సర్కారు నిర్లక్ష్యంతో మిల్లర్ల మాయాజాలం

సర్కారు నిర్లక్ష్యంతో మిల్లర్ల మాయాజాలం
  • రెండేండ్లలో వడ్ల ధరలో రూ.500 వరకు కోత
  • పాత బియ్యం రేట్లు రూ.600 దాకా పెంపు
  • మునుగుతున్న రైతులు, వినియోగదారులు

నల్గొండ, వెలుగు: కరోనా టైంలో ఆ తర్వాత అన్ని వస్తువుల రేట్లు పెరుగుతుంటే మిల్లర్లు మాత్రం సన్నవడ్ల రేట్లు తగ్గిస్తున్నారు. సేమ్​టైం బియ్యం రేట్లు మాత్రం పెంచుకుంటున్నారు. రెండేండ్ల కింద సన్నవడ్లకు మద్దతు ధరను మించి క్వింటాల్ కు రూ.2,300 వరకు కొన్న మిల్లర్లు ఆ తర్వాత క్రమంగా తగ్గిస్తూ ప్రస్తుతం రూ.1800  వరకే చెల్లిస్తున్నారు. అప్పట్లో క్వింటాల్​ పాత బియ్యాన్ని రూ. 4,400- నుంచి 4,600కు అమ్మిన మిల్లర్లు, ఇప్పుడు రూ.5వేల నుంచి రూ.5,200 వరకు అమ్ముకుంటున్నారు. మూడేండ్లలో సన్న వడ్ల రేటు రూ.500 తగ్గితే, బియ్యం రేటు మాత్రం రూ.600 వరకు పెరిగింది.

ఈ సీజన్​లో క్వింటాల్​ వడ్లకు కేంద్రం రూ.1960 ప్రకటించగా, రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేస్తున్న కొనుగోలు సెంటర్లలో అదే రేటు చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు సెంటర్లలో సన్నవడ్లను కొనుగోలు చేయడం లేదు. దొడ్డు వడ్లు గింజ లేకుండా కొన్న తర్వాత సన్నాల గురించి ఆలోచిస్తామని ఆఫీసర్లు అంటున్నారు. దీంతో నల్గొండ లాంటి జిల్లాల్లో ఎప్పట్లాగే రైతులు సన్నవడ్లను మిల్లులకు తరలిస్తుండగా, రూ.1800కు మించి చెల్లించడం లేదు. ఇలా సర్కారు వ్యవహరిస్తున్న తీరు వల్ల మిల్లర్లు సన్నాలకు రేట్లు తగ్గిస్తుండడంతో ఇటు రైతులు, అటు వినియోగదారులు నిండా మునుగుతున్నారు. 
అప్పట్లో సన్నవడ్లను ఎగబడి కొన్నరు.. 
మన రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు సన్నబియ్యం తినడంతో మొదటి నుంచీ సన్నవడ్లకు డిమాండ్​ ఎక్కువ. కానీ కేంద్రం సన్నవడ్లు, దొడ్డు వడ్లు అని కాకుండా గ్రేడ్​వన్​, కామన్​ రకాలుగా ఎంఎస్​పీ (కనీస మద్దతు ధర) ప్రకటిస్తుంది. దీంతో రెండేండ్ల క్రితం వరకు ఉమ్మడి కరీంనగర్​, నల్గొండ లాంటి జిల్లాల్లో మిల్లర్లు మద్దతు ధరకు మించి రేటు పెట్టి సన్నాలను కొన్నారు. 2019–2020లో క్వింటాల్​వడ్లకు కేంద్రం రూ.1835 ఎంఎస్​పీ ప్రకటిస్తే మిల్లర్లు ఏకంగా రూ.2300 చెల్లించారు. ఇది ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కన్నా రూ.465  ఎక్కువ కావడం విశేషం.

ఆ తర్వాత కరోనా వల్ల మార్కెట్లు దెబ్బతిన్నాయనే సాకుతో  మిల్లర్లు సన్నవడ్ల రేట్లను మరుసటి ఏడాది ఏకంగా రూ.300 వరకు తగ్గించారు. ఈ దశలో జోక్యం చేసుకొని సన్నవడ్లకు ఎక్కువ రేటు వచ్చేలా చూడాల్సిన రాష్ట్ర సర్కారు ఆ పని చేయలేదు.  పైగా కొనుగోలు కేంద్రాల్లో సన్నవడ్లను కొనే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. దీంతో దొడ్డు వడ్లను పండించిన రైతులు కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే సన్నాలు పండించిన రైతులు వడ్లు అమ్ముకునేందుకు మిల్లర్లు తప్ప వేరే దిక్కులేకుండా పోయింది. తాజాగా యాసంగిలో రైతులు 36 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 65 లక్షల టన్నుల వడ్లు అమ్మకానికి వస్తాయని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో 17 లక్షల ఎకరాల్లో సన్నాలే కావడంతో సగానికిపైగా ఆ వడ్లే రానున్నాయి. కానీ ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో సన్నాలు  కొనే పరిస్థితి  లేదు. ఇలాంటి అవకాశాలే   మిల్లర్లకు వరంగా మారుతుండడంతో సన్నవడ్ల రేట్లను తగ్గిస్తూ వచ్చి ఇప్పుడు ఎంఎస్​పీ కంటే దిగజార్చారు. 

బియ్యం రేట్లు పెంచుకుంటున్నరు.. 
సన్నవడ్ల రేటును క్రమంగా తగ్గిస్తున్న మిల్లర్లు బియ్యం రేట్లను మాత్రం పెంచుతున్నారు. సహజంగా కొత్త బియ్యం రేట్లను  క్వింటాల్​కు రూ.3,000 నుంచి 3,600  చూపుతున్నారు. కానీ సన్నబియ్యం తినేవాళ్లు ఎక్కువగా పాత బియ్యానికే ప్రియారిటీ ఇస్తుంటారు. కానీ సాంబా, హెచ్ఎంటీ, చింట్లు, పూజలు లాంటి పాత బియ్యం మాత్రం నాలుగేండ్లుగా పెరగడం తప్ప తగ్గడం లేదు. 2019లో క్వింటాల్​కు గరిష్టంగా  రూ.4,800 ఉండగా, ప్రస్తుతం  రూ. 5200 నడుస్తోంది. కొన్నిచోట్ల రూ.4400 నుంచి రూ.5వేల మధ్య పాతబియ్యం అమ్ముతున్నా క్వాలిటీపరంగా తేడాలుంటున్నాయి. ఎలాంటి  క్వాలిటీ బియ్యానికి ఎలాంటి రేటు ఉండాలో చెప్పేది, ఫైనల్​చేసేది మిల్లర్లే తప్ప అధికారులు కాదు. ఒకరకంగా మిల్లర్లు ప్యాక్​ చేసిందే క్వాలిటీ, మిల్లర్లు చెప్పిందే రేటు అన్నట్లుగా పరిస్థితి ఉంది.   సివిల్​ సప్లై శాఖ పట్టించుకోకపోవడం, సర్కారు  ఈ ఇష్యూనే వదిలే యడంతో రైతులు, జనాలు నష్టపోతున్నారు.