మండల, జిల్లాస్థాయిలో రెవెన్యూ అటవీ కమిటీలు..స్వయంగా నేనే పర్యవేక్షిస్తా: మంత్రి పొంగులేటి 

మండల, జిల్లాస్థాయిలో రెవెన్యూ అటవీ కమిటీలు..స్వయంగా నేనే పర్యవేక్షిస్తా: మంత్రి పొంగులేటి 
  • జాయింట్ సర్వేతో  రెవెన్యూ, ఫారెస్ట్ భూ వివాదాలకు చెక్
  • ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలపై స్పెషల్ ఫోకస్

హైదరాబాద్, వెలుగు: దశాబ్దాలుగా పెండింగ్​లో ఉన్న రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దు వివాదాలకు జాయింట్ సర్వేతో శాశ్వత పరిష్కారం చూపుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి స్పష్టం చేశారు.  ఇందుకోసం జిల్లా, మండల స్థాయిల్లో రెవెన్యూ, అటవీ అధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సోమవారం సచివాలయంలో రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు, సర్వే సెటిల్‌‌మెంట్ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్, సర్వే అండ్ సెటిల్‌‌మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పీసీసీఎఫ్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘భూ వివాదాలు లేని తెలంగాణ’ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తేల్చిచెప్పారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో దశాబ్దాలుగా పట్టా భూములు, రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాల మధ్య సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని జాయింట్ సర్వే నిర్వహించాలన్నారు.

ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పద్ధతుల ద్వారా స్పష్టమైన సరిహద్దులను గుర్తించాలన్నారు. క్షేత్రస్థాయిలోనే పరిష్కరించదగిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని, ఉన్నతస్థాయిలో విధానపరమైన నిర్ణయాలు అవసరమైనప్పుడు మాత్రమే  రాష్ట్రస్థాయికి నివేదించాలన్నారు. రెవెన్యూ–అటవీ సరిహద్దు వివాదాల పరిష్కార ప్రక్రియను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని, రెండు శాఖల సమన్వయాన్ని, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని ప్రకటించారు. క్షేత్రస్థాయిలో జరిగే జాయింట్ సర్వేకు రైతులు, ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలపై త్వరలోనే నిర్ణయం

రాష్ట్రవ్యాప్తంగా 61 సంవత్సరాల వయస్సు దాటిన 3,797 మంది వీఆర్ఏల వారసులకు తక్షణమే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వీఆర్ఏ వారసుల జేఏసీ రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జేఏసీ ప్రతినిధి బృందం సోమవారం రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేసింది. వయోపరిమితి దాటిన వీఆర్ఏల కుటుంబాలకు రావల్సిన ఉపాధి అవకాశాలను వెంటనే కల్పించాలని కోరింది.

గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన జీవో నెంబర్ 81, జీవో నెంబర్ 85ల ప్రకారం నియామకాలు పూర్తి చేయాలన్నారు. జేఏసీ నేతల రిక్వెస్ట్ పై మంత్రి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. పెండింగ్‌‌లో ఉన్న వీఆర్ఏ వారసుల సమస్యల పరిష్కారంపై త్వరలోనే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ వారసుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్‌‌,రవి సాగర్, హరీశ్, రాజయ్య తదితర ప్రతినిధులు పాల్గొన్నారు.