రిలయన్స్..డిస్కౌంట్లతో కిరాణా ధమాకా

రిలయన్స్..డిస్కౌంట్లతో కిరాణా ధమాకా

ముంబై : ముఖేష్‌‌ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌‌ రిటైల్‌‌ లిమిటెడ్‌‌ తన న్యూ కామర్స్‌‌ (ఆన్‌‌లైన్‌‌) వెంచర్‌‌ను దీపావళికి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా రిటైల్‌‌ స్టోర్స్‌‌ నిర్వహిస్తున్న రిలయన్స్‌‌ రిటైల్‌‌ లిమిటెడ్‌‌ ఈ వెంచర్‌‌ ద్వారా ఆన్‌‌లైన్‌‌లోనూ అడుగుపెట్టనుంది. తయారీదారులు, ట్రేడర్లు, చిన్న వ్యాపారులు, బ్రాండ్స్‌‌, కన్స్యూమర్లు …అందరినీ టెక్నాలజీ ద్వారా  ఒకే చోటికి తేవాలనేది రిలయన్స్‌‌ ఆలోచనగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ రిటైల్‌‌ విభాగమైన రిలయన్స్‌‌ రిటైల్‌‌ లిమిటెడ్‌‌ గత రెండేళ్లుగా ఈ న్యూ కామర్స్‌‌ ప్రాజెక్టు మీద పని చేస్తోంది. రిటైల్‌‌ స్టోర్స్‌‌, సూపర్‌‌ మార్కెట్లు, హైపర్‌‌ మార్కెట్లు, హోల్‌‌సేల్‌‌, స్పెషాలిటీ అండ్‌‌ ఆన్‌‌లైన్‌‌ స్టోర్స్‌‌ను రిలయన్స్‌‌ రిటైల్‌‌ లిమిటెడ్‌‌ ఇప్పటికే నిర్వహిస్తోంది.

జనవరి నుంచి పూర్తిస్థాయిలో

తన ఆన్‌‌లైన్‌‌ కామర్స్‌‌ వెంచర్‌‌ను రెండు దశలలో ప్రవేశపెట్టాలని రిలయన్స్‌‌ రిటైల్‌‌ లిమిటెడ్‌‌ భావిస్తోంది. దీపావళికి లాంఛనంగా ప్రారంభించి, ఆ తర్వాత డిసెంబర్‌‌–జనవరి నాటికి పూర్తి స్థాయికి కార్యకలాపాలు చేపట్టాలనేది ఈ కంపెనీ ప్రణాళిక. ఇతర ఆన్‌‌లైన్‌‌ రిటైలర్స్‌‌ లాగే ఈ కంపెనీ కూడా దీపావళికి ప్రత్యేక డిస్కౌంట్లు ఆఫర్‌‌ చేయొచ్చని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. రోజువారీ అధికంగా వాడే ఆహారోత్పత్తులు, సబ్బులు, షాంపూలు ఇతర హౌస్‌‌హోల్డ్‌‌ ఐటమ్స్‌‌పై ప్రధానంగా రిలయన్స్‌‌ రిటైల్‌‌ లిమిటెడ్‌‌  దృష్టి పెట్టనుంది. న్యూ కామర్స్‌‌ వెంచర్‌‌పై వివరాల కోసం రిలయన్స్‌‌ రిటైల్‌‌కి పంపిన ఈమెయిల్‌‌కు బదులు రాలేదు. ఆన్‌‌ టూ ఆఫ్‌‌లైన్‌‌ (ఓ2ఓ) మార్కెట్‌‌ ప్లేస్‌‌ ఆఫర్‌‌ చేస్తానంటూ, లోకల్‌‌ మర్చంట్స్‌‌తో ఈ కంపెనీ ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. చైనా ఈ–కామర్స్‌‌ దిగ్గజం అలీబాబా గ్రూప్‌‌ ఇదే బిజినెస్‌‌ మోడల్‌‌ను అనుసరిస్తోంది. ఒక ప్రొడక్ట్‌‌ లేదా సర్వీస్‌‌ కోసం కన్స్యూమర్‌‌ ఆన్‌‌లైన్‌‌లో వెతుక్కుని, కొనడం మాత్రం ఆఫ్‌‌లైన్లో చేస్తారు. దీంతో మర్చంట్లందరినీ కన్సాలిడేట్‌‌ చేయడం కంపెనీకి వీలవుతుంది. ఫలితంగా లోకల్‌‌ డిమాండ్‌‌కు మర్చంట్లు స్పందించగలుగుతారు. అలా చేయడం వల్ల రిలయన్స్‌‌ రిటైల్‌‌కు ఖర్చు తగ్గడమే కాకుండా, ఇతర ఆన్‌‌లైన్‌‌ రిటైలర్లు ఇప్పటిదాకా ప్రవేశించని వాటిలోనూ అడుగుపెట్టడం రిలయన్స్‌‌ రిటైల్‌‌కు సాధ్యపడుతుంది.

కిరాణాలే కీలకం..

కన్స్యూమర్‌‌కు వస్తువులు అందచేయడానికి కిరాణా షాపులను రిలయన్స్‌‌ వాడుకోనుంది.  ఈ సప్లై చెయిన్‌‌లో కిరాణా షాపులూ భాగమవుతాయి. రిలయన్స్‌‌ రిటైల్‌‌ పూర్తి దేశీయ సంస్థ కావడంతో ఎఫ్‌‌డీఐ నిబంధనలు వర్తించవు. ఇన్వెంటరీ కూడా అట్టే పెట్టుకోవచ్చు. దేశంలోని 3 కోట్ల కిరాణా షాపులను ఒక గొడుగు కిందకు తేవాలనేది లక్ష్యమని  ఇటీవలి ఏజీఎంలో అంబానీ వెల్లడించారు. మార్కెట్‌‌ను టెస్ట్‌‌ చేసేందుకు, డిస్కౌంట్‌‌ ఆఫర్లను కస్టమర్లకు మెసేజ్‌‌ల రూపంలో పంపాలని కంపెనీ భావిస్తోంది. ఎవరు ఎక్కడ ఉంటున్నారు ? ఏం కొంటున్నారనేది తెలుసుకోవడానికి ఈ ప్లాన్‌‌ ఉపయోగపడుతుందని కంపెనీ ఆలోచన. ఈ–కామర్స్‌‌ పైలట్‌‌ను జియో స్టోర్స్‌‌ ద్వారా కంపెనీ చేపట్టింది. కస్టమర్ల నుంచి జియో స్టోర్స్‌‌ స్టాఫ్‌‌ ఆర్డరు తీసుకుంటారు. ఆ తర్వాత కస్టమరు జియో స్టోర్‌‌కు వచ్చి తను ఆర్డరు చేసిన వస్తువులను తీసుకుంటారు. ప్రైవేట్‌‌ లేబుల్ బ్రాండ్స్‌‌ అమ్మేందుకు డిస్ట్రిబ్యూటర్లనూ ఆర్‌‌ఐఎల్‌‌ ఏర్పాటు చేసుకుంటోంది. లాజిస్టిక్స్‌‌ ఖర్చు గణనీయంగా తగ్గించుకోడానికి కిరాణా షాపులతో కలిసి పనిచేయడం కలిసొస్తుంది. కిరాణా షాపులను కంపెనీ పోటీదారులుగా భావించడం లేదు. వారిని బిజినెస్‌‌ అసోసియేట్స్‌‌గా చేర్చుకుంటోంది. పది నిముషాలలో  సరుకులు కావాలంటే,  అందించగలిగేది పక్కనుండే కిరాణా షాపే. రిలయన్స్‌‌ రిటైల్‌‌ సరిగ్గా అదే చేద్దామనుకుంటోందని పరిశ్రమ వర్గాలు వివరించాయి.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి