
కన్నడలో ఓ ప్రాంతీయ చిత్రంగా వచ్చిన ‘కాంతార’ మౌత్ టాక్‌తో పాన్ ఇండియా వైడ్‌గా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. దీనికి ప్రీక్వెల్‌గా ‘కాంతార ఛాప్టర్ 1’ (కాంతార 2) తెరకెక్కుతోంది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాడు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. సోమవారం ఈ చిత్రం పూర్తయిన విషయాన్ని తెలియజేస్తూ ‘కాంతార జర్నీ’ పేరుతో మేకింగ్ వీడియోను విడుదల చేశారు. దట్టమైన అడవిలోని వాటర్ ఫాల్స్ సమీపంలో భారీ సెట్స్ వేసి వేలమంది జనంతో ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కించారనేది ఇందులో చూపించారు.
మన ఊరు, మన జనం, మన నమ్మకాలతో కూడిన మన మట్టి కథను ప్రపంచానికి చెప్పాలనేది తన కల అని, ప్రతిరోజు సెట్‌లో వేలమందిని చూస్తున్నప్పుడు ఇది కేవలం సినిమా కాదు.. ఇదొక శక్తి అనిపించేదని రిషబ్ శెట్టి ఈ చిత్రం గురించి చెప్పారు. అరవింద్ ఎస్ కశ్యప్ డీవోపీగా, అజనీష్ లోకనాథ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 5న ఆరు భాషల్లో సినిమా విడుదల కానుంది.