- ఎంత పెంచితే రాష్ట్ర సర్కారుకు అంత ఆమ్దానీ
- వ్యాట్‌తో రోజుకు రూ. 55 కోట్ల ఆదాయం
- ఇతర రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించినా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. రోజురోజుకూ ధరలు పెరిగిపోతున్నాయి. నాలుగు నెలల కింద కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని కొద్దిమేర తగ్గించినా.. ఇప్పుడు రేట్లు పెంచుకుంటూ పోతున్నది. పెట్రో రేట్లు పెరుగుతున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వాలకు మస్తు ఆదాయం వస్తున్నది. తెలంగాణ ఖజానాకు ఇంకింత ఎక్కువగానే వస్తున్నది. పెట్రోల్, డీజిల్‌పై దేశంలోనే అత్యధికంగా వ్యాట్ విధిస్తున్న రెండో రాష్ట్రం కూడా తెలంగాణ కావడంతో వాటి ద్వారా వచ్చే ఆదాయానికి కొదవ లేదు. ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించినా మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించలేదు. ఆమ్దానీ తెచ్చిపెడుతున్న వ్యాట్ వడ్డనకు తోడు.. డీజిల్ రేట్లు పెరిగాయన్న సాకుతో ఆర్టీసీ చార్జీలు ఇష్టమొచ్చినట్లు పెంచుతూ పోతున్నది. ఒక్క ఆర్టీసీ ద్వారానే వ్యాట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు సుమారు రూ. కోటిన్నర వస్తున్నప్పటికీ ప్రయాణికులపై ఇంకా చార్జీలు, సెస్‌ల భారం పెంచుతున్నది.
రాష్ట్రంలో వ్యాట్ ద్వారా ఇట్లా..
రాష్ట్రంలో రోజూ పెట్రోల్ బంక్‌లలో సుమారు 35 లక్షల లీటర్ల పెట్రోల్, 1.50 కోట్ల లీటర్ల డీజిల్ అమ్ముడవుతున్నది. మార్చి 22న హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 109.10, డీజిల్ రూ. 94.62 ఉండగా.. శనివారం నాటికి లీటరు పెట్రోల్ రూ. 119.49, డీజిల్ 105.49 నడుస్తున్నది.
అంటే పదిహేను ఇరవై రోజుల్లో సుమారు లీటరుపై రూ. 10పైగా పెరిగింది. లీటర్ పెట్రోల్‌పై రూ. 10 పెరిగితే గతంలో వచ్చే దానికి కంటే రాష్ట్రానికి రూ. 3.50 అదనంగా ఆదాయం సమకూరుతుంది. డీజిల్‌పై రూ. 2.70 అదనపు ఇన్‌కం వస్తుంది. మార్చి 22న తెలంగాణ ప్రభుత్వానికి వ్యాట్‌రూపంలో రోజుకు సుమారు రూ. 50 కోట్ల ఇన్‌కం రాగా, శనివారం దాదాపు రూ. 55 కోట్లు సమకూరింది. అంటే 20 రోజుల కిందటితో పోలిస్తే ప్రస్తుతం రోజూ రూ. 5 కోట్లు అదనంగా రాబడి వస్తున్నది. లీటర్ పెట్రోల్‌పై ఒక రూపాయి పెరిగితే రాష్ట్ర సర్కార్‌కు 35 పైసల దాకా అదనంగా సమకూరుతుందన్న మాట. ఇక కమర్షియల్ సేల్స్ దీనికి అదనం.
అన్నింటిపైనా ఎఫెక్ట్
ప్రస్తుతం పెట్రో రేట్లు పెరగడంతో దాని ప్రభావం అన్ని రంగాలపైనా పడుతున్నది. ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు పెరగడంతో ఆటోమెటిక్‌గా అన్నింటి ధరలు పెరిగిపోతున్నాయి. కూరగాయలు మొదలుకొని, కిరాణ సామాను వరకు అన్నింటి రేట్లు చుక్కలనంటుతున్నాయి. ఏం కొనలేని పరిస్థితి ఏర్పడింది. సిమెంట్, స్టీల్ ధరలు కూడా పెరిగాయి.
రాష్ట్ర సర్కార్ తీరుతో తగ్గిన డీజిల్ సేల్స్
రాష్ట్రంలో సర్కారు తీరుతో డీజిల్ సేల్స్ తగ్గిపోయాయి. డీజిల్‌పై వ్యాట్ తగ్గించకపోవడమే ఇందుకు కారణం. గతంలో రాష్ట్రంలో రోజూ 2.30 కోట్ల లీటర్ల డీజిల్ అమ్ముడయ్యేది. కానీ తెలంగాణ కంటే ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు దొరుకుతుండటంతో లాంగ్ జర్నీ బండ్లు అక్కడే పోయించుకుంటున్నాయి. తెలంగాణ బార్డర్ వరకు కొద్ది మేర డీజిల్ కొట్టించుకొని, ఆ తర్వాత పక్క రాష్ట్రంలోకి వెళ్లగానే ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నాయి. పెద్దపెద్ద కన్‌స్ట్రక్షన్ కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాల నుంచి డీజిల్ తెప్పించుకుంటున్నాయి.
ఆర్టీసీ ద్వారా ‘వ్యాట్’ వస్తున్నా.. ప్రజలపై చార్జీల బాదుడు
ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 30 లక్షల మందికిపైగా ప్రయాణిస్తుంటారు. సుమారు 9 వేల బస్సులు నడుస్తున్నాయి. రోజుకు 6 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. దీన్ని ఆర్టీసీ రిటైల్‌గా కాకుండా బల్క్‌లో కొనుగోలు చేస్తుంది. ప్రస్తుతం బల్క్‌లో లీటర్ డీజిల్ రూ. 118కి పెరిగింది. ఈ లెక్కన వ్యాట్ రూపంలో ఆర్టీసీ నుంచి సర్కారుకు ఒక్క రోజులో రూ. కోటిన్నర పైగా సమకూరుతున్నది. ఆర్టీసీ మాత్రం డీజిల్ ధరలు పెరిగాయని ఇప్పటికే పలు రకాల చార్జీలు పెంచేసింది. ప్యాసింజర్ సెస్, సేఫ్టీ సెస్, డీజిల్ సెస్ పేరుతో పాటు రౌండ్ ఫిగర్ అని ప్రయాణికులపై భారం మోపుతున్నది. బస్ పాస్ చార్జీలను పెంచేసింది. త్వరలో బస్సు కిరాయిని మరో 20 నుంచి 30% పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించినా ఆర్టీసీకి భారం తగ్గేదని, ఫలితంగా చార్జీలు పెంచాల్సిన అవసరం ఉండబోదని యూనియన్ నేతలు చెప్తున్నారు. సర్కారు మాత్రం వ్యాట్‌ను తగ్గించేది లేదని అంటున్నది.
