వేములవాడ, వెలుగు:రైతులకు ఆదుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని విప్ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం వేములవాడ పరిధిలోని నాంపల్లిలోని లక్ష్మీనరసింహ కాటన్ ఇండస్ట్రీస్, సంకేపల్లిలోని లక్ష్మీ ఇండస్ట్రీస్, కోనరావుపేటలో కావేరి కాటన్ ఇండస్ట్రీస్‌లలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో ఐదు జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి మద్దతు పొందాలన్నారు. 20 నెలల పాలనలో రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం రూ. లక్ష కోట్లకు పైగా నిధులు ప్రభుత్వం వెచ్చించిందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్లు రొండి రాజు, కచ్చకాయల ఎల్లయ్య, ఆర్డీవో రాధాభాయ్, డీఏవో అఫ్జల్ బేగం, మార్కెటింగ్ శాఖ అధికారి ప్రకాశ్, సీసీఐ సీపీవో రఘురామ్, తహసీల్దార్లు విజయ్ ప్రకాశ్ రావు, వరలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.
అభిమానికి బైక్ అందజేత
ఎన్నికల్లో తన గెలుపు కోసం ఎక్సెల్ వాహనంపై ప్రచారం నిర్వహించిన అభిమాన రైతుకు కొత్త టూవీలర్‌ను విప్ ఆది శ్రీనివాస్ అందించాడు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి కి చెందిన కదురు బాలయ్య గత ఎన్నికల్లో ఆది శ్రీనివాస్ గెలుపు కోసం తన కూరగాయలమ్మే బండిపై మైక్ లో ఆది శీనన్నను గెలిపించండి అంటూ ఊరురూ తిరుగుతూ ప్రచారం చేశాడు. గెలిచాక గతంలోనే బాలయ్య ఇంటికి వెళ్లి దంపతులకు కొత్త బట్టలు పెట్టారు. కాగా ఇటీవల బాలయ్య టూవీలర్ పాడైన విషయం తెలుసుకున్న విప్.. సోమవారం అతనికి కొత్తది కొనిచ్చాడు. దీంతో సంతోషంతో బాలయ్య.. విప్‌ను టూవీలర్‌పై ఎక్కించుకొని సరదాగా తిరిగారు.
