తడిసిన వడ్లు కొనేదాకా ఊరుకోం

తడిసిన వడ్లు కొనేదాకా ఊరుకోం

తడిసిన వడ్లు కొనేదాకా ఊరుకోం
ఢిల్లీలో మోడీ, గల్లీలో కేడీ కలిసి రైతులను ముంచిన్రు: రేవంత్ రెడ్డి
ఇద్దరూ కొనకుంటే వడ్లు దావుద్ ఇబ్రహీం కొంటడా?
18 నెలల్లో నెల్లికల్ పూర్తి చేస్తామన్నరు.. తట్ట మట్టి తీయలే
ఉమ్మడి నల్గొండ సన్నాహక సభలో పీసీసీ చీఫ్ ఫైర్

నల్గొండ, వెలుగు : 
‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లు కొనకుండా ధర్నాలు చేస్తుంటే.. దుబాయ్ నుంచి దావుద్​ ఇబ్రహీం వచ్చి కొంటడా? అట్లయితే సీఎం కేసీఆర్ ఎందుకు? పీఎం మోడీ ఎందుకు?’’ అని పీసీసీ చీఫ్ రేవంత్‌‌రెడ్డి మండిపడ్డారు.‘‘ఢిల్లీలో ఉన్నోడు మోడీ.. గల్లీలో ఉన్నోడు కేడీ.. బీజేపీ వాళ్లు వచ్చి ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేస్తరు. ఇక్కడున్న టీఆర్ఎస్ వాళ్లేమో ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తరు. వీళ్లు చేస్తున్న ధర్నా ఎందుకు” అని ప్రశ్నించారు. శుక్రవారం నాగార్జునసాగర్‌‌‌‌లో జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్, మోడీకి కావాల్సింది రాజకీయ ప్రయోజనాలేనని, రాష్ట్రంలో పార్టీలను పెంచుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అకాల వర్షాలు వస్తే వడ్లు కొనలేరని మార్చి నుంచే తాము మొత్తుకుంటున్నామని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల ఇప్పటి వరకు సెంటర్లు ఓపెన్​ చేయలేదన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల లక్షల క్వింటాళ్ల వడ్లు కల్లాల్లో తడిసిపోయాయన్నారు. వడ్లు తడవకుండా కాపాడుకునేందుకు కనీసం టార్పాలిన్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కల్లాల్లో తడిసిన, మొలకెత్తిన వడ్లను ఎంఎస్పీ ఇచ్చి ప్రభుత్వమే కొనాలని, లేదంటే తాము ఊరుకోబోమని స్పష్టం చేశారు.

రైతుల జీవితాలతో చెలగాటం
కమీషన్లకు ఆశపడి మిల్లర్ల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ సీజన్​లో ఏడు వేల కొనుగోలు సెంటర్లు తెరవాల్సి ఉన్నప్పటికీ 2,300 కేంద్రాలు మాత్రమే ఓపెన్ చేశారని చెప్పారు. 15 కోట్ల గన్నీ సంచులు అవసరం కాగా.. 8 కోట్ల బ్యాగుల కోసం టెండర్లు పిలిచారని, కాంట్రాక్టర్లకు బిల్లులుపెండింగ్‌‌లో ఉండటంతో ఒక్కరు కూడా టెండర్ వేయలేదని అన్నారు. మిల్లులకు కోటా ఇయ్యలేదని, నూకలకు సంబంధించి ఇచ్చే బోనస్​కూడా తేల్చకపోవడంతో మిల్లర్లు వడ్లను దించుకోకుండా పేచీ పెడుతున్నారని అన్నారు. వరంగల్‌‌లో జరిగే రైతు సంఘర్షణ సభకు ప్రతి రైతు కుటుంబం నుంచి ఒకరు తప్పనిసరిగా తరలిరావాలని, ఆ ఉప్పెన కేసీఆర్ ప్రభుత్వాన్ని కమ్మేయాలని అన్నారు. ఈసభ కేసీఆర్ ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అంతుతేల్చే వరకు కాంగ్రెస్​ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

జానా కాంగ్రెస్ రింగ్​మాస్టర్​
కాంగ్రెస్ ​సీనియర్​ నేత జానారెడ్డి చట్టసభల్లో లేకపోవడం వల్ల వాటి గౌరవం తగ్గిపోయిందని రేవంత్ అన్నారు. కాంగ్రెస్​లో పులులు, సింహాల్లాంటి లీడర్లు ఉన్నారని, వారికి జానారెడ్డి రింగ్​మాస్టర్ లాంటి వారని చెప్పారు. జానారెడ్డికి పదవులు అవసరం లేదని, తెలంగాణ సమాజం ఆయనకు ఎప్పుడూ సముచిత స్థానమే ఇస్తోందన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఆయన గౌరవం తగ్గిపోలేదని, ప్రజల్లో తగిన స్థానం ఉందని అన్నారు.

జగదీశ్​రెడ్డి.. ఏడ పన్నవ్?
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఒక్కో ఎమ్మెల్యేకు ఒక్కో బాగోతం ఉందని రేవంత్​రెడ్డి ఆరోపించారు. జిల్లా మంత్రి జగదీశ్​రెడ్డి ఇసుక దందా నడిపిస్తుంటే, హుజూర్‌‌‌‌నగర్​ఎమ్మెల్యే సైదిరెడ్డి భూకబ్జాలు చేస్తున్నారని, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే మేనమామ చిల్లర పనులకు కూడా కమీషన్లు తీసుకుంటున్నాడన్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక, మైనింగ్, మాఫియా దందా నడిపిస్తున్నారని, రేప్​లు, మర్డర్లు చేయిస్తున్నారని ఆరోపించారు. ఒక సీఐతో ఫోన్‌‌లో ఎమ్మెల్సీ తిట్ల పురాణం అంతా విన్నారన్నారు. నెల్లికల్లు లిఫ్ట్ ఏడాదిన్నరలోగా పూర్తి చేస్తానని మంత్రి జగదీశ్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇంతవరకు పూర్తికాలేదని  రేవంత్​ అన్నారు. ‘‘మూడు అడుగులున్న జగదీశ్​రెడ్డి.. ఆరుడుగుల ఎత్తు ఎగిరి ఏడాదిన్నరలోగా ప్రాజెక్టు పూర్తిచేస్తాన్నడు.. హామీ ఇచ్చి ఏడాదిన్నర అవుతుంది. తట్టెడు మట్టి కూడా తీయలే.. ఎక్కడ పండుకున్నవ్’’ అని నిలదీశారు.

వచ్చేది కాంగ్రెసే : జానారెడ్డి
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని జానారెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో, స్వేచ్ఛ కోసం జరిగిన ఉద్యమాల్లో జిల్లా నుంచి ఎంతో మంది తమ ప్రాణాలను ఇచ్చారని, అలాంటి జిల్లాలో అధికారపార్టీ డబ్బులతో రాజకీయం చేస్తోందని అన్నారు. తాను ఈ సమావేశానికి రావాలనుకోలేదని, ఇంట్లోనే కూర్చుని సంతోషించాలనుకున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో రైతులకు మేలు చేసేలా రైతు సంఘర్షణ సభ ఉంటుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రుణమాఫీ, కౌలురైతుల సమస్యలు, పంటల బీమా తదితర అంశాలపై రాహుల్​గాంధీ సభలో తీర్మానం చేస్తామన్నారు.