటు త్వరలోనే మళ్లీ స్పెషల్ డ్రైవ్ పెట్టాలని కూడా ప్లాన్ చేస్తోంది.
రెవెన్యూ సదస్సులు పెట్టేందుకు జంకు
రాష్ట్రంలో భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు పెడతామని పోయిన ఏడాది జులై 5న ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో మండల కేంద్రంలో 100 బృందాలు ఏర్పాటు చేసి, ఎమ్మెల్యేల నేతృత్వంలో సదస్సులు నిర్వహిస్తామని చెప్పింది. దానిపై ఎలాంటి కసరత్తు చేపట్టలేదు. భారీ వర్షాలు, వరదల సాకుతో వాయిదా వేసి.. ఆ తర్వాత పూర్తిగా పక్కన పెట్టేసింది. ధరణిపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం.. ఎంతకీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సదస్సులు పెడితే మొదటికే మోసం వస్తుందని బీఆర్ఎస్ లీడర్లే చెప్తున్నారు. సీఎం జిల్లా సిద్దిపేటలోని ములుగులో గతంలో ధరణి సమస్యలపై నిర్వహించిన పైలెట్ ప్రోగ్రాంలో ఒక్క గ్రామంలోనే 272 మంది ధరణి తప్పులతో ఇబ్బంది పడుతున్నామని అధికారులను వేడుకున్నారు. ఇటీవల రెవెన్యూ సదస్సులపై మళ్లీ చర్చ వచ్చినా.. అవసరమా ఈ లొల్లి అన్న సమాధానం సీఎంవో నుంచి వచ్చినట్లు తెలిసింది.