హైదరాబాద్, వెలుగు: పురాతన దేవాలయాలలో వంశపారంపర్య అర్చకత్వం పునరుద్ధరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు, ఆలయాల పరిరక్షణ ఉద్యమ కన్వీనర్ రంగరాజన్ కోరారు. గురువారం భట్టిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందచేశారు. భద్రాద్రి, వేములవాడ, బాసర తదితర పురాతన ఆలయాల సంప్రదాయ అర్చకుల పెండింగ్ సమస్యలను భట్టి దృష్టికి తీసుకెళ్లారు.
వంశపారంపర్య అర్చకుల ఆచార వ్యవహారాలను ప్రభుత్వం నిలిపివేస్తే సంప్రదాయ దేవాలయాలు, గ్రామీణ దేవాలయాలు మూతపడతాయని 1996లో డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించిన విషయాన్ని రంగరాజన్ గుర్తు చేశారు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2007లో ఒక చట్టం ద్వారా వారి సేవలను పునరుద్ధరించిందని, 16 ఏండ్లు గడిచినా తెలంగాణలో ఈ సవరణ చట్టం అమలు కావడం లేదన్నారు.
ఏపీలో ప్రభుత్వం 2019లో జీవో ఎంఎస్ 439ని జారీ చేసి వేలాది అర్చక కుటుంబాలకు వారసత్వ ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు. అర్చకులకు పే స్కేళ్లు అమలు చేయాలన్నారు. ఈ అంశాలపై భట్టి స్పందిస్తూ పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు రంగరాజన్ పేర్కొన్నారు.
