అమలాపురం రణరంగం

అమలాపురం రణరంగం
  • ఏపీ మంత్రి, ఎమ్మెల్యే ఇండ్లకు నిప్పు.. వాహనాలు ధ్వంస్యం
  • పోలీసులపైనా తిరగబడిన ఆందోళనకారులు.. రాళ్ల దాడి.. 20 మందికి గాయాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లోని అమలాపురం పట్టణం రణరంగంగా మారింది. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్పు చేస్తూ ఇటీవల రెవెన్యూ శాఖ ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాలని కలెక్టర్‌‌ను ఆదేశించింది.  దీంతో కోనసీమ జిల్లాను కొనసాగించాలని యువత, జేఏసీ నేతలు ఆందోళనలు చేపట్టారు. అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు. దీంతో అమలాపురంలోని కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇది ఉద్రిక్తంగా మారింది. ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. అయితే పోలీసులను తప్పించుకుని కలెక్టరేట్ ముట్టడించేందుకు భారీగా ఆందోళనకారులు అమలాపురం చేరుకున్నారు. చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తిరగబడ్డారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్పీ గన్ మన్, 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి.

మంత్రి ఇంటికి నిప్పు
ఈ క్రమంలో ఆందోళనలు అదుపుతప్పాయి. మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటికి నిరసనకారులు నిప్పుపెట్టారు. మంత్రి కుటుంబ సభ్యులను పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మంత్రి విశ్వరూప్ ఇంటి సమీపంలో మూడు ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. మరోవైపు ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌‌ ఇంటిని కూడా ఆందోళనకారులు దహనం చేశారు. ఈ ఘటనలతో అధికార పార్టీ నేతల ఇళ్లను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. అమలాపురంలో విద్యుత్‌‌ సరఫరా నిలిపివేశారు. అటు అమలాపురం చేరుకున్న ఏలూరు రేంజ్‌‌ డీఐజీ పాలరాజు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హింసాత్మక సంఘటనలకు  పాల్పడ్డ వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ పాలరాజు చెప్పారు. ఎవరు కూడా హింసకు పాల్పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. వీడియో ఫుటేజ్  ల ద్వారా ఆందోళనకారులను గుర్తిస్తామని, అమలాపురంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని చెప్పారు. 

అల్లర్లు సృష్టించిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం: వనిత
స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు, పార్టీల డిమాండ్ మేరకే కోనసీమ జిల్లా పేరు మార్చామని ఏపీ హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అందుకున్న మహానుభావుని పేరును వ్యతిరేకించడం బాధాకరమన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని, గొడవలు చేసే వారి వెనుక ఉండి నడిపించే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయన్నారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని, శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలని జనసేన అధినేత పవన్​ కల్యాణ్ కోరారు. అంబేద్కర్​ పేరు వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమని, ఆ మహనీయుని పేరుని వివాదాల్లోకి తీసుకువచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్​ చేశారు. పాలక వర్గం తప్పులను, లోపాలను కప్పిపుచ్చుకోవడానికి లేని సమస్యలు సృష్టిస్తోందని ఆరోపించారు.