Shreyas Iyer: ఇండియన్ క్రికెట్‌లో ఇప్పుడు టీ20 కెప్టెన్సీ (T20I Captaincy) చుట్టూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జూన్‌లో జరగబోయే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కోసం గౌహతిలో సమావేశమైన వేళ.. పంజాబ్ కింగ్స్ (PBKS) హెడ్ కోచ్, ఆస్ట్రేలియా లెజెండ్ క్రికెటర్ రిక్కీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)కి వారసుడిగా, టీమిండియా నెక్ట్స్ టీ20 కెప్టెన్ అయ్యేందుకు అన్ని అర్హతలూ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు ఉన్నాయని పాంటింగ్ చెప్పుకొచ్చారు.
సూర్య కెప్టెన్సీపై ఒత్తిడి:
ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత్ ఈ ఏడాదే టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పటికీ.. ఇటీవల ఆయన వ్యక్తిగత ఫామ్ క్షీణించడం, భవిష్యత్తు కోసం జట్టును నిర్మించాలనే బోర్డు ఆలోచనలతో సూర్య కెప్టెన్సీపై ఒత్తిడి పెరుగుతోంది. జూన్-జూలైలో జరిగే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు సూర్యనే కెప్టెన్‌గా కొనసాగించినా, అతని ఆటపై గట్టి నిఘా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో రికీ పాంటింగ్ పీటీఐ (PTI) వార్తా సంస్థతో మాట్లాడుతూ.. టీమిండియా తదుపరి కెప్టెన్సీ రేసులో చాలా మంది ఉండొచ్చని, కానీ తన దృష్టిలో శ్రేయస్ అయ్యర్ ప్రధాన పోటీదారు అని వెల్లడించాడు. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో ఆన్-ఫీల్డ్, ఆఫ్-ఫీల్డ్ లీడర్‌గా అతను ఎంత మెరుగైన ప్లేయరో మనమంతా చూశామని ఓపెన్‌గా సపోర్ట్ ప్రకటించాడు.
కెప్టెన్సీ రేసులో అయ్యర్:
31 ఏళ్ల శ్రేయస్ అయ్యర్ డిసెంబర్ 2023 నుంచి భారత టీ20 జట్టుకు దూరంగా ఉంటున్నారు. టీ20 వరల్డ్ కప్‌కు ముందు న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికైనా బెంచ్‌కే పరిమితమయ్యారు. కానీ, గత రెండు ఐపీఎల్ సీజన్లలో శ్రేయస్ తన ఆటతీరును పూర్తిగా మార్చేసుకున్నాడు. గతంలో 135 మాత్రమే ఉన్న అతని స్ట్రైక్ రేట్ (Strike Rate).. గతేడాది 178కి, ఈ సీజన్లో 162.31కి చేరింది. నెమ్మదిగా ఆడతాడనే ముద్రను చెరిపేస్తూ విధ్వంసకర బ్యాటింగ్‌తో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి కెప్టెన్సీ రేసులోకి దూసుకొచ్చారు.
►ALSO READ | Riyan Parag: నా పర్సనల్ విషయాలు మీకెందుకు.. కామెంటేటర్లపై రియాన్ పరాగ్ ఫైర్
పరిణతి చెందిన ప్లేయర్ శ్రేయస్:
ఐపీఎల్ 2026 సీజన్ ఫస్టాఫ్‌లో పంజాబ్ కింగ్స్‌ను పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిపిన శ్రేయస్.. సెకండాఫ్‌లో వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో పడ్డారు. ముంబైపై 4 పరుగులు, ఆర్‌సీబీతో జరిగిన 223 రన్స్ భారీ ఛేజింగ్‌లో కేవలం 1 రన్‌కే అవుట్ అవ్వడం అతని కెప్టెన్సీ, ఫామ్‌పై ప్రశ్నలు లేవనెత్తింది. కానీ ఈ అవుట్‌ఫామ్ విమర్శలపై పాంటింగ్ తన కెప్టెన్‌ను వెనకేసుకొస్తూ.. శ్రేయస్ ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత పరిణతి చెందిన ప్లేయర్ అని, 14 మ్యాచ్‌ల సుదీర్ఘ టోర్నమెంట్‌లో ఎప్పుడూ ఒకే స్థిరత్వం (Consistency) కొనసాగించడం ఎవరికైనా కష్టమని, లక్నోతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో అతను ఖచ్చితంగా భారీ స్కోరు చేస్తాడని పాంటింగ్ వెల్లడించాడు.
అయ్యర్‌ను పక్కన పెట్టడంపై పాంటింగ్ ఆశ్చర్యం:
గత రెండేళ్లుగా నేను చెబుతూనే ఉన్నా.. టీమిండియా సెలెక్షన్ కమిటీ శ్రేయస్‌ను జట్టులోకి తీసుకోకపోతే నేను చాలా ఆశ్చర్యపోతాను అని రిక్కీ పాంటింగ్ పేర్కొన్నారు. ఈ ఐపీఎల్ ప్రదర్శన తర్వాత సెలెక్టర్లు కేవలం అతని కమ్‌బ్యాక్ గురించే కాదు.. అతని పేరు పక్కన ‘కెప్టెన్’ (Captaincy) అనే ట్యాగ్ పెట్టడంపై కూడా ఖచ్చితంగా చర్చిస్తారు. అయ్యర్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నాడు, కెప్టెన్సీ వస్తే అద్భుతాలు చేస్తాడని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
