న్యూఢిల్లీ: రాపిడో, నమ్మయాత్రి వంటి సబ్‌స్క్రిప్షన్ ఆధారిత రైడ్- హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై సెక్షన్ 9(5) కింద జీఎస్టీ విధించడం వల్ల డ్రైవర్లపై, వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఎస్యా సెంటర్ స్టడీ రిపోర్ట్ హెచ్చరించింది. 13 నగరాల్లో 2,100 మంది డ్రైవర్లు, ప్రయాణికులపై జరిపిన సర్వే ఆధారంగా ఈ విషయాన్ని తెలియజేసింది.
సాఫ్ట్‌వేర్ -యాజ్- ఎ -సర్వీస్ (సాస్) మోడల్ కింద డ్రైవర్లు స్థిర సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లిస్తారు. చార్జీలు వాళ్లే నిర్ణయిస్తారు. కమీషన్ ఆధారిత కంపెనీల మాదిరి ఈ ప్లాట్‌ఫారాలు ధరలను నిర్ణయించవు. చెల్లింపులను ప్రాసెస్ చేయవు. జీఎస్టీ విధిస్తే టేక్-హోమ్ సంపాదన తగ్గుతుందని, బుకింగ్‌లు క్షీణిస్తాయని 80 శాతం మంది డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
చార్జీలు ఐదు శాతం పెరిగితే వాడకం తగ్గిస్తామని 68 శాతం మంది ప్రయాణికులు చెప్పారు. చార్జీలపై ప్లాట్‌ఫారమ్‌లకు నియంత్రణ ఉన్నప్పుడు మాత్రమే జీఎస్టీ వర్తింపజేయాలని ఎస్యా సిఫార్సు చేసింది.
