IND vs WI: వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు పంత్ ఔట్.. టీమిండియా వైస్ కెప్టెన్‌గా రాహుల్

IND vs WI: వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు పంత్ ఔట్.. టీమిండియా వైస్ కెప్టెన్‌గా రాహుల్

స్వదేశంలో వెస్టిండీస్ తో జరగనున్న రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ దూరం కానున్నాడు. పంత్ టెస్ట్ సిరీస్ కు అందుబాటులో లేకపోవడం ఖాయంగా మారింది. త్వరలోనే బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఆసియా కప్ కు ముందు ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు ఆడుతూ పంత్ గాయపడ్డాడు. ఎడమ పాదం ఫ్రాక్చర్ అవ్వడంతో గాయం నుంచి ఇంకా ఈ టీమిండియా వికెట్ కీపర్ ఇంకా  కోలుకోలేదు. 

పంత్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నాడు. టెస్ట్ సిరీస్ సమయానికి పంత్ కోలుకుంటాడని భావించినా దురదృష్టవశాత్తు అది జరగలేదు. సెప్టెంబర్ 23 లేదా 24 న విండీస్ తో టెస్ట్ సిరీస్ కు భారత జట్టును ప్రకటించనున్నారు. ఒకవేళ పంత్ టెస్ట్ సిరీస్ కు దూరమైతే భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్‌ బ్యాటర్ గా ఆడతాడు. ఇటీవలే సూపర్ ఫామ్ లో ఉన్న ఎన్ జగదీశన్ బ్యాకప్ వికెట్ కీపర్ గా ఎపికయ్యే అవకాశముంది. ఇంగ్లాండ్ తో ఐదో టెస్టులో పంత్ స్థానంలో జగదీశన్ ఎంపికయ్యాడు. మరోసారి కూడా ఈ తమిళ నాడు వికెట్ కీపర్.. జురెల్ కు బ్యాకప్ గా ఎంపిక కానున్నట్టు తెలుస్తోంది. 

పంత్ అందుబాటులో లేకపోవడంతో సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కు వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించవచ్చు. గిల్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా అక్టోబర్ 2 నుంచి 6 వరకు తొలి టెస్ట్ మ్యాచ్.. అక్టోబర్ 10 నుంచి 14 వరకు రెండో టెస్ట్ జరుగుతుంది. తొలి టెస్టుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిధ్యమిస్తుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రెండో టెస్ట్ జరుగుతుంది. మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 9:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది.  రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం ఇప్పటికే వెస్టిండీస్ స్క్వాడ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా ఆసియా కప్ ఆడుతూ బిజీగా ఉంది.  

టీమిండియాతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు వెస్టిండీస్ జట్టు: 

రోస్టన్ చేజ్ (కెప్టెన్), జోమెల్ వారికన్ (వైస్-కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, అలిక్ అథనాజ్, జాన్ కాంప్‌బెల్, టాగెనరైన్ చంద్రపాల్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారి జోసెఫ్, షామర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఆండర్సన్ ఫిలిప్, ఖారీ పియరీ మరియు జేడెన్ సీల్స్.