- బీజేపీ నేతను ఎంపిక చేసిన మహాయుతి కూటమి
- డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శివసేన కార్పొరేటర్ సంజయ్ శంకర్ ఘాడి
- 25 ఏండ్ల తర్వాత శివసేన చేజారిన మేయర్ పదవి
ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్అభ్యర్థిగా మహాయుతి కూటమి నుంచి బీజేపీ కార్పొరేటర్ రీతూ తావ్డే ఎంపికయ్యారు. అలాగే, శివసేనకు చెందిన కార్పొరేటర్సంజయ్ శంకర్ ఘాడిని డిప్యూటీ మేయర్‌గా కూటమి ఎంపిక చేసింది. శనివారం బీజేపీ నాయకుడు అమిత్ సతమ్.. తావ్డే పేరును, శివసేన నాయకుడు రాహుల్ షెవాలే.. ఘాడి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. అనంతరం వారిద్దరూ నామినేషన్లు వేశారు.
ఈ నెల 11న మేయర్, డిప్యూటీ మేయర్‌ఎన్నిక జరగనుంది. ముంబైలో శివసేనకు కాకుండా వేరే పార్టీకి మేయర్ పదవి దక్కడం 25 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి. బీజేపీ సీనియర లీడర్ రీతూ తావ్డే మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలుపొందారు. బీఎంసీ విద్యా కమిటీ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. 227 మంది సభ్యులున్న బీఎంసీకి జనవరి 15న జరిగిన ఎన్నికల్లో బీజేపీ 89 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 29 స్థానాలను గెలుచుకుంది.
మహాయుతి కూటమి మొత్తం 118 మంది కార్పొరేటర్లతో 114 మెజారిటీ మార్కును దాటి మేయర్ పదవిని దక్కించుకుంది. 1997 నుంచి 25 సంవత్సరాల పాటు బీఎంసీని పాలించిన శివసేన(యూబీటీ) 65 స్థానాలను గెలుచుకోగా.. దాని మిత్రపక్షాలైన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) 6, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) ఒక స్థానంతో సరిపెట్టుకున్నాయి. అలాగే, కాంగ్రెస్ 24 స్థానాలను, ఎంఐఎం 8, ఎన్సీపీ (అజిత్) 3, సమాజ్ వాదీ పార్టీ 2 స్థానాలను గెలుచుకున్నాయి.
డిప్యూటీ మేయర్లుగా నలుగురికి చాన్స్..
శివసేన.. తన పార్టీలోని నలుగురు కార్పొరేటర్లకు అవకాశం కల్పించడానికి డిప్యూటీ మేయర్ పదవీకాలాన్ని నాలుగు భాగాలుగా విభజించింది. ఒక్కొక్కరు ఈ పదవిలో 15 నెలల పాటు పనిచేసేలా నిర్ణయించింది. తొలి విడత సంజయ్ శంకర్ ఘాడికి అవకాశం ఇచ్చింది.
