Rishab Shetty: విజయ్ ర్యాలీ విషాదంతో రిషబ్ శెట్టి అలర్ట్.. 'కాంతార చాప్టర్ 1' ఈవెంట్‌ క్యాన్సిల్!

Rishab Shetty: విజయ్ ర్యాలీ విషాదంతో రిషబ్ శెట్టి అలర్ట్..  'కాంతార చాప్టర్ 1' ఈవెంట్‌ క్యాన్సిల్!

తమిళనాడులోని కరూర్ లో ఇటీవల తమిళగ వెట్రి కజగం అధినేత, నటుడు విజయ్ ర్యాలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  ఆ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించి, 60 మందికి పైగా గాయపడ్డారు.  ఈ విషాదం కారణంగా 'కాంతార చాప్టర్ 1' చిత్ర నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకుంది.  సెప్టెంబర్ 30న చెన్నైలో జరగాల్సిన తమ ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది.

హోంబలే ఫిల్మ్స్ ప్రకటన

'కాంతార చాప్టర్ 1' నిర్మాత సంస్థ హోంబలే ఫిల్మ్స్ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషాద ఘటన పట్ల వారు గాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. "ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటన దృష్ట్యా, మేము చెన్నైలో జరగాల్సిన 'కాంతార చాప్టర్ 1' ప్రమోషనల్ ఈవెంట్‌ను రద్దు చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ సమయంలో ప్రభావితమైన కుటుంబాలకు సంఘీభావం తెలపడం , ఆత్మ పరిశీలన చేసుకోవడం ముఖ్యమని మేము భావిస్తున్నాము. మా ప్రగాఢ సంతాపాన్ని ,  నివాళులను ఆ కుటుంబాలకు తెలియజేస్తున్నాము. మీ మద్దతుకు మేము కృతజ్ఞులం. సరైన సమయంలో మా తమిళనాడు ప్రేక్షకులను కలుసుకోవాలని ఎదురుచూస్తున్నాము అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

విజయ్ ర్యాలీలో జరిగింది ఏమిటి?

నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ ఇటీవల కరూర్‌లో నిర్వహించిన తమిళగ వెట్రి కజగం ప్రచార ర్యాలీలో వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. విజయ్‌ను చూడాలన్న ఆత్రుతతో అభిమానులు బారికేడ్ల వైపు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ విషాదంలో పిల్లలు, మహిళలు సహా 41 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై విజయ్ ఆదివారం తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ. 2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు.

 

'కాంతార చాప్టర్ 1' అప్‌డేట్స్

2022లో సంచలనం సృష్టించిన 'కాంతార' చిత్రానికి ప్రీక్వెల్‌గా 'కాంతార చాప్టర్ 1' రాబోతోంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్, చలువే గౌడలు హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. తొలి చిత్రంలో పరిచయం చేసిన పౌరాణిక సంప్రదాయాలు , వంశపారంపర్య సంఘర్షణల మూలాలను ఈ చిత్రం మరింత లోతుగా అన్వేషిస్తుంది. 'కాంతార చాప్టర్ 1' దసరా సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.