పెన్ గంగ ఉగ్రరూపం.. నీట మునిగిన పంట పొలాలు, తెగిపోయిన రోడ్లు

పెన్ గంగ ఉగ్రరూపం.. నీట మునిగిన పంట పొలాలు, తెగిపోయిన రోడ్లు

ఆదిలాబాద్/జన్నారం/కుంటాల/నేరడిగొండ/నార్నూర్/చెన్నూర్​/ పెంబి, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. నదులు, కాలువలు ఉప్పొంగుతున్నాయి. అనేక చోట్ల పంట పొలాలు నీట మునిగిపోయాయి. ఆదిలాబాద్​ జిల్లా జైనథ్ మండలంలోని డోల్హార వద్ద పెన్ గంగా ఉగ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడు లేనివిధంగా బ్రిడ్జిని తాకుతూ వరద నీరు పారుతోంది. భీంపూర్ మండలంలోని వడూర్ సమీపంలో పెన్ గంగ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది ఒడ్డుకు ఉన్న తన పడవ కోసం వెళ్లిన రావుల దాదాబి  వరదలో చిక్కుకుపోయాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన కుశాల్, శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు సైతం వరద ప్రవాహం కారణంగా చిక్కుకుపోయారు.

చెట్ల కొమ్మలు పట్టుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గంట పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని టైర్లు, తాడు సహాయంలో అతికష్టం మీద వారిని ఒడ్డుకు చేర్చారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని బంగారిగూడ వాగు ఉధృతికి ఓ డెడ్​బాడీ కొట్టుకొచ్చింది. ఆ డెడ్​బాడీని బయటకు తీసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియలేదు. దీంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో చాలా చోట్ల లోలెవల్ బ్రిడ్జిల పై నుంచి వరద ప్రవహించడంతో గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. 

ప్రజల అవస్థలు

బంగారి గూడ కాలనీలోని ఇండ్లన్ని వరద నీటితో నిండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీకి చెందిన 50 కుటుంబాలకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పునరావాసం కల్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ కాలనీలో పర్యటించి వారి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడ, మహాలక్ష్మివాడ, జైజవాన్ నగర్, తిలక్ నగర్, శివారు ప్రాంతాల కాలనీలు నీట మునిగాయి. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో నిత్యవసర సరుకులు, ఇతర సామగ్రి తడిసిపోయాయి. బంగారుగూడ కాలనీవాసులను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పునరావాసం కల్పించారు. పెన్ గంగ పరివాహక ప్రాంతాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న పరిశీలించారు. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నష్టపోయిన రైతులు

కుంటాల, జన్నారం మండలాలు అతలాకుతలమయ్యాయి. జన్నారంలోని కవ్వాల్, కొత్తపేట గ్రామాల మధ్య ఉన్న తారు రోడ్డు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో కొత్తపేట గ్రామ ప్రజలు మండల కేంద్రానికి రాకపోకలు కొనసాగించేందుకు వీలు లేకుండా పోయింది. అనేక చోట్ల పంట పొలాలు నీటి మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నేరడిగొండ మండలంలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కుప్టి, వాగ్దారి వాగులు వంతెనను తాకి ఉప్పొంగి ప్రవహించడంతో కుంటాల జలపాతానికి భారీగా వరద చేరుకుంటోంది. దీంతో వాగు పరివాహక ప్రాంతంలోని పంటలు పూర్తిగా నీట మునిగాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. స్థానిక వాగు పొంగుతుండటంతో నార్నూర్ మండలంలోని మలంగి గ్రామపంచాయతీ పరిధి బారిక్ రావ్ గుడా గ్రామస్తులు తాడు సాయంతో వాగు దాటారు. మంచిర్యాల జిల్లాలో కురిసిన వర్షాలకు కోటపెల్లి–నీల్వాయి మధ్య అడవిలోని కల్వర్టు వద్ద ప్రధాన రహదారి ఇరువైపులా కోతకు గురైంది. దీంతో ఈ రెండు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.