NZ vs ENG: కంబ్యాక్ అంత ఈజీ కాదు: కోహ్లీ బాటలోనే కేన్ మామ.. 9 ఏళ్ళ తర్వాత వన్డేల్లో విలియంసన్ డకౌట్

NZ vs ENG: కంబ్యాక్ అంత ఈజీ కాదు: కోహ్లీ బాటలోనే కేన్ మామ.. 9 ఏళ్ళ తర్వాత వన్డేల్లో విలియంసన్ డకౌట్

అంతర్జాతీయ క్రికెట్ లో విరామం తర్వాత తొలి మ్యాచ్ లోనే రాణించడం ఈజీ కాదని మరోసారి రుజువైంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో కోహ్లీ, రోహిత్ ఏడు నెలల తర్వాత తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడితే ఇద్దరూ విఫలమయ్యారు. రోహిత్ సింగిల్ డిజిట్ కే పరిమితం కాగా.. కోహ్లీ డకౌటయ్యాడు. ఇప్పుడు వీరిద్దరి దారినే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియంసన్ అనుసరించాడు. సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన విలియంసన్ కు నిరాశే మిగిలింది. ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో రీ ఎంట్రీ ఇచ్చిన కేన్ తన తొలి మ్యాచ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు.  

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత తొలి వన్డే ఆడిన ఈ కివీస్ దిగ్గజ క్రికెటర్ తొలి బంతికే బ్రైడాన్ కార్స్ బౌలింగ్ లో గోల్డెన్ డక్‌ ఔటయ్యాడు. కార్స్ వేసిన ఎక్స్ ట్రా బౌన్స్ ఆడే క్రమంలో విలియంసన్ బ్యాట్ అంచుకు బ్యాట్ తగిలి వికెట్ కీపర్ చేతుల్లో పడింది. చివరిసారిగా 2016లో వన్డే క్రికెట్ లో ఆస్ట్రేలియాపై డకౌటైన ఈ కివీస్ స్టార్ 9 సంవత్సరాల తర్వాత పరుగుల ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇండియాపై ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడిన కేన్.. 7 నెలల తర్వాత ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. 

సెంట్రల్ కాంట్రాక్ట్ వద్దనుకున్న విలియంసన్:
 
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ కేన్ వద్దనుకున్నారు. ఒకవేళ ఈ కాంట్రాక్ట్ లిస్ట్ లో ఉంటే జాతీయ జట్టు తరపున రెగ్యులర్ ప్లేయర్ గా ఆడాల్సి ఉంటుంది. విలియంసన్ మాత్రం అంతర్జాతీయ టీ20 క్రికెట్ లీగ్ లు ఆడాలనే తన కోరికను తెలిపాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ లో లేకపోయినా ప్రధాన టోర్నీలకు అందుబాటులో ఉంటానని గతంలోనే కేన్ స్పష్టం చేశాడు. విలియంసన్ టీ20 వరల్డ్ కప్ 2026 ఆడతాని ప్రకటించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పని భారాన్ని దృష్టిలో ఉంచుకొని రానున్న ఐసీసీ టోర్నీలో ఫిట్ గా ఉండేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఈ కివీస్ దిగ్గజం చెప్పినా ద్వైపాక్షిక సిరీస్ పై ఆసక్తి చూపించడం లేదు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌లో న్యూజిలాండ్‌‌ బోణీ చేసింది. లక్ష్య ఛేదనలో డారిల్‌‌ మిచెల్‌‌ (78 నాటౌట్‌‌), మైకేల్‌‌ బ్రాస్‌‌వెల్‌‌ (51) హాఫ్‌‌ సెంచరీలతో రాణించడంతో.. ఆదివారం జరిగిన తొలి వన్డేలో కివీస్‌‌ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌‌ను ఓడించింది. ఫలితంగా సిరీస్‌‌లో 1–0 లీడ్‌‌లో నిలిచింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ఇంగ్లండ్‌‌ 35.2 ఓవర్లలో 223 రన్స్‌‌కు ఆలౌటైంది. కెప్టెన్‌‌ హ్యారీ బ్రూక్‌‌ (101 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 135) సెంచరీతో చెలరేగినా మిగతా బ్యాటర్ల నుంచి సహకారం దక్కలేదు.

జెమీ స్మిత్‌‌ (0), బెన్‌‌ డకెట్‌‌ (2), జో రూట్‌‌ (2), జాకబ్‌‌ బెథెల్‌‌ (2), బట్లర్‌‌ (4), సామ్‌‌ కరన్‌‌ (6) సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితమయ్యారు. బ్రూక్‌‌, జెమీ ఓవర్టన్‌‌ (46) ఏడో వికెట్‌‌కు 87 రన్స్‌‌ జోడించారు. ఛేజింగ్‌‌లో కివీస్‌‌ 36.4 ఓవర్లలో 224/6 స్కోరు చేసి నెగ్గింది. విల్‌‌ యంగ్‌‌ (5), రచిన్‌‌ రవీంద్ర (17), కేన్‌‌ విలియమ్సన్‌‌ (0) ఫెయిలయ్యారు. టామ్‌‌ లాథమ్‌‌ (24), మిచెల్‌‌ శాంట్నర్‌‌ (27) పర్వలేదనిపించారు. బ్రైడన్‌‌ కార్సీ 3 వికెట్లు తీశాడు. బ్రూక్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే బుధవారం హామిల్టన్‌‌లో జరుగుతుంది.