ఎండ వచ్చిన తర్వాతే పత్తి తెంపాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఎండ వచ్చిన తర్వాతే పత్తి తెంపాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
  • రైతులకు సూచించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి 

చండూరు, (మర్రిగూడ)వెలుగు: పత్తి రైతులు ఎండ వచ్చిన తర్వాతనే పత్తిని తెంపాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం ఆమె నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మునుగోడు, మర్రిగూడ మండలాల్లో పర్యటించి సీసీఐ ద్వారా ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరైన తేమ శాతం 8 నుంచి12 మధ్య వచ్చిన వెంటనే సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయాలని సూచించారు. మర్రిగూడ మండలం ఎరుగండ్లపల్లిలోని లక్ష్మీ నరసింహ ఆగ్రో కాటన్ మిల్లులో రైతు వీరమళ్ల కృష్ణయ్య తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో పత్తి కొనుగోలు చేయడం లేదని, న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్నాడు. 

దీంతో కలెక్టర్ వెంటనే మిల్లు యాజమాన్యాన్ని పిలిచి రైతులను ఇబ్బంది పెట్టకుండా పత్తి కొనుగోలు చేయాలని చెప్పారు. రైతులు ఎండ వచ్చిన తర్వాత పత్తిని తెంపాలని, చలికాలం ఉదయం సమయంలో  మంచు వల్ల తేమ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు.  ఎండ వచ్చిన తర్వాత పత్తిని తీసినట్లైతే తేమ తక్కువగా ఉంటుందని తెలిపారు. రెండు రోజులు పత్తిని మిల్లులో ఉంచుకునేందుకు అవకాశం కల్పించాలని ఆమె మిల్లు యాజమాన్యానికి సూచించారు. మంచు కురుస్తున్నందున పత్తిని ఆరబెట్టుకొని పూర్తిగా ఎండిన తర్వాతే  కొనుగోలు కేంద్రాలను తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వీరి వెంట చండూరు ఆర్డీవో శ్రీదేవి, సీసీఐ అధికారులు, ఉన్నారు.