మనం తినే ఆహారాన్ని అనుసరించి మన ఆలోచనలు ఉంటాయని పెద్దలు చెబుతారు. పంట పండించే రైతు దగ్గర నుంచి అందరూ ధర్మమార్గాన ప్రవర్తిస్తేనే ఆ ఆహారం స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అరవై.. డెబ్బై సంవత్సరాల క్రితం రైతు స్వచ్చమైన ఎరువులు వేసి, మంచి మంచి పద్యాలు, పాటలు పాడుకుంటూ వ్యవసాయం చేసేవాడు. పవిత్రంగా పండిన ధాన్యం మన ఇళ్లకు చేరేది.
పోతన భాగవతం నుంచి పద్యాలను చదువుతూ వడ్లు దంచడం వల్ల, ఆ ధాన్యం స్వచ్ఛమైన బియ్యంగా మారేది. సంగీతం పాడుకుంటూనో, పద్యాలు వల్లె వేస్తూనో, స్తోత్రాలు చదువుతూనో వంట చేయటం వల్ల ఆ అన్నం ప్రసాదంగా పవిత్రంగా మనం భుజించేవాళ్లం. అందువల్ల అందరూ సత్యం పలుకుతూ, సత్కర్మలు ఆచరించేవారు.
ఇప్పుడు పంట పండటం దగ్గర నుంచి అన్నంగా రూపొంది, మన కంచంలోకి వచ్చేవరకూ అంతా కలుషితమే, అధర్మమే, అపవిత్రమే. తీసుకునే ఆహారాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుందనడానికి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే మనకు నిదర్శనం. దేవకీదేవి గర్భాన జన్మించి, యశోదమ్మ దగ్గర పెరిగాడు వాసుదేవుడు. యశోదమ్మ చిన్ని కృష్ణుడికి వెన్నముద్దలు, పెరుగు, మీగడలు తినిపిస్తూ, సత్పురుషుల కథలు చెబుతుండేది. స్వచ్ఛమైన మనస్సు గల యశోదమ్మ చేతి ఆహారం భుజించిన శ్రీకృష్ణుడు ధర్మ సంస్థాపన చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో న్యాయం వైపు నిలబడి పాండవులకు విజయం చేకూర్చాడు. ఇదంతా ఆ యశోదమ్మ తినిపించిన పవిత్రమైన ఆహార ఫలితమే.
ఇక పాండవుల విషయం పరిశీలిస్తే...
కుంతీదేవి తన ఐదుగురు కుమారులను దగ్గర కూర్చోబెట్టుకుని, మంచి మాటలు చెబుతూ అన్నం తినిపించేది. కలిసికట్టుగా కూర్చుని భోజనం చేయటం అలవాటు చేసింది. స్వచ్ఛమైన మనస్సుతో, పవిత్రమైన ఆహారాన్ని పాండవులకు తినిపించడం వల్లే.. ధర్మరాజు ధర్మానికి మారుపేరుగా నిలబడ్డాడు. అర్జున, భీమ, నకులసహదేవులు ధర్మ యుద్ధం సాగించారు.
కుంతీదేవికి ధర్మరాజు జన్మించాడని వినగానే గాంధారీదేవి అసూయతో గర్భతాడనం చేసింది. ఆ అసూయ నుంచి జన్మించిన కౌరవులు... బాల్యం నుంచి పాండవుల పట్ల అసూయతోనే ప్రవర్తించారు. ఏనాడూ కౌరవులకు మంచిని బోధిస్తూ, అన్నం తినిపించలేదు గాంధారి. ధృతరాష్ట్రుడు సైతం కౌరవాదుల ఆగడాలను అడ్డుకోలేదు. అందువల్లే కౌరవులకు దురాలోచనలు కలిగి, అధర్మ యుద్ధం చేసి, ఒక్కరు కూడా మిగలకుండా వందమంది సంతానం యుద్ధంలో నిహతులయ్యారు.
►ALSO READ | వారఫలాలు: డిసెంబర్ 7 నుంచి 13 వరకు.. నాలుగు రాశుల వారి అద్భుతం.. మిగతావారికి ఎలా ఉందంటే..!
ఆహారం నుంచే ఆలోచనలు వస్తాయనడానికి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి.కురుక్షేత్ర యుద్ధంలో శిఖండి కారణంగా అస్త్ర సన్యాసం చేసిన భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. ఆయన దగ్గర ధర్మసూక్ష్మాలు తెలుసుకోవాలనే సంకల్పంతో పాండవులు భీష్ముడి దగ్గరకు వచ్చారు. ఆయన వారికి ధర్మం వివరిస్తుండగా.. అక్కడే ఉన్న ద్రౌపది ఫక్కున నవ్వింది. ఆమె నవ్వుకు కారణం ఏమిటని భీష్ముడు ప్రశ్నించాడు.
అందుకు ద్రౌపది, ‘ఆచార్యా! అంపశయ్య మీద ఉన్న మీరు ఇంత చక్కగా ధర్మం బోధిస్తున్నారు కదా. మరి నిండు కొలువులో దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు ఈ ధర్మపరిజ్ఞానమంతా ఏమైపోయిందా అనే ఆలోచన రాగానే నాకు నవ్వు వచ్చింది’ అని పలికింది. అందుకు భీష్ముడు చిరునవ్వుతో, ‘తల్లీ! నీకు పరాభవం జరిగిన సమయంలో నేను.. దుర్యోధనుడు పెట్టిన మలినమైన అన్నం తింటున్నాను. అది నా రక్తంలో జీర్ణించుకుపోయింది. ఆ కారణంగా నేను నా వివేకాన్ని కోల్పోయాను. నా కర్తవ్యం నాకు గుర్తు రాలేదు. ఇప్పుడు అర్జునుడి బాణాలతో నా రక్తంలో చేరిన ఆ కాలుష్యమంతా పోయింది. కనుక ధర్మం మాట్లాడగలుగుతున్నాను’ అన్నాడు.
అంతే కాదు తల్లీ....ఈ రాజ్యం మీ మామగారైన పాండురాజుది. ఇది తమ తండ్రికే రావాలి అన్న దుష్ట బుద్దితో ఉన్నారు ధృతరాష్ట్రుని పిల్లలు. ధృతరాష్ట్రుడు కూడా నిరంతరం తన పిల్లలకే రాజ్యం రావాలని వారు చేసిన పనులను సమర్ధించాడు. పాండురాజు ధర్మ బద్ధంగా సంపాదించిన రాజ్యం ధృతరాష్ట్రుడు అతని పిల్లలు అధర్మముగా అనుభవించారు. అందుకే వారి బుద్ధి అలా వక్ర మార్గంలో పయనించింది" అన్నాడు.
మనం తినే ఆహారానికి అంత శక్తి ఉంటుంది. ధర్మబద్ధంగా సంపాదించుకున్న ఆహారం తినడం వల్ల ధర్మమైన ఆలోచలే వస్తాయనడానికి ఈ కథ మంచి ఉదాహరణగా కనిపిస్తుంది. అందుకే.. ధర్మమార్గాన స్వయంగా సంపాదించుకున్న సాత్వికమైన ఆహారం తీసుకోవడం వల్ల.. మన ఆత్మ, దేహం రెండూ ఆరోగ్యంగా ఉంటాయని శాస్త్రం చెబుతోంది.
డా. పురాణపండ వైజయంతి
