
క్రికెట్ చరిత్రలో ఊహించని సంచలనం నమోదయింది. ఒక జట్టు చాలా సార్లు తక్కువ స్కోర్లకు ఆలౌట్ అవ్వడం చూశాం కానీ ఒక వన్డే మ్యాచ్‌లో ఒక జట్టు కేవలం రెండు పరుగులకే ఆలౌటవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మిడిల్‌సెక్స్ కౌంటీ క్రికెట్ లీగ్‌లో ఈ సంఘటన జరిగింది. నార్త్ లండన్ సిసి 3వ ఎలెవన్ తో జరిగిన మ్యాచ్ లో రిచ్‌మండ్ సిసి 4 ఎలెవన్ 2 పరుగులకే ఆలౌట్ అయ్యి క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్వల్ప స్కోర్ కు ఆలౌట్ అయిన జట్టుగా చెత్త రికార్డ్ మూటకట్టుకుంది.
నార్త్ లండన్ సిసి విధించిన 427 పరుగుల లక్ష్య ఛేదనలో రిచ్మండ్ సిసి 4 ఎలెవన్ అనూహ్యంగా 2 పరుగులకే చేతులెత్తేసింది. ఏకంగా 8 మంది డకౌట్ కావడం క్రికెట్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేస్తోంది. రిచ్మండ్ సిసి తరపున టామ్ పెట్రిడ్స్ మాత్రమే తన ఖాతా తెరిచాడు. మిగతా బ్యాటర్లందరూ డకౌట్ అయ్యారు. దీంతో రిచ్మండ్ సిసి 424 పరుగుల తేడాతో ఘోరమైన రికార్డ్ ను తమ ఖాతాలో వేసుకుంది.
►ALSO READ | IPL 2025 final: ఐపీఎల్ ఫైనల్లో ఆపరేషన్ సిందూర్ సెలెబ్రేషన్స్.. త్రివిధ దళాధిపతులకు బీసీసీఐ ఆహ్వానం
మొదట బ్యాటింగ్ చేసిన నార్త్ లండన్ సిసి జట్టు 45 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 426 పరుగులు చేసింది. డేనియల్ సిమ్మన్స్ 20 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 140 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓవరాల్ గా నార్త్ లండన్ ఇన్నింగ్స్ లో 46 ఫోర్లు, 10 సిక్సర్లతో సత్తా చాటారు. రిచ్మండ్ సిసి బౌలింగ్ చాలా పేలవంగా ఉంది. ఆ జట్టు ఏకంగా 65 వైడ్లు.. 16 నో-బాల్స్ తో 92 ఎక్స్‌ట్రాల రూపంలోనే ఇచ్చారు. లక్ష్య ఛేదనలో రిచ్మండ్ సిసి కేవలం 5.4 ఓవర్లలో రెండు పరుగులకే ఆలౌట్ అయింది.