ఒక్కసారైనా అమెరికా వెళ్లి జాబ్ చేసి రావాలి. కనీసం రెండేళ్లు అక్కడ జాబ్ చేస్తే ఉన్న అప్పులు పోతాయి.. బాగా సంపాదించవచ్చు.. ఇవి అమెరికాపై ఇండియన్స్ కలలు. తమ కలలు నిజం చేసుకునేందుకు అప్పులు చేసి మరీ యూఎస్ చేరుకుంటున్నారు. అలాగే గంపెడాశలతో అమెరికా చేరిన 54 మందిని భారత్ కు పంపించారు యూఎస్ అధికారులు. అక్రమ వలసదారులుగా సొంత ఖర్చులతో ఇండియాకు పంపించింది యూఎస్.
మొత్తం54 మంది భారత యువకులు ఆదివారం (అక్టోబర్ 26) ఢిల్లీలోని ఇదిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. వీరంతా అడ్డదారిలో.. డంకీ రూట్లో అమెరికాలోకి ఎంటరైనట్లు గుర్తించిన యూఎస్.. తిరిగి వెనకకు పంపించింది.
ఇండియా చేరుకున్న వీరంతా హర్యానా రాష్ట్రానికి చెందిన వారు కావడం గమనార్హం. అందులో 16 మంది కర్నాల్ కు చెందిన వారు ఉండగా.. 15 మంది కైతాల్, అంబాలా-5, యమునానగర్-4, కురుక్షేత్ర-4, జింద్-3, సోనిపేట్-2, పంచ్ కులా, పానిపట్, రోహతక్, ఫతేహబాద్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వీళ్లంతా 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నారని.. వారిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
►ALSO READ | డీప్‌ఫేక్ ఫోటోలకి మరో యువకుడి బలి.. ఫోన్ హ్యాక్ చేసి ఫోటోలు, వీడియో మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్..
ఇంత మందిని అమెరికా తిరిగి పంపించగా.. ఏ ఒక్కరు కూడా తమ ఏజెంట్లపై ఫిర్యాదు చేయలేదని కర్నాల్ డీఎస్పీ సందీప్ కుమార్ చెప్పారు.
ఇప్పటికే వందలాది మంది ఇండియన్స్ ను అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారుల కింద తిరిగి పంపించిన విషయం తెలిసిందే. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్న అక్రమ వలసదారులను తిరిగి వారి దేశాలకు పంపే కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా వీసా పూర్తైనవారిని, నిబంధనలకు విరుద్ధంగా వచ్చిన వారిని, అక్రమ వలసదారులను తిరిగి పంపిస్తున్నారు.
