రిష ఒక ఫుడ్ సైన్స్ ఇన్నొవేటర్​

రిష ఒక ఫుడ్ సైన్స్ ఇన్నొవేటర్​

పండ్ల తొక్కలు, కూరగాయ ముక్కల్ని చెత్తడబ్బాలో పడేస్తారు చాలామంది. అయితే వీటితో నీళ్లని శుభ్రం చేయొచ్చు అంటోంది ఈమె.  అందుకోసం వాటిని  ‘గ్రీన్ ఫిల్టర్స్​’గా మార్చింది. వీటి సాయంతో  మంచి నీళ్లలో ఉన్న హెవీ మెటల్స్​ని తొలగిస్తోంది రిష జాస్మిన్​ నాథన్​.  ఈ  ఇన్నొవేషన్​తో గ్యాస్ట్రోనమీలో గేమ్​ ఛేంజర్​ ‘50 నెక్స్ట్  క్లాస్​ ఆఫ్​ 2022’ లిస్ట్​లో ఒకరిగా నిలిచింది. రిష ఒక ఫుడ్ సైన్స్ ఇన్నొవేటర్​. 

ఉత్తరప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో పుట్టి పెరిగింది రిష. అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన వాళ్ల అమ్మ రిషను డాక్టర్​గా చూడాలనుకుంది. దాంతో మెడిసిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్​ రాసింది. కానీ సక్సెస్​ కాలేదు . దాంతో డిగ్రీలో కెమిస్ట్రీ ఆనర్స్ చేసింది. ఆ టైంలోనే  అమెరికన్ డాక్యుమెంటరీ టీవీ ప్రోగ్రాం ‘ఫోరెన్సిక్ ఫైల్స్​’ తెగ చూసేది. ఆ ప్రోగ్రాం ప్రభావంతో ఫోరెన్సిక్​ ఎక్స్​పర్ట్ కావాలనుకుంది. కానీ ఫుడ్ వేస్టేజీ గురించి, ఆరోగ్యాన్ని దెబ్బతీసే హెవీ మెటల్స్​ గురించి చదివాక... ఈ సమస్యకు సొల్యూషన్​ చూపించాలనుకుంది రిష.   

ఆలోచన వచ్చిందిలా

ఢిల్లీలోని నేషనల్​ ఇనిస్టిట్యూట్ ఆఫ్​ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్​ సైన్స్​లో మాస్టర్స్​ చదివింది రిష. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్​లో అసిస్టెంట్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్​గా చేరింది. అక్కడ పనిచేస్తున్న టైంలో  ‘బయోసార్​ప్షన్​’ టెక్నిక్ గురించి విన్నది. నీళ్లలోని ఆర్సెనిక్, కాడ్మియం, కాపర్, మెర్క్యురీ, లెడ్, నికెల్, క్రోమియం వంటి  హెవీ మెటల్స్​ని తొలగించేందుకు సైంటిస్ట్​లు అరటిపండు తొక్కలు, అగ్రికల్చర్​  వేస్ట్​ వాడుతున్నారని తెలుసుకుంది. అప్పుడే  పండ్లు, కూరగాయ తొక్కల్ని ‘గ్రీన్ ఫిల్టర్స్’గా వాడొచ్చనే ఆలోచన వచ్చింది రిషకు. ఆ ఆలోచనే ఆమెని  తక్కువ ఖర్చుతో నీళ్లలోని హెవీ మెటల్స్​ని తొలగించే ఇన్నొవేషన్​ వైపు నడిపించింది.

ఎలా క్లీన్​ చేస్తాయంటే..

రీసెర్చ్​లో భాగంగా... యాపిల్, అరటిపండు, ఆరెంజ్, కీర దోస, కివి పండ్ల తొక్కల్ని, ఆలుగడ్డ పొట్టుని సేకరించి వాటిని ఎండబెట్టి మెత్తగా పొడి చేసింది రిష. ఆ పొడికి సోడియం, కాల్షియం ఆక్జాలేట్​ వంటి కెమికల్స్​ కలిపి పూసల్లాగ చిన్న ముద్దలు (గ్రీన్ ఫిల్టర్స్​) చేసింది. ఈ గ్రీన్​ ఫిల్టర్స్​ని  హెవీ మెటల్స్ ఉన్న  నీళ్లలో వేయాలి.  వీటిలోని కార్బాక్సిల్, హైడ్రాక్సిల్ అనే నెగెటివ్​ అయాన్స్​ హెవీ మెటల్స్​లోని పాజిటివ్ అయాన్స్​తో కలుస్తాయి. దాంతో హెవీ మెటల్స్ తగ్గిపోయి, నీళ్లు శుభ్రమవుతాయి. పైగా ఇందుకు  ఖర్చు కూడా తక్కువే. 

ఆరు రీసెర్చ్​ పేపర్స్​

 ‘పండ్లు, కూరగాయల తొక్కల్ని చిన్న పూసల్లాగ చేసి మంచి నీళ్లలోని హెవీమెటల్స్​ని తొలగించడం’ అనే అంశం మీద పీహెచ్​డి చేసింది రిష. మూడున్నర ఏండ్లలో ఆరు రీసెర్చ్​ పేపర్స్​ పబ్లిష్​ చేసింది.  తక్కువ ఖర్చుతోనే నీళ్లలోని హెవీ మెటల్స్​ని తొలగించే ఎక్స్​పరిమెంట్​​బాగుందంటూ మెచ్చుకున్నారు సైంటిస్ట్​లు. అంతేకాదు  ప్రపంచవ్యాప్తంగా  ఫుడ్, డ్రింక్స్ వేస్టేజ్​ తగ్గించడానికి  సస్టైనబుల్​ సొల్యూషన్​ చూపిస్తున్న యాభై మంది ఉత్తమ సైంటిస్టుల్లో ఒకరిగా నిలిచింది రిష. ప్రస్తుతం లండన్​లోని  యాంగ్లియా రస్కిన్​ యూనివర్సిటీలో ఫోరెన్సిక్ కెమిస్ట్రీ లెక్చరర్​గా పనిచేస్తోంది.

‘‘మనదేశంలో ప్రతిరోజు 40 శాతానికి పైగా ఫుడ్​ వేస్టేజ్​ జమ అవుతోంది. ఇందులో పండ్లు, కూరగాయ తొక్కలు 12 నుంచి 21 మిలియన్ టన్నుల వరకు  ఉంటాయని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్​ చెప్పింది.  దాంతో ఫుడ్​ వేస్టేజ్​, హెవీ మెటల్స్​ వల్ల జరిగే నీటి కాలుష్యానికి సొల్యూషన్​ చూపించాలనుకున్నా. అందుకని టాక్సికాలజీలో పీహెచ్​డి చేశాను.  పండ్ల తొక్కలతో చేసిన ‘గ్రీన్​ ఫిల్టర్స్​’ తో హెవీ మెటల్స్​ని తొలగించి అందరికీ స్వచ్ఛమైన నీళ్లు అందించాలన్నదే నా లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లోని వాళ్లకు ఈ ‘గ్రీన్​ ఫిల్టర్స్​’ బాగా ఉపయోగపడతాయి” అంటోంది రిష.