- ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయాలని హైవేపై రాస్తారోకో
- కొల్లాపూర్లో పీఏసీఎస్ ఆఫీసర్లపై ఆగ్రహం
అలంపూర్/కొల్లాపూర్, వెలుగు: ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉండవెల్లి సమీపంలో 44 నంబర్ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఉండవెల్లి మండలంలోని వరసిద్ధి వినాయక కాటన్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రంలో శనివారం వరకు ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తికి సీసీఐ అధికారులు అనుమతించారు. సోమవారం 7 క్వింటాళ్లు మాత్రమే ఆన్లైన్లో చూపిస్తోందని, అంత పత్తినే కొంటామని చెప్పారు.
దీంతో ఆగ్రహించిన రైతులు హైవేపై రాస్తారోకో చేపట్టగా, 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సీఐ రవిబాబు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. మార్కెట్ సెక్రటరీ ఎల్లస్వామి అధికారులకు విషయం తెలియజేసి, వారి ఆదేశాల మేరకు ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. అనంతరం ఎస్సైలు శేఖర్, మురళి, రవి, వెంకటస్వామి సిబ్బందితో కలిసి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.
కొల్లాపూర్ లో..
పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. వారం రోజుల కింద మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ, కొనుగోళ్లు ప్రారంభించక పోవడంపై పీఏసీఎస్ అధికారులను రైతులు నిలదీశారు. అనంతరం మార్కెట్ ఎదురుగా ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వెంటనే మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పోలీసులు రైతులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.
