
- ఎవిడెన్స్ దొరక్కుండా చేసే కుట్ర
- థర్డ్ ఫ్లోర్లో సెమినార్ హాల్
- కన్ఫ్యూజన్లో సెకండ్ ఫ్లోర్లో విధ్వంసం
కోల్‌కతా: ఆర్జీ కార్ హాస్పిటల్‌పై పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగినట్లు తెలుస్తున్నది. సెమినార్ రూమ్‌ను ధ్వంసం చేయాలనే ఆలోచనతో కొందరు హాస్పిటల్లోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించినట్లు స్పష్టమవుతున్నది. గురువారం తెల్లవారుజామున ముసుగులు ధరించిన కొందరు యువకులు రాడ్లు, కర్రలు పట్టుకుని హాస్పిటల్లోకి వెళ్లారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మెడికల్ ఎక్విప్మెంట్ను ధ్వంసం చేసుకుంటూ పైకి వెళ్లారు. దుండగుల్లో ఒకడు బెంగాలీ భాషలో ‘‘పదండి.. సెమినార్ రూమ్‌కు వెళ్దాం..’’ అని మిగిలిన వారితో అనడం వీడియోలలో వినిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
సెమినార్ హాల్ మూడో ఫ్లోర్లో ఉంది. కానీ.. కన్ఫ్యూజన్లో వాళ్లంతా రెండో ఫ్లోర్‌కు వెళ్లి అక్కడి రూమ్‌లను ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలను పగులగొట్టి పారిపోయారు. ట్రెయినీ డాక్టర్ అత్యాచారానికి గురైన సెమినార్ హాల్‌కు ఎలాంటి నష్టం జరగలేదని సమాచారం. బుధవారం అర్ధరాత్రి మహిళలు నిర్వహించిన క్యాండిల్ ర్యాలీని ఆసరాగా చేసుకుని సాక్ష్యాధారాలు చెరిపేసే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనలో 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.