పెరిగిన బియ్యం ధరలు సామాన్యులకు చుక్కలు

పెరిగిన బియ్యం ధరలు సామాన్యులకు చుక్కలు

పెరిగిన బియ్యం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటి వరకు కూరగాయలు, పప్పుల ధరలు పెరిగితే.. ఇప్పుడు రైస్ రేట్లు కూడా పెరగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో బియ్యం ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో బియ్యం కొనుగోలు చేయాలంటే సామాన్యులు హడలిపోతున్నారు.

 గతంలో హైదరాబాద్ నగరంలో చాలా మంది ప్రజలు రేషన్ బియ్యాన్ని మార్కెట్లో అమ్మి...సన్నబియ్యం కొనేవారు. కానీ ప్రస్తుతం రేట్లు పెరగడంతో రేషన్ బియ్యాన్నే వినియోగించుకుంటున్నారు. ధరలు భారీగా పెరగడంతో నెలవారీ ఖర్చులు భారీగా పెరిగాయంటున్నారు పబ్లిక్. ప్రభుత్వాలు స్పందించి పెరిగిన రైస్ రేట్లను తగ్గించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

రాష్ట్రంలో, దేశంలో వరిసాగు తగ్గడమే బియ్యం రేట్ల పెంపునకు కారణంగా చెబుతున్నారు వ్యాపారులు. కొన్నాళ్ల కిందట వరకు క్వింటాల్ బియ్యం 4వేల8వందల నుంచి 5వేల వరకు ఉండగా.. ప్రస్తుతం 6వేల2వందల నుంచి 6వేల8వందల వరకు పెరిగాయి.  పాత బియ్యం అయితే 7వేల 5వందల వరకు పలుకుతుంది. మొత్తంగా సగటున క్వింటాలు బియ్యం ధరలు వెయ్యి నుంచి 15వందల వరకు పెరిగాయని చెబుతున్నారు వ్యాపారులు.

దీంతో గతంలో HMT, సోనామసూరి రకాలు కొనేవాళ్లు దొడ్డు రకాలు కొంటున్నారని తెలిపారు. దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పంటలు దెబ్బతినడం, సన్నాల సాగు తగ్గడంతోనే బియ్యం రేట్లు పెరిగాయంటున్నారు మార్కెట్ ఎక్స్ పర్ట్స్. వేసవి పంట చేతికొస్తే కాస్త రేట్లు తగ్గే అవకాశం ఉందంటున్నారు.