న్యూఢిల్లీ: ఆయిల్ రిఫైనింగ్ నుంచి అతిపెద్ద టెలికం నెట్‌వర్క్‌గా ఎదిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ జర్నీ ఇక్కడితో ఆగిపోదని, మరింత విస్తరిస్తుందని కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే టాప్ 10 గ్రూప్‌లలో ఒకటిగా ఎదుగుతామని చెప్పారు. ధీరూభాయ్ అంబానీ పుట్టిన రోజు సందర్భంగా రిలయన్స్ ఫ్యామిలీ డే జరుపుకున్న ఆయన, ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. డిజిటల్ డేటా ప్లాట్‌ఫామ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( ఏఐ) వాడకంలో ప్రపంచలోనే టాప్ కంపెనీల్లో ఒకటిగా మారేందుకు రిలయన్స్ ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ‘లోకల్‌గా, గ్లోబల్‌గా వ్యాపార పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇక్కడితో ఆగిపోవడానికి వీల్లేదు’ అని ముకేశ్ అంబానీ అన్నారు. రిలయన్స్ గతంలో ఎప్పుడూ కూడా తన జర్నీ ఆపేయలేదని, ఫ్యూచర్‌లో కూడా ఆపేయదని వివరించారు. ఇన్నోవేషన్‌తో మార్కెట్‌లో విస్తరిస్తామని చెప్పారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదట చిన్న టెక్స్‌టైల్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌తో తన జర్నీ స్టార్ట్ చేసింది. టెక్స్‌టైల్స్ కోసం రామెటీరియల్స్ అందించేందుకు పెట్రోల్ కెమికల్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ కంపెనీగా మారింది. ఒకేచోట అతిపెద్ద ఆయిల్ రిఫైనింగ్ కాంప్లెక్స్ ఉన్న కంపెనీగా ఎదిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2005 లో రిటైల్ సెక్టార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం గ్రోసరీ స్టోర్లు, హైపర్‌మార్కెట్లు, ఆన్‌లైన్ రిటైల్‌ను నడుపుతున్న కంపెనీగా విస్తరించింది. 2016 లో టెలికం సెక్టార్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఈ ఇండస్ట్రీ రూపురేఖలు మార్చేసింది. ప్రస్తుతం రిలయన్స్ జియో దేశంలోనే అతిపెద్ద టెలికం నెట్‌వర్క్‌గా, ప్రపంచంలో మూడో అతిపెద్ద నెట్‌వర్క్‌గా మారింది.
ఫ్యూచర్..
రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రీన్ ఎనర్జీ కోసం గిగా ఫ్యాక్టరీ కడుతోంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్‌పై ఫోకస్ పెట్టింది. గొప్ప లక్ష్యాలను పెట్టుకున్నామని, ఈ లక్ష్యాలను మించి సాధించామని అంబానీ అన్నారు. ఈ విధంగానే రిలయన్స్ వృద్ధి చెందిందని పేర్కొన్నారు. ‘దేశ ఎకానమీ ప్రస్తుతం ఉన్న ఐదో ప్లేస్ నుంచి మూడో ప్లేస్‌కు ఎదుగుతోంది. రిలయన్స్ కోసం బోలెడు అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. ప్రపంచంలోని టాప్ 10 గ్రూప్‌లలో ఒకటిగా రిలయన్స్ ఎదగగలదు’ అని ముకేశ్ అంబానీ వివరించారు. కాగా, మార్కెట్ క్యాప్, ప్రాఫిట్స్, రెవెన్యూ పరంగా చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలో టాప్ కంపెనీగా కొనసాగుతోంది. ఫ్యూచర్ గోల్స్‌ను చేరుకోవడానికి ఉద్యోగులు జాగ్రత్తగా పని చేయాలని, కస్టమర్లకు గొప్ప సర్వీస్‌లు అందించాలని ఉద్యోగులకు అంబానీ సూచించారు. ఇప్పటి వరకు ఎవరూ క్రియేట్ చేయని, అందించని సర్వీస్‌లను తీసుకొద్దామని పేర్కొన్నారు. అదే టైమ్‌లో కస్టమర్ల నమ్మకం పొందడంపై ఫోకస్ పెట్టాలన్నారు. పోటీతత్వంతో ముందుకెళ్లాలని అన్నారు. ‘మన బిజినెస్‌లన్ని వృద్ధి చెందితే దేశ వృద్ధికి తోడ్పాటు అందించగలుగుతాం’ అని వెల్లడించారు.
మూడు మెసేజ్‌లు..
న్యూ ఇయర్ కోసం అంబానీ మూడు మెసేజ్‌లు ఇచ్చారు. అవి డిజిటల్ డేటా ప్లాట్‌ఫామ్స్, ఏఐ వాడకంలో ముందుండడం, ట్యాలెంట్ ఉన్న ఉద్యోగులను ఆకర్షించడంలో గ్లోబల్ లీడర్లతో పోటీ పడడం, ఇన్‌స్టిట్యూషనల్ కల్చర్‌లో గ్లోబల్ లీడర్ల సరసన ప్లేస్ సంపాదించడం. న్యూ ఏజ్ టెక్ కంపెనీగా మారాలని చూస్తున్నామని, నిర్ణయాలను వేగంగా తీసుకోవడానికి, రిసోర్స్‌లను సక్రమంగా వాడుకోవడానికి డేటా, ఏఐ టెక్‌లను ఎంచుకోవాల్సిన టైమ్ వచ్చిందని అంబానీ అన్నారు. వచ్చే ఏడాది నాటికి రిలయన్స్ డిజిటల్ సర్వీస్‌లు, గ్రీన్ అండ్ బయో ఎనర్జీ, రిటైల్ అండ్ కన్జూమర్ బ్రాండ్స్, ఆయిల్ టూ కెమికల్స్, మెటీరియల్స్, హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్ బిజినెస్‌లు ఈ టెక్నాలజీలను వాడడం పెంచుతాయన్నారు. చేసిన తప్పులను చూసి బాధపడొద్దని, కానీ ఇలాంటి తప్పులు మళ్లీ చేయకూడదని ఉద్యోగులకు సలహా ఇచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ ఆకాశ్, ఇషా, అనంత్, వారి జనరేషన్‌కు చెందినది చెప్పారు.
