మోకిల ప్లాట్ల వేలంతో సర్కార్​కు.. రూ.716 కోట్ల ఆదాయం

మోకిల ప్లాట్ల వేలంతో సర్కార్​కు.. రూ.716 కోట్ల ఆదాయం
  • ఫేజ్ 1లో 48 ప్లాట్లకురూ.121 కోట్లు
  • ఫేజ్ 2లో 298 ప్లాట్లు సేల్.. రూ.594 కోట్ల రెవెన్యూ
  • అత్యధికంగా గజం ధరరూ.1.05 లక్షలు
  • కొన్నోళ్ల పేర్లు వెల్లడించని హెచ్ఎండీఏ

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిల ఫేజ్ 2లో ప్లాట్ల వేలం ముగిసింది. ఐదు రోజుల పాటు నిర్వహించిన వేలంలో 300 ప్లాట్లలో 298 ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.594.99 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల 7న మోకిలా ఫేజ్ 1లో 50 ప్లాట్లను వేలం వేశారు. 48 ప్లాట్లు అమ్ముడుపోగా, రూ.121.40 కోట్ల ఆదాయం వచ్చింది. రెండు ఫేజ్​లలో కలిపి రూ.716.39 కోట్లు సర్కార్ ఖజానాలో వచ్చి చేరాయి. ఫస్ట్ ఫేజ్ లో అత్యధికంగా గజం రూ.1,05,000 పలకగా, రెండో ఫేజ్ లో అత్యధికంగా గజం రూ.1లక్ష వరకు పలికింది.

ఫేజ్​ 2లో తప్పిన అధికారుల రెవెన్యూ అంచనా

మోకిల ఫేజ్ 2లో మొత్తం 300 ప్లాట్లను హెచ్ఎండీఏ ఆన్ లైన్ లో వేలం వేసింది. ఈ ప్లాట్ల అమ్మకం ద్వారా మొత్తం రూ.850 కోట్ల రెవెన్యూ వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ, ఆ మేర ఆదాయం రాలేదు. 2 ప్లాట్లు మినహా మిగిలిన 298 ప్లాట్లకు భారీగానే ధర పలికినప్పటికీ రూ.594.99 కోట్లు మాత్రమే వచ్చాయి. రెండు ఫేజ్​ల వేలంలో రెండు ప్లాట్లకు మాత్రమే గజం ధర లక్ష వరకు పలికింది. ఇక మిగిలిన ప్లాట్లకు గజం కనిష్టంగా రూ.49వేలు పలకగా.. యావరేజ్​గా రూ.63,216 ధర వచ్చింది. అయితే, ఆన్ లైన్ వేలంలో ప్రభుత్వ పెద్దల సూచన మేరకు కొంత మంది ఇతర బిడ్డర్లు కొనకుండా భారీగా ధర కోట్ చేశారనే చర్చ జరుగుతున్నది. ఇటీవల ఓ రోజు వేలంలో గజం రూ.25వేల నుంచి ఒకేసారి రూ.75వేలకు కోట్ చేయడంతో మిగిలిన బిడ్డర్లు వెనక్కి తగ్గారని, ఇదంతా ప్రీ ప్లాన్ అని అధికారులు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు.

విమర్శల కారణంగానే పేర్లు సీక్రెట్

మోకిల ఫేజ్ 2లో 5 రోజుల పాటు నిర్వహించిన వేలంలో 298 ప్లాట్లను కొనుగోలు చేసిన వ్యక్తుల, కంపెనీల వివరాలను మాత్రం హెచ్ఎండీఏ సీక్రెట్ గా ఉంచింది. వారి పేర్లు వెల్లడించొద్దని ప్రభుత్వ పెద్దలు ఆదేశించడంతో ఈ వివరాలు రహస్యంగా ఉంచామని హెచ్ఎండీఏ అధికారులు చెప్తున్నారు. ఆ మధ్య కోకాపేటలో అధికార పార్టీ ఎమ్మెల్సీకి చెందిన కంపెనీ ఎకరం రూ.100 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ వేలంలో ప్లాట్లు కొన్న కంపెనీలు, వ్యక్తుల వివరాలు బయట పెట్టడంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. అధికార పార్టీ నేతలు, వారి బినామీలే ఈ ప్లాట్లు కొన్నారని ఆరోపణలు చేయడంతో అప్పటి నుంచి ప్లాట్ల వేలం వేస్తున్నా కొనుగోలు చేసిన వారి వివరాలను హెచ్ఎండీఏ బయటకు వెల్లడించడం లేదు. ఇటీవల బుద్వేల్ లో 100 ఎకరాలకు వేలం నిర్వహించిన టైమ్​లో కూడా వివరాలు బయటపెట్టలేదు.